పాడుతా.. తీయగా..!

ఒక అడవికి రాజు సింహం. అది తన రాజ్యాన్ని చక్కగా పాలించేది. ఆ కేసరి కళల్నీ ప్రోత్సహించేది. దానికి చక్కని సంగీతమన్నా, మంచి పాటలన్నా చాలా ఇష్టం. అది తన ప్రతి పుట్టినరోజుకీ వివిధ రకాల పోటీలు పెట్టి, అందులో అద్భుత ప్రతిభ కనబర్చిన వాటికి బహుమతులు ఇచ్చేది.

Published : 25 Apr 2024 00:39 IST

క అడవికి రాజు సింహం. అది తన రాజ్యాన్ని చక్కగా పాలించేది. ఆ కేసరి కళల్నీ ప్రోత్సహించేది. దానికి చక్కని సంగీతమన్నా, మంచి పాటలన్నా చాలా ఇష్టం. అది తన ప్రతి పుట్టినరోజుకీ వివిధ రకాల పోటీలు పెట్టి, అందులో అద్భుత ప్రతిభ కనబర్చిన వాటికి బహుమతులు ఇచ్చేది. ఈసారి కూడా తన పుట్టినరోజుకు పాటల పోటీలు పెట్టింది. పాల్గొనడానికి అడవిలోని అన్ని జంతువులతో పాటూ, పక్షులు కూడా ఉత్సాహంగా సింహం ఆస్థానానికి చేరుకున్నాయి.

ముందుగా రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. అది ఏర్పాటు చేసిన పసందైన విందును ఆరగించాయి. ఆ తర్వాత పోటీలో పాల్గొన్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, పులి వంటి పెద్ద జంతువులు తమ గళాల్ని వినిపించాయి. అవేవీ రాజుకు నచ్చలేదు. ఆ తర్వాత చిన్న జంతువులైన కోతి, కుందేలు, తోడేలు వంటివి గానం చేశాయి. అవీ సింహానికి నచ్చలేదు. చివర్లో పక్షుల వంతు వచ్చింది. ముందుగా చిలుక తన చిట్టి, ఎర్రని ముక్కుతో చిన్న పాటను ఆలపించింది. అది కొంత వరకు సింహానికి నచ్చింది కానీ అది పూర్తి సంతృప్తి చెందలేదు.

ఆ తర్వాత నెమలి, పావురం, కాకులు వంటివి ఆలపించాయి. అవీ సింహాన్ని తమ గొంతులతో మెప్పించలేకపోయాయి. ఇంతలో కుంటుకుంటూ అక్కడకి వచ్చింది ఒక పక్షి. దానికి ఒక కాలు లేదు. అది ఒంటి కాలిపై నడుస్తూ రావడం చూసి జంతువులు, పక్షులు నవ్వాయి. దాని నడక చూసి సింహం.. ‘ఎవరు నువ్వు? నీ కాలు ఏమైంది?’ అని అడిగింది సింహం. అందుకు ఆ పక్షి.. ‘ప్రభూ! నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. ఒక వేటగాడు గురి చూసి వదిలిన బాణం నుంచి నా ప్రాణం కాపాడుకున్నాను.. కానీ అది నా కాలును గాయపరిచింది. నేను పైన ఎగురుతున్నంతసేపూ నాకు బాధ తెలియదు కానీ, నేను కింద నడిచేటప్పుడు మాత్రం నాకు ఈ అవస్థలు తప్పవు. నా అవిటితనాన్ని, నా నడకను చూసి మీ రాజ్యంలోని జంతువులు, పక్షులు అన్నీ నన్ను అవహేళన చేస్తున్నాయి. అయినా బాధ పడలేదు. నేను కూడా మీరు పెట్టిన ఈ పోటీలో పాల్గొనాలని వచ్చాను ప్రభూ.. మీరు అనుమతిస్తే నా గాత్రం వినిపిస్తాను’ అంది వినయంగా.  

దాన్ని చూసిన పక్షులు, జంతువులు మళ్లీ హేళనగా నవ్వాయి. ‘ఇక్కడున్న మహా మహా జంతువులు, పక్షుల వల్లే కాలేదు. చిన్న పక్షివి, పైగా అవిటి దానివి. నీ వల్ల ఏమవుతుంది?’ అని వ్యంగ్యంగా మాట్లాడాయి. అయితే సింహం దానికో అవకాశం ఇచ్చింది. అది రాజుకు ధన్యవాదాలు చెప్పి ఎగురుకుంటూ ఒక పెద్ద చెట్టు పైకి ఎగిరి, కొమ్మల్లో దాక్కొని తన రాగాల్ని ఆలపించింది. దాని మృదు మధురమైన రాగాలకు సింహంతో పాటూ అక్కడున్న పక్షులు, జంతువులు కూడా మంత్ర ముగ్ధులవుతూ తన్మయత్వంతో తలలూపాయి.

సింహం... ‘శభాష్‌ పక్షీ! నీ మృదు మధురమైన గానంతో మా మనసుల్ని రంజింప చేశావు. ఈసారి మేమిచ్చే బహుమతికి నీవే అర్హురాలివి’ అంటూ అభినందించింది. అప్పుడు దాన్ని అవహేళన చేసిన పక్షులు, జంతువులు ఏ జీవినీ తక్కువ చేసి మాట్లాడకూడదని తెలుసుకున్నాయి. ఆ పక్షికి ఓ కాలు లేకపోయినా.. అద్భుతమైన గాత్రం తన సొంతమని తెలుసుకున్న అవి, దాని ప్రతిభను ఎంతో మెచ్చుకున్నాయి. అప్పటి నుంచీ ఆ కోకిల సింహం ఆస్థానంలో గాయనిగా పదవిని అలంకరించింది.  

నంద త్రినాథరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు