ఎవరక్కడ.. ‘రాణి’ ఇక్కడ..!

హాయ్‌ ఫ్రెండ్స్‌..! ఏ రాజ్యంలో నైనా శత్రువుల బారి నుంచి తన భూభాగాన్ని రక్షించుకోవడం, ప్రజల సంక్షేమం తదితర అంశాల బాధ్యత కచ్చితంగా రాజుదే.

Published : 27 Dec 2022 00:07 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..! ఏ రాజ్యంలో నైనా శత్రువుల బారి నుంచి తన భూభాగాన్ని రక్షించుకోవడం, ప్రజల సంక్షేమం తదితర అంశాల బాధ్యత కచ్చితంగా రాజుదే. కానీ, ఓ అడవిలో మాత్రం ఆ బరువంతా ‘రాణి’దే. ‘అదేంటి..?’ అని ఆశ్చర్య పోతున్నారా? - ఇక్కడ రాణి అంటే మహారాణి కాదు నేస్తాలూ.. వేటకుక్క. చిన్న జంతువే అయినా పులులు, సింహాలకు రక్షణగా నిలుస్తోందట. ఇంతకీ ఆ విశేషాలేంటో చదివేయండి మరి..

త్తరాఖండ్‌ రాష్ట్రం అనగానే మనకు మంచు కొండలు, పెద్ద పెద్ద పర్వతాలూ గుర్తుకొస్తాయి. దట్టమైన అడవులకూ అది ప్రసిద్ధే. మన దగ్గర అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు మాదిరే అక్కడ రాజాజీ టైగర్‌ రిజర్వు ఒకటి ఉంది. అంటే ఆ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే, అవి వేటగాళ్ల బారిన పడకుండా వాటిని రక్షించేందుకు ఆయా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ రాజాజీ టైగర్‌ రిజర్వు పరిధిలోని క్రూర మృగాలకు రక్షణగా ‘రాణి’ అనే పేరున్న కుక్క కాపలా కాస్తోంది. భద్రతా సిబ్బందితోపాటే గస్తీ తిరుగుతూ వేటగాళ్లకు సింహస్వప్నంలా మారింది.

ప్రత్యేక శిక్షణ..

రాజాజీ టైగర్‌ రిజర్వు చాలా విశాలమైన ప్రాంతం. ఇక్కడ దాదాపు 30 పులులు, 200కు పైగా చిరుతలు ఉన్నాయట. వీటితోపాటు 500 వరకూ ఏనుగులు, అనేక రకాల వన్యప్రాణులు, పక్షి జాతులూ ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ టైగర్‌ రిజర్వు చాలా పరిధి మేరకు విస్తరించి ఉండటంతో కాపలా కాయడం గస్తీ సిబ్బందికి సవాల్‌గా మారింది. దాంతో వేటకుక్క ‘రాణి’ సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం దానికి తొమ్మిదేళ్లు. వన్యప్రాణుల చర్మం, అవయవాలను గుర్తించేలా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 9 నెలలపాటు దానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారట. అంతేకాదు.. వేటగాళ్లను, స్మగ్లర్లను గుర్తించడమూ నేర్పించారు. సిబ్బందితోపాటు గస్తీ తిరుగుతూ.. అనుమానాస్పద కదలికలను గుర్తించడంతోపాటు వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది. సాధారణ కుక్కలకు భిన్నంగా వీటికి మూడు రకాల శిక్షణ ఇస్తారట. సాధారణ శిక్షణతోపాటు వాసన చూసి పసిగట్టడం, అనుమానితులను గుర్తించడం నేర్పుతారు. ఒక్క ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే గత 20 ఏళ్లలో అనేక పులులు, చిరుతలను వేటగాళ్లు చంపేశారట. 41 తోడేళ్లు, 9 ఏనుగులు సైతం వారి బారిన పడ్డాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో గస్తీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను ‘రాణి’ చాలా మేరకు తగ్గిస్తోందని అటవీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని