పచ్చదనానికీ ఉంది రేటింగ్‌

విద్యుత్‌ను పొదుపు చేసే గృహోపకరణాలకు త్రీస్టార్‌, ఫైస్టార్‌ పేరుతో రేటింగ్‌ ఇవ్వటం మనకు తెలుసు.. పర్యావరణహితమైన హరిత భవనాల(గ్రీన్‌ బిల్డింగ్స్‌)కు ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌ పేర్లతో రేటింగ్‌ ఇచ్చే విధానం విన్నాం.. వీటితోపాటు ల్యాండ్‌ స్కేపింగ్‌కు కూడా రేటింగ్‌ ఇస్తున్నారు.

Published : 27 Apr 2024 05:55 IST

మొక్కలే కాదు.. నీరు, విద్యుత్తు పొదుపు పరిగణనలోకి
ఉద్యానాలు, హరిత భవనాలకు
మాదాపూర్‌ న్యూస్‌టుడే

విద్యుత్‌ను పొదుపు చేసే గృహోపకరణాలకు త్రీస్టార్‌, ఫైస్టార్‌ పేరుతో రేటింగ్‌ ఇవ్వటం మనకు తెలుసు.. పర్యావరణహితమైన హరిత భవనాల(గ్రీన్‌ బిల్డింగ్స్‌)కు ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌ పేర్లతో రేటింగ్‌ ఇచ్చే విధానం విన్నాం.. వీటితోపాటు ల్యాండ్‌ స్కేపింగ్‌కు కూడా రేటింగ్‌ ఇస్తున్నారు. ఉద్యానాలకు, చిన్నచిన్న పార్కులకు, చివరికి ఇంట్లో ఉండే పెరటి తోటలకు సైతం రేటింగ్‌ ఇస్తుంది మాదాపూర్‌లోని సీఐఐ గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌.. పార్కులకు, ఇంట్లో గార్డెన్‌కు రేటింగ్‌ ఏంటీ అనుకుంటున్నారా? ఈ వివరాలు చదవాల్సిందే.

క్కువ పచ్చదనం ఉండే పార్కులకు ఉత్తమ రేటింగ్‌ ఇస్తారనుకుంటే పొరపాటే. కేవలం పచ్చదనం చూసి వాటికి రేటింగ్‌ ఇవ్వడం కాదు.. గార్డెన్‌లో విద్యుత్‌, నీటి ఆదాతోపాటు పర్యావరణానికి మేలు చేసే మొక్కలతో నిండి ఉండే ఉద్యానాలకు రేటింగ్‌లు ఇస్తున్నారు. ఇందుకోసం ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) గ్రీన్‌ ల్యాండ్‌స్కేప్‌ రేటింగ్‌ సిస్టంను అమలుచేస్తుంది. ఈ విధానంతో నగరంలో పార్కులు, ఉద్యానాల సంఖ్యను పెంచడంతోపాటు అమూల్యమైన నీటిని ఆదా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌. గ్రీన్‌ ల్యాండ్‌స్కేప్‌ రేటింగ్‌ సిస్టంతో పర్యావరణహిత పార్కుల రూపకల్పనకు ప్రత్యేకంగా సూచనలు, సలహాలిస్తున్నారు. ఆ సూచనలను అమలుచేస్తూ పర్యావరణానికి మేలు చేసే పార్కులను అందుబాటులోకి తీసుకురావచ్చు. అక్కడ ఆదా చేసే వనరుల ఆధారంగా వాటికి రేటింగ్‌ ఇస్తారు.

విదేశాల్లో ఇలా...

సింగపూర్‌, ఆస్ట్రేలియా, ఐరోపా లాంటి దేశాల్లో పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సింగపూర్‌లో 48-50శాతం పచ్చదనం ఉంటుంది. జనావాసాల ప్రాంతంలో కనీసం ప్రతి 200 మీటర్ల దూరంలో ఒక పార్కు ఉండాలనే నిబంధన అమలుచేస్తున్నారు. ఒక పార్కు నుంచి మరో పార్కుకు అనుసంధానం ఉంటుంది. దీంతో సందర్శకులు ఒక పార్కు నుంచి మరోదాంట్లోకి నడిచి వెళ్లే వీలుంటుంది. దీంతో వాహనాల వాడకం తగ్గుతుంది.

హైదరాబాద్‌ లాంటి నగరాల్లో కనీసం 33శాతం పచ్చదనం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన భాగ్యనగరంలో మరింత పచ్చదనం పెంపొందించాల్సి ఉంది. కనీసం రెండు కిలోమీటర్లకో పార్కు ఉంటే బాగుంటుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్‌ ల్యాండ్‌స్కేప్‌ పార్కంటే...

  • పార్కులో 30-40శాతం వరకు స్థానిక మొక్కలే నాటాలి
  • తక్కువ నీటిని తీసుకునే మొక్కలకు ప్రాధాన్యం. కరవు పరిస్థితులను తట్టుకునేలా ఉండాలి.
  • పార్కులో లాన్‌ విస్తీర్ణం కంటే మొక్కల సంఖ్య అధికంగా ఉండాలి.
  • పక్షులు, సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలు నాటాలి.
  • పార్కుల్లో సమగ్ర వ్యర్థ నిర్వహణ విధానం అమలుచేయాలి.
  • పచ్చదనంతోపాటు అహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడాలి.

ప్రయోజనాలు...

సాధారణ పార్కులతో పోల్చుకుంటే ఈ గ్రీన్‌ ల్యాండ్‌స్కేప్‌ పార్కుల్లో నీటి వినియోగం 50-60శాతం తగ్గుతుంది. విద్యుత్‌ వాడకం సైతం 60శాతం తగ్గిపోతుంది. సందర్శకులకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు.


గార్డెన్‌లో నాటాల్సిన మొక్కలు

గార్డెన్‌లో బఫెలో గ్రాస్‌(గడ్డి)తోపాటు పసుపు గనప, రుద్రగనప, పట్టకుంకుడు, కుర్ప, సీపాయిజన్‌ టీ, నలుపు ముస్తీపంట, బూరుగుచెట్టు, సాంబ్రాని, కోరమామిడి, మోదుగుచెట్టు, బొడిగచెట్టు, కొండజిలుగు, రేలచెట్టు, కొండగోగు, కొండరేగు, కొండమామిడి.


చిన్న మొక్కలు

నిలాంబ్రం, పిసాంగి, గుర్రపు కటిల్వాకు, రామబాణం పువ్వులు, దోభిటీ, తెల్ల చిత్రమూలం, సర్పగంధ తదితర రకాలు.


తీగ మొక్కలు

తీగలు పారే మొక్కలు గార్డెన్‌లో ఎంతో మేలు చేస్తాయి. గడిగగడప, మడపు, అడవుపాలటీగ, సుగంధపిల్ల, చైనీస్‌ హాట్‌, స్వీట్‌ క్లాక్వైన్‌, మైసూర్‌ క్వైన్‌ లాంటివి.

నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఇందుకోసం జల్లు లేదా బిందు సేద్యం పద్ధతులు అవలంబించాలి. గార్డెన్‌లో చెత్త నిర్వహణకు మేలైన పద్ధతులు పాటించాలి.


మరిన్ని అభివృద్ధి చేయాలి

-సందీప్‌, ఐజీబీసీ ప్రతినిధి

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఐజీబీసీ 9 ల్యాండ్‌ స్కేప్స్‌ను సర్టిఫై చేసింది. ఇందులో 3 పార్కులు, శ్మశానవాటిక, ఒక రిసార్ట్‌, ఒక నివాస సముదాయం, 3 ఇండస్ట్రియల్‌, టెక్‌ పార్క్స్‌ ఉన్నాయి. హైదరాబాద్‌లో బొటానికల్‌ గార్డెన్‌కు ఐజీబీసీ సర్టిఫికెట్‌ లభించింది. బెంగళూరు, పుణే, దిల్లీ, కోయంబత్తూరులో పలు గార్డెన్స్‌కు ఐజీబీసీ సర్టిఫికెట్‌ లభించింది. పార్కు గ్రీన్‌ రేటింగ్‌లో ఉంటే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్‌ పార్కులకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాం. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ రేటింగ్‌ విధానం ప్రవేశపెట్టి ప్రొత్సహించేందుకు యత్నిస్తున్నాం. కొత్తగా గార్డెన్‌ ఏర్పాటు చేసుకునేవారికి గ్రీన్‌గార్డెన్‌ తీర్చిదిద్దుకునేందుకు గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌లో కావాల్సిన సమాచారమిస్తాం. రూఫ్‌, వెర్టికల్‌ గార్డెన్లకు సూచనలిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు