గాడిదను కాను.. నేను గుర్రాన్నే!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా?! నన్ను చూసి మీరు గాడిద అనుకుంటున్నారు కదూ! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నేనో గుర్రాన్ని. అదీ సాదాసీదా అశ్వాన్ని కాదు..

Updated : 29 May 2023 06:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా?! నన్ను చూసి మీరు గాడిద అనుకుంటున్నారు కదూ! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నేనో గుర్రాన్ని. అదీ సాదాసీదా అశ్వాన్ని కాదు.. అరుదైన, అసలు సిసలైన అడవి గుర్రాన్ని. మరి నా సంగతులేంటో తెలుసుకోవాలని ఉంది కదూ! ఆ విశేషాలు మీతో చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు ప్రజెవాల్‌స్కీ హార్స్‌. నన్ను తాఖీ, మంగోలియన్‌ అడవిగుర్రం, జుంగేరియన్‌ గుర్రం అని కూడా పిలుస్తారు. నేను చాలా అరుదైన, అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాను. భౌగోళిక శాస్త్రవేత్తైన నికోలాయ్‌ ప్రజెవాల్‌స్కీ పేరే నాకు పెట్టారు. అసలు నన్ను కొన్నాళ్లు మీరంతా అంతరించిపోయాను అనుకున్నారు. కానీ తిరిగి 1990ల ప్రాంతంలో మంగోలియాలోని ఖుస్టెన్‌ నూరు నేషనల్‌ పార్క్‌, తఖిన్‌ లాల్‌ నేచర్‌ రిజర్వ్‌, ఖోమిన్‌ తాల్‌ రిజర్వ్‌, మధ్య ఆసియా, యూరప్‌లోనూ నేను మళ్లీ కనిపించాను. దాంతో నేను అంతరించిపోయిన జాబితా నుంచి, అరుదైన జీవుల జాబితాలోకి వచ్చాను.

అతి ప్రాచీనం....

నేను పురాతన కాలానికి చెందిన అడవి గుర్రాన్ని. ప్రస్తుతం ఉన్న దేశీయ గుర్రాలకు నాకు జన్యువుల పరంగా చాలా తేడాలున్నాయి. నాలో 33 జతల క్రోమోజోములు ఉంటే, దేశీయ గుర్రాల్లో కేవలం 32 జతల క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. నేను సాధారణ గుర్రాలకంటే చిన్నగా కనిపిస్తాను. కానీ చాలా బలిష్టంగా ఉంటాను. నన్నెవరైనా కొత్తవారు చూస్తే ఒకరకమైన గాడిద అనుకొని కూడా పొరబడుతుంటారు. నేను కేవలం 48 నుంచి 56 అంగుళాల ఎత్తు ఉంటానంతే. బరువేమో సుమారు 300 కిలోల వరకు పెరుగుతాను. మా కాళ్లు పొట్టిగా ఉంటాయి. తోకేమో దాదాపు 90 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. అలాగే మా గిట్టలు ముందు భాగంలో పొడవుగా ఉంటాయి. మేం ముదురు, లేత గోధుమరంగుల్లో ఉంటాం. అక్కడక్కడ తెలుపు చారికలు కూడా ఉండొచ్చు.

ఏం తింటామంటే...

మేం ఎక్కువగా వృక్ష సంబంధమైన పదార్థాలను తింటాం. మొక్కల లేత ఆకులు, పువ్వులు, పచ్చగడ్డిని తింటాం. అయితే వేసవికి, శీతాకాలానికి మేం తీసుకునే ఆహారంలో కాస్త వైవిధ్యం ఉంటుంది. వేసవిలో ఒక రకమైన మొక్కల్ని తింటే... శీతాకాలంలో మరో రకమైన మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాం. చలికాలంలో తక్కువ ఆహార లభ్యత ఉంటుంది. అందుకే మేం మా జీవక్రియ వేగాన్ని కాస్త తగ్గించుకుంటాం. దీనివల్లే మేం శీతాకాలంలో తక్కువ ఆహారంతోనే కాలం నెట్టుకొస్తాం. మాలో అప్పుడే పుట్టిన పిల్లలు కేవలం గంటలోపలే లేచి నడవగలవు. మేం దాదాపు 36 సంవత్సరాల వరకు జీవించగలం. గతంలో వేట, కరవుకాటకాలు, కఠిన శీతాకాల పరిస్థితుల వల్ల మా సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌, చైనాలో మా సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. క్లోనింగ్‌ ప్రక్రియద్వారా కూడా మా సంతతిని పెంచడానికి కృషి చేస్తున్నారు. మొత్తానికి ప్రాచీనకాలానికి చెందిన గుర్రపు జాతుల్లో ప్రస్తుతం నేను ఒక్కదాన్నే మిగిలాను. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని