Published : 24 Sep 2021 00:24 IST

ఈ బుల్లెట్టు బండి డుగ్గు డుగ్గు అనదు!

పైన హెడ్డింగ్‌ చదివి.. ‘బుల్లెట్టు బండి అన్నాక.. తప్పకుండా డుగ్గు డుగ్గు అనాలి కదా!.. మరి అనకపోవడం ఏంటబ్బా..’ అని ఆలోచిస్తున్నారా? ‘ఆఁ.. ఏముందిలే.. ఆ బండి పాడై ఉంటుంది. అందుకే ‘డుగ్గు డుగ్గు’ అనడం లేదేమో!’ అని చెబుదామనుకుంటున్నారా..! అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అది నడిచే స్థితిలోనే ఉంది. అయినా డుగ్గు డుగ్గుమని అననే అనదు! ఎందుకో తెలుసుకోవాలని తెగ ఉబలాటంగా ఉంది కదూ! ఇంకేం మరి ఎంచక్కా ఈ కథనం చదివేయండి. కారణం ఏంటో మీకే తెలుస్తుంది!

దిల్లీకి చెందిన రాజన్‌కు 15 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్‌ వస్తువులు, ముఖ్యంగా ఆటబొమ్మలంటే చాలా ఇష్టం. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ఇదే రాజన్‌ను రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసేలా చేసింది.

నాన్నకు అబద్ధం చెప్పి...

‘నాన్నా.. మా స్కూలు వాళ్లు నాకు ఓ ప్రాజెక్ట్‌ వర్క్‌ ఇచ్చారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేయాలి నేను’ అని తన తండ్రితో రాజన్‌ అబద్ధం చెప్పాడు. పాపం.. వాళ్ల నాన్న ఇది నిజమేనేమో అని నమ్మేసి ఊరంతా జల్లెడపట్టి ఓ పాత రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను తుక్కుదుకాణం నుంచి పదివేలరూపాయలకు కొని తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇక మిగతా పనంతా మన రాజనే చూసుకున్నాడు. వెల్డింగ్‌ చేసే క్రమంలో చాలా సార్లు గాయపడ్డాడు. అయినా వెనకడుగు వేయలేదు.

మూడునెలల్లోనే..

ఇలా మూడు నెలలు కష్టపడి కేవలం రూ.45,000 ఖర్చుతో ఎలక్ట్రిక్‌ రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను తయారు చేశాడు. ఒక్కసారి ఈ దీన్ని ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. చివరికి ఇది ప్రాజెక్ట్‌ వర్క్‌ కాదని తెలిసి రాజన్‌ వాళ్ల నాన్న ఆశ్చర్యపోయాడు. అయినా తన కొడుకు పడ్డ కష్టాన్ని చూసి ఆనందించాడు. ‘నేను కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ముందు ఓ ఈ- సైకిల్‌ తయారుచేయాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను ఓసారి గాయపడ్డాను. అంతే.. ఇక అప్పటి నుంచి మా నాన్న నన్ను ఈ ప్రయోగాలు చేయడానికి వీల్లేదన్నారు. అందుకే నేను నాన్నకు ఇది స్కూల్‌ ప్రాజెక్ట్‌ అని అబద్ధం చెప్పి ఈ- బుల్లెట్‌ బైక్‌ తయారు చేయాల్సివచ్చింది’ అంటున్నాడు రాజన్‌. ఎంతైనా రాజన్‌ గ్రేట్‌ కదూ!

ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదూ... ఇది ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ బండి కాబట్టి ‘డుగ్గు..డుగ్గు’ అని శబ్దం చేయదని!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు