అన్నం పరబ్రహ్మ స్వరూపం!

‘బాబీ! ఈ రోజు మనం పెళ్లికి వెళ్తున్నాం. త్వరగా నీ ఆట వస్తువులు సర్దుకుంటే నీకు దుస్తులు మార్చి తయారు చేస్తాను’ అంది అమ్మ. ‘అలాగే అమ్మా!’ అంటూ ఉత్సాహంగా పరిగెత్తాడు బాబీ.

Updated : 10 May 2024 04:06 IST

బాబీ! ఈ రోజు మనం పెళ్లికి వెళ్తున్నాం. త్వరగా నీ ఆట వస్తువులు సర్దుకుంటే నీకు దుస్తులు మార్చి తయారు చేస్తాను’ అంది అమ్మ. ‘అలాగే అమ్మా!’ అంటూ ఉత్సాహంగా పరిగెత్తాడు బాబీ. తనకు పెళ్లి భోజనాలంటే చాలా సరదా. అన్ని రకాల ఆహార పదార్థాలు చూసి అన్నీ తినేయాలనే ఆత్రం కూడా చాలా ఎక్కువ. చూసినవన్నీ తినలేక వృథా చేస్తుంటాడు. బాబీ అమ్మతో కలిసి పెళ్లికి వెళ్లాడు. అక్కడ బఫే భోజనాలు ఏర్పాటు చేశారు.

‘బాబీ! నువ్వు తినే పదార్థాలు మాత్రమే నీకు పెడతాను. ఒక్కో పదార్థం చూపిస్తూ నిన్ను అడుగుతాను. నీకు అది కావాలంటే పెడతాను. అన్నీ కావాలని పెట్టించుకుని, కొంచెం తిని పారేయకు’ అంది అమ్మ. ‘అవి తింటేనే కదా రుచి తెలుస్తుంది. నువ్వు చూపిస్తే ఎలా తెలుస్తుంది? నాకు అన్ని రకాలు పెట్టు’ అన్నాడు బాబీ.

‘అన్నీ నీకు తెలియక పోయినా కొన్ని రకాలు తెలుసు కదా?’ అంది అమ్మ. అలా ఒప్పుకోలేదు బాబీ. ‘పోనీ, ముందు నీకు పెట్టి, అవి నీకు నచ్చకపోతే నేను తీసుకుంటాను. సరేనా?’ అంది అమ్మ. ‘సరే అలాగే!’ అన్నాడు బాబీ. తర్వాత అక్కడ ఉన్న అన్ని రకాల స్వీట్లు వరసగా పెట్టించుకున్నాడు. ప్రతిదీ కొంచెం తిని ‘ఇది నాకు వద్దమ్మా! నువ్వు తీసుకో..’ అంటూ ఇచ్చేస్తున్నాడు.

‘బన్నీ! నువ్వు ఇచ్చేవన్నీ నేను తినలేను. ఒక నిమిషం ఆగు’ అంటూ తన దగ్గరున్న హ్యాండ్‌ బ్యాగ్‌లో నుంచి ఒక కవర్‌ తీసి ఆ పదార్థాలన్నీ దానిలో పెట్టింది. ‘అమ్మా! ఎందుకు ఆ కవర్లో పెడుతున్నావు? అటు చూడు అందరూ నచ్చనివన్నీ చెత్తబుట్టలో పారేస్తున్నారు. నువ్వు అలా కవర్లో పెట్టుకుని తీసుకెళ్తే అందరూ నవ్వుతారు’ అన్నాడు బన్నీ. ఆ మాటలకు బన్నీ వాళ్ల అమ్మ నవ్వింది!

కాసేపటి తర్వాత ఇద్దరూ భోజనం చేసి బయటకు వచ్చారు. పెళ్లి ఇంటికి కాస్త దూరంలో కొందరు యాచకులు గిన్నెలు పట్టుకుని నిలబడున్నారు. బన్నీ వాళ్ల అమ్మ తనతో పాటు తీసుకొచ్చిన కవరు వాళ్లకు ఇచ్చింది. వాళ్లు ఎంతో సంతోషపడుతూ కవరు తెరిచి అందరూ పంచుకుని గబగబా తింటున్నారు.

‘అమ్మా! అవి నేను బాగా లేవని పారేశాను’ అన్నాడు బన్నీ. ‘అన్నీ చాలా బాగున్నాయి బాబు’ అన్నాడు అందులో బన్నీ వయసున్న ఒక అబ్బాయి. బన్నీ ఆశ్చర్యంగా అమ్మ వైపు చూశాడు. ‘ఆహారం వృథా చేయకూడదని ఎన్ని సార్లు చెప్పినా నీకు తెలియడం లేదు. తినడానికి తిండి లేని వారు చాలా మంది ఉన్నారు. భోజనం చేసేటప్పుడు మనకు సరిపడా పెట్టించుకోవాలి. లేకపోతే చెత్త బుట్ట నిండా ఆహారం ఉంటుంది. అది ఎవరికైనా దానం చేయడానికి కూడా పనికిరాదు. మనం తినకపోతే మరొకరికి పెట్టాలి, కానీ ఆహారాన్ని నిర్లక్ష్యంగా పారేయకూడదు’ అంది అమ్మ.

‘మరి పెళ్లిలో చాలా మంది పారేశారుగా..’ అని ప్రశ్నించాడు బన్నీ. ‘ఎవరు పారేసినా అది తప్పే! ఒకరు తప్పు చేశారని మనం చేయకూడదు. నువ్వు ఆహారాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు అది నీకు దొరుకుతుంది’ అంది అమ్మ.

బన్నీ ఆ అబ్బాయి వైపు చూశాడు. అతని చూపులో తనపై కృతజ్ఞతా భావం కనిపించింది. బన్నీ కూడా స్నేహపూర్వకంగా నవ్వాడు. ‘అమ్మా! మనం మళ్లీ భోజనాలకు వెళ్లినప్పుడు నేను ఏదీ వృథా చేయను’ అన్నాడు బన్నీ. ‘ఆహారాన్ని విందుల్లో మాత్రమే కాదు, ఇంట్లో తిన్నా కూడా ఇదే పద్ధతి పాటించాలి’ అని నవ్వుతూ అంది అమ్మ. ‘సరే అమ్మా!’ అని బుద్ధిగా బదులిచ్చాడు బన్నీ.  

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని