ఎడారి నిండా ఒయాసిస్సులే!

‘ఎడారిలో ఏముంటాయి?’ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ‘ఆ.. ఏముంటాయి.. ఒంటెలుంటాయి..’ అని టక్కున సమాధానం చెబుతాం.

Published : 18 Jun 2021 00:20 IST

‘ఎడారిలో ఏముంటాయి?’ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ‘ఆ.. ఏముంటాయి.. ఒంటెలుంటాయి..’ అని టక్కున సమాధానం చెబుతాం. ‘ఇంకా ఏముంటాయి?’ అని వాళ్లు మళ్లీ అడిగారు అనుకోండి.. ‘ఎడారి మొక్కలు, ఇసుక ఉంటుంది’ అని చెబుదాం. వాళ్లు మళ్లీ.. ‘సరే..సరే.. అవి కాక ఇంకా ఏముంటాయి?’ అని అడిగారనుకోండి. ఈ సారి మనకు కాస్త విసుగొస్తుంది. అయినా.. ఓపిగ్గా కాసేపు బుర్రగోక్కుని ‘ఆ.. ఏముంటుందబ్బా!’ అని ఆలోచించి.. ‘ఆ.. గుర్తొచ్చింది ఒయాసిస్సులుంటాయి’ అని చెబుతాం. అవును మీరు చెప్పింది నిజమే కానీ.. ఈ ఎడారిలో మాత్రం ఏకంగా ఇరవై ఒయాసిస్సులున్నాయి. అదెక్కడో.. అది ఏ ఎడారో తెలుసుకుందామా?

నిద్రాహారాలు మాని మరీ..
లిబియా దేశంలోని సహారా ఎడారిలో పెజ్జాన్‌ అనే ప్రాంతంలో విస్తారమైన ఇసుక దిబ్బలున్నాయ్‌. అందుకే ఈ ప్రదేశాన్ని ‘ఉబరి ఇసుక సముద్రం’ అంటారు. మీకో విషయం తెలుసా! ఇక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా 20 వరకు ఒయాసిస్సులను పరిశోధకులు గుర్తించారు. వామ్మో! ఎడారి ప్రాంతంలో ఇన్ని ఒయాసిస్సులు ఎలా వచ్చాయంటారా?! దాని గురించే పరిశోధకులు నిద్రాహారాలు మాని మరీ శోధించారు. చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ కారణం ఏంటంటే..
ఇది మనం అనుకుంటున్నట్టు మొదట్నుంచీ ఎడారేం కాదు. 2 లక్షల ఏళ్ల కిందట ఈ ప్రాంతమంతా నదులు, సరస్సులతో నిండి ఉండేదట. ఆ తర్వాత నదుల నుంచి కొట్టుకు వచ్చిన ఇసుక కారణంగా కాలక్రమేణా నీరంతా ఎండిపోయి ఇప్పుడిలా ఎడారిలా మారిందట. అలా నదులు ఇసుకతో కప్పడినా ఒయాసిస్సులు మాత్రం అక్కడక్కడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చుట్టూ ఇసుక, మధ్యలో ఒయాసిస్సులు, అక్కడక్కడా చెట్లూ ఇలా ఆ ప్రదేశం చూడ్డానికి భలే విచిత్రంగా ఉంటుంది. అదన్నమాట సంగతి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని