మొక్కే కదా.. అని పీకలేరు!

‘మొక్కే కదా.. అని పీకేస్తే...’ ఇది కదా డైలాగ్‌.. మరేంటి ‘మొక్కే కదా.. అని పీకలేరు’ అని ఉందేంటబ్బా..! అని ఆలోచిస్తున్నారా?.. నిజమే మీరు ఈ మొక్కను నిజంగా పీకలేరు.

Published : 06 Sep 2021 00:50 IST

‘మొక్కే కదా.. అని పీకేస్తే...’ ఇది కదా డైలాగ్‌.. మరేంటి ‘మొక్కే కదా.. అని పీకలేరు’ అని ఉందేంటబ్బా..! అని ఆలోచిస్తున్నారా?.. నిజమే మీరు ఈ మొక్కను నిజంగా పీకలేరు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి చిన్న మొక్క మరి. మరో విషయం ఏంటంటే.. అసలు దీనికి వేర్లే ఉండవు.

నీటి మీద తేలియాడుతూ బతికే ఈ మొక్క పేరు వోల్ఫియా. దీన్నే వాటర్‌ మీల్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ మొక్కలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. మళ్లీ ఇందులో కొన్ని రకాలు ఉంటాయనుకోండి నేస్తాలూ! వీటి బరువు, పొడవు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండు ఇసుక రేణువులు ఎంత ఉంటాయో అంత! మన బొటనవేలు మీద ఇలాంటి మొక్కలు ఓ అయిదువేల వరకు సరిపోతాయన్నమాట.


పువ్వు పూచి.. కాయ కాచి..

ఈ మొక్క అంత చిన్నగా ఉన్నా... దానికి ఓ పువ్వు పూస్తుంది. ఇదే ప్రపంచంలోకెల్లా అతిచిన్న పువ్వు. ఆగండి.. ఆగండి.. అప్పుడే ‘వావ్‌.. నిజమా!’ అని ఆశ్చర్యపోకండి. ఈ వాటర్‌ మీల్‌కు పువ్వే కాదు.. కాయ కూడా కాస్తుంది. అది పండు కూడా అవుతుంది. దాన్ని యుర్టికల్‌ అని పిలుస్తారు. మీరు ఇప్పుడు ఏం అనుకుంటున్నారో తెలుసు..  నిజమే మీ ఊహ నిజమే. ఇదే ప్రపంచంలోకెల్లా అతిచిన్న పండు.


ఎంతో ఉపయోగం..

‘సర్లే.. ఇంత చిన్న మొక్కలతో ఉపయోగం ఏముంటుందిలే!’ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ మొక్కల్ని చేపలు, కప్పల్లాంటి జీవులు ఆహారంగా తీసుకుంటాయి. నీటిలో ఆక్సిజన్‌ స్థాయి పెరుగుదలకు కూడా సహకరిస్తాయి. అంటే వీటి వల్ల పర్యావరణానికి కూడా ఎంతో ఉపయోగం. నేస్తాలూ..! ఇవీ ప్రపంచంలోనే అతిచిన్న మొక్క విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని