భలే.. భలే.. బుజ్జి టెడ్డీలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీ అందరికీ టెడ్డీబేర్‌ అంటే భలే ఇష్టం కదూ! మనలో చాలా మంది టెడ్డీబేర్‌ లేకుండా ఒక పూట కూడా ఉండలేరు! అరచేతిలో పట్టే పరిమాణం నుంచి ఆరడుగులు, అంతకు మించిన

Published : 03 Aug 2022 00:26 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీ అందరికీ టెడ్డీబేర్‌ అంటే భలే ఇష్టం కదూ! మనలో చాలా మంది టెడ్డీబేర్‌ లేకుండా ఒక పూట కూడా ఉండలేరు! అరచేతిలో పట్టే పరిమాణం నుంచి ఆరడుగులు, అంతకు మించిన సైజుల్లో కూడా టెడ్డీబేర్‌లు ఉంటాయి. కానీ బొటనవేలి గోరుకన్నా చిన్న టెడ్డీ బేర్‌ గురించి మీకు తెలుసా...! అయితే ఇంకెందుకాలస్యం, ఈ కథనం చదివేయండి.

ప్రపంచంలోకెల్లా అతి చిన్నది!
ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నదైన ఈ టెడ్డీబేర్‌ పేరు టైనీటెడ్‌. ఎత్తు కేవలం 4.5 మిల్లీమీటర్లు. దీన్ని 2006లో దక్షిణాఫ్రికాకు చెందిన చెరియల్‌ మాస్‌ అనే వ్యక్తి తయారు చేశారు. ప్రస్తుతం ఇది దక్షిణ కొరియాలోని జెజూ ఐస్‌లాండ్‌లోని టెడ్డీ బేర్‌ మ్యూజియంలో ఉంది.

ఇది రెండోది!
రెండో అతిచిన్న టెడ్డీ బేర్‌ పేరు మినీ ద పూ. దీని ఎత్తు 5 మిల్లీమీటర్లు. దీన్ని 2001లో జర్మనీకి చెందిన బెట్టియా కమినిస్కీ తయారు చేశారు. ఇది కూడా చేతి బొటన వేలి గోరుకన్నా చిన్నగానే ఉంటుంది. ప్రస్తుతం దీన్ని బ్రిటన్‌లోని ‘ఎ వరల్డ్‌ ఇన్‌ మినియేచర్‌’ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

స్విట్జర్లాండ్‌లో....
మూడో అతిచిన్న టెడ్డీ పేరు వీ బీర్‌. దీని ఎత్తు కేవలం 6.5 మిల్లీమీటర్లు మాత్రమే. దీన్ని దక్షిణాఫ్రికాకు చెందిన చెర్లీ మాస్‌ 1998లో తయారు చేశారు. ప్రస్తుతం ఇది స్విట్జర్లాండ్‌లోని పుపున్‌హాస్‌ మ్యూజియంలో భద్రంగా ఉంది.

పెద్దదీ ఉందండోయ్‌!
గోరంత చిన్న టెడ్డీ బేర్‌లే కాదు నేస్తాలూ... ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెడ్డీబేర్‌ కూడా ఉంది. దాని పేరే.. ‘ది మెక్సికన్‌ జెయింట్‌ టెడ్డీ బేర్‌’. దీని పొడవు 65 అడుగులకు పైనే ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టిందట. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెడ్డీబేర్‌ రికార్డు దీని పేరు మీదే ఉంది. దీనికి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానమూ దక్కింది. అన్నట్లు దీని బరువెంతో తెలుసా.. ఏకంగా 4.4 టన్నులు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ టెడ్డీబేర్ల విశేషాలు. మరి మీ దగ్గర ఉన్న టెడ్డీ బేర్‌ బరువు, పొడవు ఎంతో తెలుసుకోండి సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని