రైతే రాజు

అవంతి రాజ్యానికి ప్రదీపుడు రాజు. మంత్రి కేశవుడితో కలిసి మారువేషాల్లో వారానికోసారి పల్లెలకు వెళ్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండేవాడు.

Published : 18 Feb 2023 00:04 IST

అవంతి రాజ్యానికి ప్రదీపుడు రాజు. మంత్రి కేశవుడితో కలిసి మారువేషాల్లో వారానికోసారి పల్లెలకు వెళ్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఆ ఇద్దరూ బాటసారుల వేషాల్లో సీతాపురం వెళ్లారు. ఆ ఊరి చివరనున్న వ్యవసాయ భూమిలో ఒక కాడిని ఎద్దు, మరో వైపు పదిహేనేళ్ల పిల్లవాడు లాగుతుంటే.. ఆ బాలుడి తల్లి నాగలి పట్టుకొని పొలం దున్నసాగింది. అది చూసిన రాజు, మంత్రి.. వారి దగ్గరకు వెళ్లారు. ‘అయ్యో.. మరో ఎద్దు లేదా? పిల్లవాడు కష్టపడడమేంటి?’ అని ప్రశ్నించారు. ‘అయ్యా? ఎద్దుకు ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఆ చెట్టు నీడన కట్టేశాం’ అని అందామె. ‘మరి మీ ఇంటాయన ఎక్కడ ఉన్నాడు?’ అన్నాడు మంత్రి. ‘మా ఇంటాయన పేరు శివయ్య. విత్తనాల కోసం పొరుగు రాజ్యానికి వెళ్లాడు’ అని సమాధానం ఇచ్చాడా కుర్రాడు. ‘అయ్యా ఇంతకూ మీరెవరు?’ అందామె.

‘మేం బాటసారులం.. మీరు ఇలా కష్టపడడం చూసి వచ్చాం. విత్తనాలు ఇక్కడ దొరకవా?’ అన్నాడు రాజు. ‘నాణ్యమైన విత్తనాలు మా రాజ్యంలో దొరకడం లేదు’ అందామె. రాజు సైగతో మంత్రి తన చేతిలోని సంచిని వారి పొలంలో జారవిడిచాడు. ‘వస్తామమ్మా.. వస్తాం బాబూ.. బాగా చదువుకో..’ అని రాజు, మంత్రి చెప్పి బయలుదేరబోయారు. ఇంతలో ‘ఎక్కడి నుంచో వస్తున్నట్లున్నారు.. కాస్త మజ్జిగ అన్నం తిని వెళ్లండి’ అందా ఇల్లాలు. వారు సరేననడంతో అందరూ కలిసి చెట్టు నీడకు వెళ్లారు. రాజు, మంత్రి కూర్చున్నాక.. ఇల్లాలు చేతులు శుభ్రం చేసుకుని మజ్జిగ అన్నాన్ని రెండు గిన్నెల్లో పెట్టి ఇచ్చింది. నంజుకోవడానికి ఉల్లిపాయ కూడా ఇచ్చింది. తినడానికి సందేహిస్తున్న రాజు చెవిలో ‘తినండి మహారాజా! భలే రుచిగా ఉంది’ అన్నాడు మంత్రి. ‘అవునవును మంత్రీ.. ’ అన్నట్లుగా తల ఊపాడు రాజు. తినడం పూర్తయ్యాక.. కొద్ది దూరంలో కట్టేసిన గుర్రాల వైపు వెళ్తూ ‘మనం పొలంలో పడేసిన నాణేలతో వాళ్లు మరో ఎద్దుని కొనుగోలు చేసుకొంటే చాలు’ అన్నాడు రాజు. ‘అవును మహారాజా! వారి కష్టం చూసి నాకు కూడా బాధ కలిగింది’ అన్నాడు మంత్రి.

శివయ్య విత్తనాలు తెచ్చేసరికి బాగా పొద్దుపోయింది. మరుసటి రోజు అతడు పొలం దున్నుతుండగా మంత్రి పడేసిన సంచి దొరికింది. దాన్ని భార్య తీసి చూడగా.. అందులో ఐదు బంగారు నాణేలు కనిపించాయి. ‘ఇవి మన పొలంలో దొరకడమేంటి?’ అన్నాడు శివయ్య. ‘అయ్యా! నిన్న ఇద్దరు బాటసారులు మన పొలానికి వచ్చి వెళ్లారు.. బహుశా వారివే పొరపాటున జారి పడిపోయి ఉండవచ్చు’ అన్నాడు బాబు. ‘సాయంత్రం నేను కోటకు వెళ్లి ఆ సంచిని రాజుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు శివయ్య. అన్నట్లుగానే శివయ్య కోటకు చేరుకుని రాజును కలిసి ‘మహారాజా! నిన్న ఇద్దరు బాటసారులు మా పొలానికి వచ్చారట.. బహుశా వారిది కావచ్చు... ఇది మీవద్ద ఉండడమే శ్రేయస్కరం’ అని నాణేల సంచిని మంత్రికి అందించాడు. మంత్రి ఏమీ తెలియనట్లు సంచిలో ఉన్న అయిదు బంగారు నాణేలు తీసి రాజుకు ఇచ్చాడు.

‘నీ పొలంలో దొరికాయి కాబట్టి, ఇవి నీవే అనుకో’ అన్నాడు రాజు. ‘మహారాజా! ఈసారి నా పొలంలో దిగుబడి బాగా వస్తే.. నాణేలు దొరికిన దానికంటే ఎక్కువ సంతోషిస్తాను’ అన్నాడు శివయ్య. ‘నిన్న బాటసారులుగా మారువేషంలో మీ పొలానికి వచ్చి ఈ నాణేలు జారవిడిచింది నేను, రాజుగారే’ అని అసలు విషయం వివరించాడు మంత్రి. ‘అవును.. ఒక ఎద్దు ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. ఇంకోటి కొనుక్కుంటావని అలా చేశాం’ అన్నాడు రాజు. ‘అయ్యా.. ఎండదెబ్బకు ఎద్దు కాస్త సొక్కిపోయింది.. అంతే..! ఇప్పుడది బాగానే ఉంది. నేను కష్టాన్నే నమ్ముకున్న రైతును. వెళ్లి వస్తాను మహారాజా!’ అని శివయ్య వెళ్లబోతుంటే.. ‘శివయ్యా.. రేపు ఉదయాన్నే ఒకసారి సభకు రా.. వ్యవసాయం మీద కొన్ని సూచనలు, సలహాలు తీసుకుంటాం’ అన్నాడు రాజు. ‘చిత్తం మహారాజా!’ అన్నాడు శివయ్య.
మహారాజు పిలుపు మేరకు మరుసటి రోజు అన్ని గ్రామాలకు చెందిన గ్రామాధికారులతోపాటు శివయ్య కూడా సభకు వచ్చాడు. ముందుగా శివయ్యను మాట్లాడమన్నాడు రాజు. ‘మహారాజా! మా సీతాపురంలో వ్యవసాయాన్ని నమ్ముకొని సుమారు వంద కుటుంబాల వరకు ఉండేవి.. ఏటా వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీరు ఉండటం లేదు. దాంతో రైతులు ఒక్కొక్కరుగా వ్యవసాయం వదిలిపెట్టి ఇతర పనులకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడు నాతో కలిపి మా ఊరిలో కేవలం పది కుంటుంబాలే సాగును నమ్ముకొని జీవిస్తున్నాయి’ అన్నాడు శివయ్య. ఆ తరవాత.. గ్రామాధికారుల సలహాలు కూడా తీసుకున్నాడు రాజు. కొద్దిరోజుల్లోనే వలస వెళ్లిపోయిన రైతులను వెనక్కు పిలిపించి, నాణ్యమైన విత్తనాలను నేరుగా వారికే ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించాడు రాజు.
చెరువుల మరమ్మతులు చేపట్టి, కాల్వల ద్వారా పొలాలకు నీరు అందేలా చేశాడు. ధాన్యం నిల్వ ఉంచుకునేలా గిడ్డంగులు నిర్మించి, మంచి ధర వచ్చినప్పుడే రైతులు అమ్ముకునేలా వీలు కల్పించాడు. పన్ను కూడా వేయకుండా చర్యలు చేపట్టాడు. ఆ నిర్ణయాలతో రాజ్యం చాలావరకు సుభిక్షంగా మారింది. ఏటా రైతులను సన్మానిస్తూ.. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించసాగాడు. ‘రైతు లేనిదే ధాన్యం లేదు.. ధాన్యం లేనిదే రాజ్యం లేదు.. కాబట్టి రైతే రాజు’ అనేలా అద్భుతమైన ఫలితాలు సాధించాడు రాజు ప్రదీపుడు.
యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని