కొండలపై ఇళ్లు... అందాల హరివిల్లు

జంటనగరాల్లో ఉన్న కొండలు, గుట్టలపై నివాస గృహాల నిర్మాణ సంస్కృతి ఇటీవల పెరిగింది. అందం, ఆకర్షణతో పాటు ఎత్తైన ప్రదేశంలో నివసిస్తున్నామన్న ప్రత్యేక అనుభూతి, చుట్టుపక్కల ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి..

Updated : 04 May 2024 05:37 IST

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: జంటనగరాల్లో ఉన్న కొండలు, గుట్టలపై నివాస గృహాల నిర్మాణ సంస్కృతి ఇటీవల పెరిగింది. అందం, ఆకర్షణతో పాటు ఎత్తైన ప్రదేశంలో నివసిస్తున్నామన్న ప్రత్యేక అనుభూతి, చుట్టుపక్కల ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి.. కొండల మీద నిర్మించిన ఇళ్లు వేదికలవుతున్నాయి.

అనుమతుల సమస్య లేకుండా..: బండలు, కొండలు ఉన్న ప్రాంతాల్లో భూమిని చదును చేయడం శ్రమతో కూడుకున్న పని. పైగా ఒక్కోసారి పేలుడు పధారాౖలను సైతం వాడాల్సి వస్తుంది. దీనికి పోలీస్‌ అనుమతి తప్పనిసరి. నివాస ప్రాంతాల్లో అయితే బండలను పేల్చేందుకు పేలుడు పధారాౖలను వినియోగించడానికి అనుమతులు లభించవు. పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆక్షేపణ వ్యక్తం చేస్తే అదొక సమస్యగా మారుతుంది. దీంతో భవన నిర్మాణం చేపడుదామునుకున్న వారు కొండను యథావిధిగా ఉంచి దానిపైనే ఫిల్లర్లు వేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఈ తరహా నిర్మాణాలకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా కట్టుబడి దృఢంగా ఉంటుందని ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాలకు చెక్కుచెదరకుండా.. : వాస్తవానికి పేద ప్రజలు కొండలపై ఇళ్లు నిర్మించుకుని ఉండటం మనం చూస్తుంటాం. కొండను ఆక్రమించి బండరాళ్ల మధ్య చిన్నపాటి ఇల్లు నిర్మించుకొనేవారు. అయితే భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ చరియలు విరిగి పడి ఇళ్ల మీదికి పడేవి. దీనికి ప్రధాన కారణం కొండను చదును చేయకపోవడం, ఇళ్ల మధ్య తగినంత దూరం లేకపోవడం.. ఒకదానిపై ఒకటి నిర్మించడం. అయితే, ఇలా సమస్యలు లేకుండా ఒక ప్లాట్‌ విస్తీర్ణంలో బండలను తొలగించకుండా వాటిని చదును చేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. ఫలితంగా తుఫాను వంటి భీకర వాతవరణం నెలకొన్నా ఇంటికి ఎలాంటి నష్టం ఉండదు. పక్కపక్కనే ఇళ్లు ఉండటం వల్ల మొత్తం హిల్‌ టౌన్‌  ఏరియాగా మారుతోంది. ప్రకృతికి అనుగుణంగా నిర్మించడంతో ఖర్చు సైతం తక్కువేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు భూమి రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో శివారు ప్రాంతాలుగా పరిగణించిన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ పరిసరాలు ప్రస్తుతం సంపన్నులు నివసించే ప్రాంతాలుగా మారాయి. కొండ, బండలపై నిర్మించిన ఇళ్లు ఖరీదైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి.


ఇదో కొత్త అనుభూతి..

- కాజ సూర్యనారాయణ, ఫిల్మ్‌నగర్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి

గతంలో రాళ్ల మధ్య ఎగుడు దిగుడుగా ఉన్న కొండలు.. ప్రస్తుతం నివాస గృహాలకు స్థలాలుగా మారడం ఒకవైపు ఆశ్చర్యాన్ని, మరోవైపు ఆనందాన్ని కలిగిస్తోంది. అడవిని తలపించేలా ఉన్న ఫిల్మ్‌నగర్‌ ప్రాంతం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ ప్రాంతాల్లో ఉండటానికి ఎవరూ సాహసించే వారు కాదు. తక్కువ ధరకు విక్రయించినా తీసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఇటీవల కొనుగోలుదారుల మనస్తత్వంలో చాలా మార్పు వచ్చింది. ప్లాట్‌లలో ఉన్న బండలను యథావిధిగా ఉంచి.. వాటిపైనే ఇళ్లు నిర్మిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని