దివ్యాంగులకు భరోసానిస్తున్న చిన్నారి

నేస్తాలూ! ఈ చిన్నారి  ఒక పక్క చదువులో రాణిస్తూ.. బహుమతులు సాధిస్తోంది. మరో పక్క తన పరిశోధనలతో నలుగురికీ మంచి చేస్తుంది. ఇంతకీ తనెవరో ఏంటో తెలుసుకుందాం రండి..

Updated : 24 Jul 2021 04:44 IST

నేస్తాలూ! ఈ చిన్నారి  ఒక పక్క చదువులో రాణిస్తూ.. బహుమతులు సాధిస్తోంది. మరో పక్క తన పరిశోధనలతో నలుగురికీ మంచి చేస్తుంది. ఇంతకీ తనెవరో ఏంటో తెలుసుకుందాం రండి..

మర్రాపు అర్చిష్మ. వయసు 14 ఏళ్లు. అమ్మ శశికళ, నాన్న శశిధరరావు. స్వస్థలం మంగినపూడి, ప్రకాశం జిల్లా. స్వతహాగా తెలుగువాళ్లే అయినా తమ ఉద్యోగాల రీత్యా కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డారు.

చదువులో మేటి

అర్చిష్మ చిన్నప్పట్నుంచి చదువులో చురుకు. ముఖ్యంగా లెక్కలు, సైన్స్‌లో ఏ పోటీ జరిగినా ముందుండేది. మేథ్‌ ఒలింపియాడ్‌, కాంటినెంటల్‌ మేథ్‌ లీగ్‌, అమెరికన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ లీగ్‌ ఇలా అన్ని పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచేది. ప్రస్తుతం తన ప్రతిభతో అమెరికాలోనే టాప్‌ హైస్కూల్‌ అయినటువంటి ‘థామస్‌ జెఫెర్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ లో తొమ్మిదో తరగతి చదివేందుకు ఎంపికయింది.

దివ్యాంగుల కోసం..

అర్చిష్మకు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా పట్టుంది. 2019లో ళ్మీ’్ఝi÷్వబిi౯ః( అనే సామాజిక సంస్థను కూడా స్థాపించి లింగ సమతుల్యత కోసం ఉద్యమాలు చేస్తోంది. మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని వాషింగ్టన్‌ డీసీ, మేరీ ల్యాండ్‌, వర్జీనియాలో దాదాపు 50కి పైగా ప్రచార సభలు నిర్వహించింది. దాంతో టీఎస్‌ఏ(టెక్నాలజీ స్టూడెంట్‌ అసోసియేషన్‌)లో సభ్యురాలిగా ఎంపికయింది. అన్నట్టు తనకున్న పరిజ్ఞానంతో ఎన్నో పరిశోధనలు చేసి దివ్యాంగులకు కృత్రిమ చేతిని తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చో ఒక నమూనా ద్వారా తెలియజేసింది. ఇది అచ్చం మనిషి అవయవంలానే పనిచేస్తుందని పరిశోధనలతో నిరూపించింది.

తెలుగంటే ఇష్టంతో..

అర్చిష్మకి తెలుగు భాషా, సంప్రదాయాల గురించి చక్కగా వివరించి చెప్పేవారు అమ్మానాన్న. దాంతో తెలుగు మీద మక్కువ పెంచుకుంది. అంతేకాదు తనకి అయిదేళ్లు రాగానే కూచిపూడిలో శిక్షణకు పంపించారు. అందులో కూడా రాణిస్తూ ప్రదర్శనలు ఇచ్చింది. తానా ఉత్సవాల్లో తన చెల్లెలు అనీషాతో కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చి అందరితో శభాష్‌ అనిపించుకుంది. ఇంత ప్రతిభ ఉన్న అర్చిష్మ నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని