చీమల దండు వీటికి మెదడు మెండు!

చీమలందు ఈ చీమలు వేరు. ఎందుకంటే.. అవసరమైతే ఇవి ఏకంగా తమ మెదడు పరిమాణాన్ని పెంచుకోగలవు. తగ్గించుకోనూ గలవు. కేవలం మెదడే కాదు.. వాటి శరీరంలోని వెనక భాగాన్ని కూడా

Updated : 12 Aug 2022 14:11 IST

చీమలందు ఈ చీమలు వేరు. ఎందుకంటే.. అవసరమైతే ఇవి ఏకంగా తమ మెదడు పరిమాణాన్ని పెంచుకోగలవు. తగ్గించుకోనూ గలవు. కేవలం మెదడే కాదు.. వాటి శరీరంలోని వెనక భాగాన్ని కూడా అవసరాన్ని బట్టి మార్చుకుంటాయి. వాటి దండుకు నాయకత్వం వహించే రాణి పదవి కోసమే ఇవి ఇలా చేస్తాయని శాస్త్రవేత్తలు ఇటీవలే తేల్చారు. ఇంతకీ ఇవేం చీమలు.. వీటి పేరేంటి.. ఇవి ఎక్కడుంటాయో తెలుసుకోవాలని ఉందా!.. అయితే ఇంకెందుకాలస్యం చదివేయండి.
అవసరానికి అనుగుణంగా తమ శరీరాకృతిని మార్చుకోగలిగే చీమలు ఏ ఆఫ్రికావో.. అమెరికావో కాదు.. మన దేశానికి చెందినవే. వీటిని జంపింగ్‌ యాంట్స్‌ అంటారు. వీటి గుంపులను కాలనీలు అంటారు. ఆ కాలనీకి ఒక రాణి చీమ ఉంటుంది. మిగతావన్నీ కార్మికులే. అయితే ఏదైనా కారణం వల్ల రాణి చీమ చనిపోయినప్పుడు ఆ పదవిని పొందడానికి మిగతా చీమలు ఒకదానితో మరొకటి పోటీ పడతాయి.

లార్వా స్థితిలోనే...
ఈ చీమలు గుడ్లు పెట్టేటప్పుడు వాటి మెదడు చిన్నగా మారుతుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం ఈ జంపింగ్‌ యాంట్స్‌కు యుక్త వయసులో మెదడు, వెనక భాగాలను మార్చుకునే సామర్థ్యం వాటికి ఉంటుంది. అవి రాణి పాత్ర పోషించిన తర్వాత వాటి వెనక భాగాన్ని తిరిగి మామూలు స్థితికి మార్చుకోగలవు. నిజానికి వీటి లార్వా స్థితిలోనే ఏది కార్మిక చీమో, ఏది రాణి చీమో నిర్ణయించుకుంటాయి. ఎలాగంటే.. ఏ చీమకైతే సరైన హార్మోన్లు ఉండి ఆరోగ్యంగా ఉంటుందో దాన్నే రాణి చీమగా పరిగణిస్తాయి. ఇంతకీ కార్మిక చీమల పనేంటంటే.. వాటి స్థావరాన్ని శుభ్రంగా ఉంచడం, పిల్ల చీమలను జాగ్రత్తగా చూసుకోవడం, ఆహారం కోసం వెతుకులాడటం. రాణి చీమ మాత్రం ఏ పనీ చేయదు. కేవలం గుడ్లుపెట్టడమే దాని పని. ఇవండీ అవసరానికి తగ్గట్లు తమను తాము మలుచుకునే జంపింగ్‌ యాంట్స్‌ విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని