కోరుకున్న అద్దె ఇళ్లు.. సకల సౌకర్యాలు

వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఇలా వచ్చే చాలా మంది నగరంలో విడిది చేయడానికి ఇంట్లో ఉంటున్నామన్న అనుభూతిని సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published : 20 Apr 2024 03:14 IST

నగరం నలువైపులా విస్తరణ

న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఇలా వచ్చే చాలా మంది నగరంలో విడిది చేయడానికి ఇంట్లో ఉంటున్నామన్న అనుభూతిని సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు స్టూడియో ప్లాట్స్‌ను ఎంపిక చేసుకుంటే మరికొందరు రెండు, మూడు పడక గదుల ఇళ్లు, విల్లాలు, ఫామ్స్‌ హౌస్‌లు ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారి అభిరుచికి తగిన విధంగా సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అద్దెకిస్తున్నారు.

పెరుగుతున్న సందర్శకులు

  • తెలంగాణాకు ప్రధానంగా హైదరాబాద్‌కు ఏటా వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2021-22లో 3.2 లక్షల మంది దేశీయ పర్యాటకులు వచ్చారు. ఇది 2022-23కు 6.07 లక్షలకు చేరింది. అంటే దాదాపు 89.84 శాతం పెరిగింది. విదేశాల నుంచి 2021-22లో 5917 ఉండగా అది తర్వాత ఏడాదికి 68,401కి పెరిగింది. వివిధ దేశాల నుంచి నగరంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికితోడు రాష్ట్రంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్యా అధికమే. హైదరాబాద్‌కు వచ్చే వారిలో చాలా మంది దాదాపు నెలలపాటు ఇక్కడే ఉండి తమ మనసుకు నచ్చే అన్ని ప్రదేశాలను తిరిగివస్తున్నారు.

అంతర్జాల వేదికగా..

  • ఎయిర్‌బీఎన్‌బీలాంటి వెబ్‌సైట్లు నగరానికి వచ్చే వారి అభిరుచికి తగ్గట్టుగా ఆతిథ్యం ఇచ్చేందుకు సముదాయాలను ఏర్పాటు చేస్తున్నాయి. సింగిల్‌ బెడ్‌రూం, డబుల్‌ బెడ్‌రూం, విల్లాలు, స్టూడియో ప్లాట్స్‌ అద్దెకిస్తున్నారు. ఒక్క రోజు అద్దెకు  లేదా.. కావాల్సినన్ని రోజులు ఇస్తున్నారు. ఇంటిలో ఏసీ పడక గదులతో పాటు ఇంట్లో సామగ్రిని, సోఫాలు, వంటగదిలో పాత్రలు, వాహనాల నిలపడానికి పార్కింగ్‌, వైఫై వంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.  మరికొందరు సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, అద్దెగృహ సముదాయాల నిర్వాహకులు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నారు. చారిత్రాత్మక కట్టడాలను, పురాతన నిర్మాణాలను వీక్షించేందుకు వచ్చే వారిలో చాలా మంది నగరంలో పేరుగాంచిన ప్రాంతాల్లో ఉన్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్ల వైపు దృష్టి పెడుతున్నారు. చార్మినార్‌, గోల్కొండ, శిల్పారామం, చిలుకూరు తదితర ప్రాంతాల్లో ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇతర దేశాల, రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో చాలా మంది జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌తోపాటు అవుటర్‌ చుట్టూ విస్తరిస్తున్న అద్దె నివాసాలపై మక్కువ చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు