వేసవి సెలవుల్లో ఆడుతూ... పాడుతూ...!

‘చిట్టీ! ఎనిమిది గంటలు కావస్తోంది. ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? లే..’ అంది అమ్మ. ‘అబ్బా పోమ్మా! ఇప్పుడు మాకు సెలవులు.. లేచి ఏం చేయాలి?’ ముసుగు తీయకుండా అలాగే నిద్రపోతున్నట్లు నటిస్తూ అంది చిట్టి.

Updated : 26 Apr 2024 04:16 IST

చిట్టీ! ఎనిమిది గంటలు కావస్తోంది. ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? లే..’ అంది అమ్మ. ‘అబ్బా పోమ్మా! ఇప్పుడు మాకు సెలవులు.. లేచి ఏం చేయాలి?’ ముసుగు తీయకుండా అలాగే నిద్రపోతున్నట్లు నటిస్తూ అంది చిట్టి. ‘నానమ్మతో ఆడుకోవాలి’ అని అటుగా వచ్చిన నానమ్మ అంది. ‘నీకు ఆటలు ఆడడం రాదుగా నానమ్మా?’ అని దుప్పట్లో నుంచే అంది చిట్టి. ‘నువ్వు తొందరగా లేస్తే.. కొత్త ఆటలు చాలా నేర్పుతాను’ అందామె. ‘ఓ.. అలా అయితే తొందరగా తయారై నీ దగ్గరకు వస్తాను’ అంది చిట్టి.
అన్నట్లుగానే త్వరగా పళ్లు తోముకుని, అమ్మను విసిగించకుండా స్నానం చేసి వచ్చింది చిట్టి. ‘రోజూ.. నీకు స్కూలుకు టైం అవుతోందని మీ అమ్మ నీకు అందరికన్నా ముందుగా టిఫిన్‌ తినిపిస్తుంది. సెలవుల్లో నువ్వు టిఫిన్‌, భోజనం కూడా అందరితో కలిసి తినాలి. సరేనా?’ అంది నానమ్మ. ‘అలాగే నానమ్మా!’ అని సమాధానమిచ్చింది చిట్టి. కాసేపాగి అందరితో కలిసి టిఫిన్‌ తింటుంటే చిట్టికి కొత్తగా అనిపించింది. ‘చిట్టీ! నువ్వు తిన్న పళ్లెం, రోజూ సింక్‌లో పెడతావు కదా? ఈ రోజు నుంచి నువ్వు తిన్న పళ్లెం నువ్వే కడగడం నేర్చుకోవాలి’ అంది నానమ్మ.
‘అత్తయ్యా! వద్దు లెండి, గౌను మీద నీళ్లు పోసుకుంటుంది’ అంది అమ్మ. ‘ఒకటి, రెండు సార్లు చేత కాదు. తర్వాత తనే గౌను తడుపుకోకుండా జాగ్రత్తగా ఉంటుంది. అమ్మ పనిలో కష్టం ఇప్పటి నుంచే పిల్లలకు తెలియాలి’ అంది నానమ్మ. చిట్టి తాను తిన్న పళ్లెం చాలాసేపు కడిగింది. పంపు నీళ్లతో ఆడుతూ గౌను మీద నీళ్లు పోసుకుంది. నానమ్మ ఆ గౌను మార్చి వేరేది వేసింది. తర్వాత తనతో మొక్కలకు నీళ్లు పట్టించింది.
‘చిట్టీ... ఇప్పుడు మనిద్దరం కూరగాయల మార్కెట్‌కు వెళ్దామా?’ అంది నానమ్మ. ‘అలాగే నానమ్మా! ఆటోలో వెళ్దాం’ అంది చిట్టి. ‘ఎండ లేదు కదా, వెళ్లేటప్పుడు సరదాగా నడిచి వెళ్దాం.. వచ్చేటప్పుడు ఆటోలో వద్దాం’ అందామె. చిట్టి ముందు కొంచెం ముఖం మాడ్చినా, తర్వాత సరేనని తలూపింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడిచి మార్కెట్‌కు వెళ్లారు. ‘నానమ్మా! అప్పుడే మార్కెట్‌కు వచ్చేశామా?’ అంది చిట్టి. ‘మాట్లాడుతూ నడిస్తే దూరం తెలియదు. ఆరోగ్యం బాగుండాలి అంటే నడవాలి’ అని నవ్వుతూ చెప్పింది నానమ్మ. చిట్టి మాట్లాడకుండా ఆలోచిస్తోంది.
‘నీకు నచ్చిన కూరలు కావాలంటే వాటి కోసం మార్కెట్‌ అంతా వెతకాలి మరి’ అంది నానమ్మ. ‘దీని పేరేంటి? నానమ్మా! దాని పేరేంటి?’ అని అన్ని కూరగాయల పేర్లూ తెలుసుకుంది చిట్టి. ఆ పేర్లు చెబుతూనే, అవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరంగా చెప్పింది నానమ్మ. తర్వాత ఇద్దరూ కలిసి ఆటోలో ఇంటికి వచ్చారు. ‘చిట్టీ! అమ్మ ఒక్కతే కష్టపడుతుంటే మనం కూర్చుని టీవీ చూడటం బాగుండదు. మనం ఒక్కో పనిలో సాయం చేస్తుంటే తనకు తేలికగా ఉంటుంది. సెలవుల్లో నువ్వు ఇది అలవాటు చేసుకోవాలి’ అంది నానమ్మ.
‘అయితే ఇప్పుడు నేనేం చేయాలి?’ అంది చిట్టి. ‘మనం తెచ్చిన కూరగాయలు ఫ్రిజ్‌లో సర్దడానికి, ఈ రోజు వంటకు కావాల్సిన కూరగాయలు కోయడానికి నాకు సహాయం చెయ్యాలి’ చెప్పింది నానమ్మ. చిట్టి తన చిట్టి చిట్టి చేతులతో నానమ్మకు సహకరించింది. వంట అయ్యాక అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. ‘చిట్టీ! భోజనం చేయగానే నిద్రపోకూడదు. నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు నేర్పుతాను. కాసేపు ఆడుకుందాం రా!’ అంది నానమ్మ.
తన పాత ట్రంకు పెట్టెలోని గవ్వలు, అచ్చంగాయలు ఆడుకునే రాళ్లు తీసింది. అయిదు రాళ్లతో ఆట ఆడటం చూపించింది. తర్వాత వాటిలో మూడురాళ్లు తీసి నేల మీద ఛాక్‌పీస్‌తో దాడి ఆటకు గళ్లు గీసి ఆట నేర్పించింది. ఇంకా అష్టాచమ్మా ఆట కూడా నేర్పించింది. కొత్త ఆటలు నేర్చుకోవడంలో లీనమవడంతో చిట్టికి తెలియకుండానే సాయంత్రం అయిపోయింది.
‘చిట్టీ! ఈ ఆటల వల్ల నీకు ఏకాగ్రత పెరుగుతుంది. వేసవి కాలం ఎండబారిన పడకుండా ఇంట్లో కూర్చుని అన్ని వయసుల వారూ ఆడుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఆటలున్నాయి. నేను నీకు నేర్పిస్తాను’ అంది నానమ్మ. ‘సరే నానమ్మా! సెలవుల్లో రోజూ ఇలాగే చేయాలా?’ అంది చిట్టి. ‘రోజూ ఒకే పనులు ఉండవు. ఈ రోజు తెచ్చిన కూరగాయలు అయిపోయేంత వరకు మళ్లీ మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మకు సాయంగా ఇంట్లో నీళ్ల సీసాలు నింపడం, కుర్చీలు, కిటికీలు తుడవడంలాంటి చిన్న చిన్న పనులు చేయవచ్చు. సాయంత్రాలు ఒకరోజు గుడికి మరో రోజు పార్కుకు వెళ్తే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం ఎంచక్కా ఎక్కాలు, శ్లోకాలు తాతయ్య దగ్గర నేర్చుకోవచ్చు’ అంది నానమ్మ.
‘అమ్మో.. ఇన్ని చేయాలా?’ అని ఆశ్చర్యంగా అంది చిట్టి. ‘అవును చిట్టీ! సెలవుల్లో ఆడుతూ పాడుతూ పనులు నేర్చుకోవచ్చు. నీకు కష్టమనిపించిన పాఠాలు నేర్చుకోవచ్చు. దూరంగా ఉన్న బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు కూడా వెళ్లవచ్చు. కానీ రోజూ పొద్దున్నే లేవటం, పెందలాడే పడుకోవటం మాత్రం మంచి అలవాటు’ అంది నానమ్మ.
‘నానమ్మా! స్కూల్‌ ఉన్నప్పటి కంటే సెలవుల్లోనే ఎక్కువ పనులున్నాయిగా’ అని కినుకగా అంది చిట్టి. ‘క్రమశిక్షణ పాటిస్తే ఏదైనా సులువే! మా చిట్టి బంగారం.. రేపటి నుంచి పొద్దున్నే నిద్రలేస్తుంది’ అంది నానమ్మ. ‘మీరు చెప్పాక మనవరాలు వినకుండా ఉంటుందా?’ అని అంది అమ్మ. తర్వాత ముగ్గురూ కలిసి హాయిగా నవ్వుకున్నారు.
 కేవీ సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని