Real Estate: భవిష్యత్తులో మరింత ఎత్తుకు

కొనుగోలుదారుల సెంటిమెంట్‌పై ఆధారపడి వ్యాపారం సాగేవాటిలో ప్రధానమైంది రియల్‌ ఎస్టేట్‌. మార్కెట్‌ ప్రస్తుతం ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందనేది దీని ద్వారా ఒక అంచనాకు రావొచ్చు.

Updated : 25 May 2024 09:29 IST

ఈనాడు, హైదరాబాద్‌

కొనుగోలుదారుల సెంటిమెంట్‌పై ఆధారపడి వ్యాపారం సాగేవాటిలో ప్రధానమైంది రియల్‌ ఎస్టేట్‌. మార్కెట్‌ ప్రస్తుతం ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందనేది దీని ద్వారా ఒక అంచనాకు రావొచ్చు. పరిశ్రమల భాగస్వాములతో కలిసి నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సంయుక్తంగా 2024 మొదటి త్రైమాసానికి సంబంధించిన సెంటిమెంట్‌ ఇండెక్స్‌ను రూపొందించింది. డెవలపర్స్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ), ప్రైవేటు ఈక్విటీ సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. సెంటిమెంట్‌ సూచి 69-72కి ఎగబాకడంతో పాటు సెంటిమెంట్‌ స్కోరు 70-73కి పెరిగిందని తెలిసింది. రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందనే సంకేతాలను వెలువరించింది. కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు, విక్రయాలు, ధరల పరంగా గణనీయమైన పెరుగుదలను సూచిక వెల్లడించింది. 

మెరుగవుతున్న ఆర్థిక పరిస్థితులు

2023 మొదటి త్రైమాసికంలో 52 శాతం ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పగా, 2024 తొలి త్రైమాసికానికి 68 శాతానికి పెరిగిందని చెప్పారు. 

  • పెద్దగా మారలేదని అప్పుడు 27 శాతం మంది చెబితే ఇప్పుడు 23 శాతం మంది మాత్రమే చెప్పారు. 
  • ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేవని గతంలో 21 శాతం మంది చెబితే ఇప్పుడు వారి శాతం 9కి తగ్గిపోయింది. బిల్డర్లు కూడా రాబోయే కాలంపై మరింత ఆశాభావంతో ఉన్నారు. 

కొత్త ప్రాజెక్టుల పరంగా.. 

కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో కొత్త ప్రాజెక్టులు భారీగా మొదలయ్యాయి. 

  • 2023 తొలి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టామని 56 శాతం మంది డెవలపర్లు చెబితే.. 2024లో 80 శాతం మంది చెప్పారు. 
  • కొత్త ప్రాజెక్టులు పెద్దగా రాలేదని గతంలో 27 శాతం మంది బిల్డర్లు చెబితే.. ఈసారి అది 8 శాతానికి తగ్గిపోయింది. 

నిధుల లభ్యత? 

హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో ఎక్కువ మంది బిల్డర్లు నిధుల సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఏడాది కాలంగా ఇంచుమించు ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సర్వేలో పాల్గొన్న బిల్డర్లు  ఏం చెప్పారంటే.. 

  • 2023 తొలి త్రైమాసికంలో నిధుల లభ్యత పెరిగిందని 38 శాతం మంది అభిప్రాయపడితే.. 2024 తొలి త్రైమాసికంలో వీరి సంఖ్య 58 శాతానికి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే నిధుల లభ్యత పెరిగింది. 
  • పరిస్థితులు పెద్దగా మారలేదని గత ఏడాది 42 శాతం మంది చెబితే.. ఈసారి ఆ సంఖ్య 23 శాతానికి చేరింది. పరిస్థితి మెరుగైందని చెబుతున్నారు. 
  • నిధులు తగ్గాయని చెబుతున్నవారు ఉన్నారు. 2023 మొదటి మూడు నెలల కాలంలో నిధుల లభ్యత తగ్గిందని 20 శాతం మంది చెబితే ఈసారి కూడా అదే స్థాయిలో అంటే 19 శాతంగా ఉంది. 


గృహ విక్రయాలు చూస్తే.. 

2023లోని మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విక్రయాలు పెరిగాయని డెవలపర్లు చెప్పారు. గత ఏడాది విక్రయాలు పెరిగాయని 48 శాతం మంది చెబితే.. ఈసారి అది ఏకంగా 73 శాతానికి పెరిగింది. 

  • పరిస్థితులు ఏం మారలేదని అప్పుడు 29 శాతం మంది అభిప్రాయపడితే.. ఇప్పుడు 15 మంది మాత్రమే చెప్పారు. 
  • తగ్గిందని అన్నవారు 23 శాతం నుంచి 12 శాతానికి తగ్గారు. 
  • ఇళ్ల ధరలు పెరిగాయని గత ఏడాది 61 శాతం మంది డెవలపర్లు చెప్పగా.. ఈసారి 82 శాతం మంది చెప్పారు.  

కార్యాలయాల లీజింగ్‌లోనూ.. 

గృహ నిర్మాణ ప్రాజెక్టులే కాదు కార్యాలయ భవనాల లీజింగ్‌లకు పెరిగాయి. క్రితం సంవత్సరం మొదటి త్రైమాసికంలో లీజింగ్‌ ఇచ్చామని 45 శాతం చెబితే... ఈసారి 74 శాతం లీజింగ్‌ చేశామని చెప్పారు. 

రాబోయే ఆరు నెలల్లో కార్యాలయ సరఫరా మరింత పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది అభిప్రాయపడ్డారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని