ఈ చిరుతల ముందు శిఖరం చిన్నబోయింది!

వాళ్లకు పట్టుమని పదేళ్లు లేవు. గట్టి సంకల్పం మాత్రం ఉంది. పెద్దగా కండబలం లేదు. గుండెధైర్యం మాత్రం ఉంది. అపార అనుభవం లేదు. ఎలాగైనా సాధించాలన్న కసి మాత్రం ఉంది. వనరులు పరిమితమే.. ఆశలు.. ఆశయాలు మాత్రం అపరిమితం.. అందుకే అనుకున్నది సాధించారు.

Published : 31 Jul 2021 01:37 IST

వాళ్లకు పట్టుమని పదేళ్లు లేవు. గట్టి సంకల్పం మాత్రం ఉంది. పెద్దగా కండబలం లేదు. గుండెధైర్యం మాత్రం ఉంది. అపార అనుభవం లేదు. ఎలాగైనా సాధించాలన్న కసి మాత్రం ఉంది. వనరులు పరిమితమే.. ఆశలు.. ఆశయాలు మాత్రం అపరిమితం.. అందుకే అనుకున్నది సాధించారు. ఎత్తైన మంచు శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తమతోటి పిల్లల్లోనూ స్ఫూర్తిని నింపారు.

నంతపురం జిల్లాకు చెందిన కడపల రిత్వికశ్రీ, కడపల భవ్యశ్రీ, సీల్ల యశశ్విత, జి.సూర్య, కర్నూలు జిల్లాకు చెందిన గంధం భువన్‌.. ఈనెల 21న లద్దాఖ్‌ ప్రాంతంలోని 5,359 మీటర్ల ఎత్తైన ఖర్‌దుంగ్‌లా మంచు శిఖరాన్ని అధిరోహించారు. పెనుసవాళ్లతో కూడిన ఈ యాత్రను కేవలం అయిదురోజుల్లోనే పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నుంచి సైతం మన్ననలు అందుకున్నారు.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా...

ఖర్‌దుంగ్‌లా పర్వతం మంచు, పెద్ద పెద్ద బండరాళ్లతో ఉంటుంది. ఈ రాళ్లమొనలు పదునుగా ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్రగాయాలు తప్పవు. ఇలాంటి కఠినమైన శిఖరాన్ని ఈ చిన్నారుల బృందం ఎక్కడా తడబాటుకు గురికాకుండా అధిరోహించింది. దీనికి ముందు వీళ్లు బత్తలపల్లిలోని స్పోర్ట్‌ సెంటర్‌లో 3 నెలలపాటు కఠిన శిక్షణ తీసుకున్నారు. గండికోటలోని రాక్‌క్లైంబింగ్‌ అకాడమీలో పదిరోజులు తర్ఫీదు పొందారు.

సాహసం వెనక సంకల్పం!

నిజానికి వీరి సాహసం వెనక ఓ సత్సంకల్పం దాగి ఉంది. అనంతపురంలో గడచిన 50 ఏళ్లుగా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ సంస్థ 2012లో అనాథలు, నిరుపేద విద్యార్థుల సహాయార్థం ‘ఇండియా ఫర్‌ ఇండియా’ కార్యక్రమాన్ని రూపొందించింది. ‘స్పందించు... సాయమందించు’ అనే నినాదంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామగ్రామాన హుండీలను అందజేశారు. దీంట్లో తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని వేయవచ్చు. ఇలా వచ్చిన డబ్బుతో తెలుగు రాష్ట్రాల్లో 2,000 మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 1,295 మంది ఈ నగదుతోనే చదువుకుంటున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని దేశానికి పరిచయం చేయాలన్న సత్సంకల్పంతో వీరు ఈ యాత్రను చేపట్టారు.

పైలట్‌ అవ్వాలన్నది కల

ఈ ఏడాదిలోనే రెండు కఠినమైన కిలిమంజారో, ఖర్‌దుంగ్‌లా పర్వతాలను అధిరోహించా. త్వరలోనే రష్యాలోని పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను. ఇందుకు సన్నద్ధమవుతున్నాను. పైలట్‌ అవ్వాలన్నది నా కల.

- రిత్వికశ్రీ, ఎం.అగ్రహారం, తాడిమర్రి మండలం

ఎవరెస్టు అధిరోహించాలన్నదే లక్ష్యం

ఇంతకు ముందు రిత్వికశ్రీ కిలిమంజారో పర్వతం అధిరోహించినప్పుడు నాకూ అలా చేయాలనిపించింది. అందుకే ఖర్‌దుంగ్‌లా పర్వతం అధిరోహించాను. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్నది నా కల.

- సీల్ల యశశ్విత, అనంతపురం జిల్లా

- న్యూస్‌టుడే, తాడిమర్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు