జమీందారు కోపానికి కారణమేంటి?

స్వర్ణగిరి రాజ్యానికి జమీందారు భూపతివర్మ. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆయన తన రాజ్యంలో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించాడు.

Published : 29 Apr 2024 00:11 IST

స్వర్ణగిరి రాజ్యానికి జమీందారు భూపతివర్మ. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆయన తన రాజ్యంలో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించాడు. స్వర్ణగిరికి ఏదైనా పని మీద వచ్చిన వారు, మధ్యాహ్నం సత్రంలో భోజనం చేసి తిరిగి తమ గ్రామాలకు వెళ్లేవారు. అక్కడ భోజనం చాలా రుచికరంగా ఉండేది. కేవలం రుచే కాకుండా.. పరిశుభ్రత కూడా పాటించేవారు. జమీందారు కూడా ప్రతిరోజూ మధ్యాహ్నం అక్కడే ప్రజలతో కలిసి భోజనం చేసేవాడు. అలా రోజులు గడుస్తున్న క్రమంలో.. ఎప్పుడూ లేనిది భూపతివర్మలో కోపం ఎక్కువైంది. సత్రానికి వచ్చిన అతిథులను, అక్కడ పని చేసేవారిని కోపగించుకోవడం, విసుక్కోవటం చేయసాగాడు. తన ఇంట్లో వాళ్ల మీద కూడా అరవడం ప్రారంభించాడు. తనకు తెలియకుండానే మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. అది గమనించిన జమీందారు భార్య సుచిత్రా దేవి.. ‘గత కొన్ని రోజులుగా మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి’ అని అడిగింది. దానికి.. ‘నాకెలాంటి సమస్యలు లేవు’ అని జవాబిచ్చాడు జమీందారు.

కాశీలో ఉండే త్రినేత్రానంద స్వామి తీర్థయాత్రలు చేస్తూ స్వర్ణగిరికి చేరుకున్నాడు. ఆయనను ఇంటికి ఆహ్వానించాడు భూపతివర్మ. సమయం చూసి భర్త ప్రవర్తనలో మార్పు గురించి ఆ స్వామికి చెప్పి.. పరిష్కారం అడిగింది సుచిత్రా దేవి. తప్పకుండా చెబుతానని బదులిచ్చాడాయన. ఇంతలోనే.. ‘స్వామీ! మీ కోసం భోజనం సిద్ధంగా ఉంది రండీ!’ అన్నాడు జమీందారు. అప్పుడు ఆయన.. ‘భూపతీ! నువ్వు కట్టించిన అన్నదాన సత్రం గురించి విన్నాను. ప్రతిరోజూ మధ్యాహ్నం ప్రజలతో కలిసి నువ్వు అక్కడే భోజనం చేస్తావని తెలుసుకున్నాను. ఈరోజు నీతో పాటు నేనూ అక్కడే భోజనం చేస్తాను’ అన్నాడు. వారితో సుచిత్రా దేవి కూడా సత్రానికి బయలుదేరింది. పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన కోనప్ప సత్రంలో ప్రధాన వంట వాడిగా పని చేస్తున్నాడు. అతని చేతి వంట రుచి కోసమే చాలా మంది సత్రానికి వస్తుంటారు. భూపతివర్మకు కూడా అతని వంటలు చాలా ఇష్టం. కానీ.. కొద్ది రోజులుగా వంటల్లో ఉప్పు, కారాలు సరిపోను వేయడం లేదు. ఒక్కోసారి వేయటమే మర్చిపోతున్నాడు. కోనప్ప వారం రోజుల క్రితం భూపతివర్మను కలిసి ‘అయ్యా! ఎంతో కాలంగా మీ వద్ద పని చేస్తున్నాను. నా జీతం మాత్రం పెంచడంలేదు. పై చదువులకు వచ్చిన కొడుకు, పెళ్లి చేయాల్సిన కూతురు ఉన్న విషయం మీకూ తెలుసు’ అన్నాడు. ‘చూద్దాంలే! ముందు మనసు పెట్టి వంట చేయి. ఈ మధ్య వంటలు రుచి లేకుండా చప్పగా ఉంటున్నాయి’ అని మందలించాడు.

సత్రానికి చేరుకున్న త్రినేత్రానంద స్వామి.. భూపతివర్మ, సుచిత్రాదేవిలతో కలిసి అక్కడంతా పరిశీలనగా చూశాడు. ప్రజలతో కలిసి ముగ్గురూ భోజనం ఆరగించారు. ఆ తర్వాత.. మళ్లీ మందిరానికి చేరుకున్నారు. ‘భూపతీ! వంటశాలలో సహాయకుల మీద అరుస్తూ, చిరాకు పడుతూ వంట చేస్తున్న కోనప్పను గమనించాను. వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా ఉండి.. సంతోషంగా చేస్తేనే దానికి రుచితో పాటు.. తిన్న వారి మనసులు కూడా సంతోషంగా ఉంటాయి. లేకపోతే వారి మనస్సులు కూడా కోపతాపాలకు నిలయమవుతాయి. అదే నువ్వు మానసికంగా ప్రశాంతంగా ఉండపోవడానికి కూడా కారణం’ అన్నాడా స్వామి. ‘పొరపాటు నాదే స్వామీ! కోనప్ప గతంలో రెండుమూడు సార్లు జీతం పెంచమని అడిగినా.. పని ఒత్తిడి వల్ల ఆ ఆలోచన కూడా చేయలేదు’ అన్నాడు జమీందారు. భర్త ప్రవర్తనకు కారణం చూపిన త్రినేత్రానంద స్వామికి కృతజ్ఞతలు తెలిపింది సుచిత్రా దేవి. ఇక వెంటనే కోనప్ప జీతం పెంచాడు భూపతి. అంతే కాకుండా.. తన కొడుకు చదువు పూర్తవ్వగానే.. దివానంలో ఉద్యోగం ఇస్తానని, కూతురు పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చాడు. ఇక అప్పటి నుంచి ఎప్పటిలా సత్రంలో రుచికరమైన భోజనం తినసాగారు ప్రజలు.

పైడిమర్రి రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని