రియల్‌కు రైలు కూత

ఒకప్పుడు మేడ్చల్‌కు వెళ్లాలంటే ఎంత దూరమో అనిపించేది. బీహెచ్‌ఈఎల్‌ దాటి తెల్లాపూర్‌కు వెళ్లాలంటే మహాకష్టం. ఇదే పరిస్థితి ఘట్‌కేసర్, ఉందానగర్‌ ప్రాంతాలది.

Published : 08 Jun 2024 01:36 IST

ఈనాడు  హైదరాబాద్‌: ఒకప్పుడు మేడ్చల్‌కు వెళ్లాలంటే ఎంత దూరమో అనిపించేది. బీహెచ్‌ఈఎల్‌ దాటి తెల్లాపూర్‌కు వెళ్లాలంటే మహాకష్టం. ఇదే పరిస్థితి ఘట్‌కేసర్, ఉందానగర్‌ ప్రాంతాలది. ఇక్కడికి నగరం నుంచి వెళ్లడం ఒక పూట పనిగా ఉండేది. రహదారుల విస్తరణతో ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు ఉండడం.. వీటికి తోడు ఎంఎంటీఎస్‌ రైళ్లు పరుగులు పెట్టడంతో ఇప్పుడు శివారు ప్రాంతాలు నగరానికి ఎంతో చేరువయ్యాయి. గతంలో సిటీలో ఖరీదు చేసేంత బడ్జెట్‌ లేక శివార్లలో ప్రజారవాణా ఉన్న ప్రాంతాల్లో నివాసాలు కొనుగోలు చేసిన  వారి స్థిరాస్తుల ధరలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఇలాంటి అవకాశాలు మార్కెట్లో ఉన్నాయని రియల్టర్లు అంటున్నారు. 

పాతికేళ్ల క్రితం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డుకు వెళ్లాలంటే అబ్బో దూరం అనుకునేవారు. మేడ్చల్, ఈసీఐఎల్, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, ఆరాంఘర్‌ చౌరస్తా, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాలకు వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. ఇది కొత్త తరానికి ఔనా అనిపించవచ్చు..ఇప్పుడవి మినీ టౌన్‌లుగా మారాయి. ఒకప్పుడు అబిడ్స్‌కు వచ్చి షాపింగ్‌ చేసే నగరవాసులు.. ఇప్పుడు నగరం విస్తరించడంతో ఎక్కడివారు అక్కడ షాపింగ్‌ చేస్తున్నారు. అంతగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉంది. ఇందుకు ప్రజారవాణా కీలకం కాబోతోంది. 

దగ్గరవుతున్న దూరం 

ఎంఎంటీఎస్‌ మొదటి దశలో 45 కి.మీ.పరిధి అయితే.. రెండోదశ 95 కి.మీ.మేర విస్తరించింది. ఓఆర్‌ఆర్‌ దాటి ఎంఎంటీఎస్‌లు పరుగులు పెడుతున్నాయి. రీజనల్‌ రింగురోడ్డు హద్దుగా నగర విస్తరణ జరుగుతోంది. నగరానికి పడమర వైపు లింగంపల్లి వరకే పరిమితమైన ఎంఎంటీఎస్‌ సేవలు తెల్లాపూర్‌కు వెళ్లాయి. ఓఆర్‌ఆర్‌కు 4 కి.మీ. దూరంలో ఉన్న కొల్లూరు రైల్వే స్టేషన్‌కు, తర్వాత శంకరపల్లి, వికారాబాద్‌ వరకూ విస్తరించే ప్రణాళికలు హెచ్‌ఎండీఏ వద్ద ఉన్నాయి. ఇప్పుడున్న రెండు రైల్వే లైన్లకు అదనంగా.. ఎంఎంటీఎస్‌ల కోసం ప్రత్యేకంగా లైన్లు కేటాయించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. నగరానికి తూర్పు వైపు చర్లపల్లి తర్వాత ఘట్‌కేసర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ రైళ్లు వెళుతున్నాయి. తర్వాత దశలో యాదాద్రి వరకూ  నడపాలని నిర్ణయించింది. ఉత్తరం వైపు మేడ్చల్‌ వరకూ ఉన్న ఈ సర్వీసులను మనోహరాబాద్‌ వరకూ పెంచాలనే ఆలోచన చేస్తోంది. దక్షిణంవైపు ఇప్పటికే పాతబస్తీని దాటి విమానాశ్రయానికి చేరువుగా ఉందానగర్‌ వరకూ ఎంఎంటీఎస్‌లు నడుస్తున్నాయి. మెట్రో రైలు కూడా శంషాబాద్‌ వరకూ, ఇటువైపు పటాన్‌చెరు, తూర్పు దిక్కున హయత్‌నగర్‌ వరకూ పొడిగించాలనే ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడివన్నీ నివాస ప్రాంతాల విస్తరణకు దోహదం చేస్తున్నాయని రియల్‌ఎస్టేట్‌ రంగం నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేయవచ్చు అని సూచిస్తున్నారు.  
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని