Water board survey: నీరున్నచోటే.. నివాసం!

జలంతోనే జీవనం. నీళ్లు ఉన్నచోట నాగరికతలు వెలశాయి. నగరాల్లో సైతం నీళ్లు ఉన్న చోట నిర్మాణాలకు ఆస్కారం ఉంటుంది.

Published : 01 Jun 2024 04:28 IST

ఇంటి అవసరాలకు వాననీటి సంరక్షణే ముఖ్యం
జలమండలి సర్వేలో ఆసక్తికర వివరాలు

ఇంకుడు గుంతను పునరుద్ధరిస్తున్న జలమండలి ప్రత్యేకాధికారి సత్యనారాయణ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: జలంతోనే జీవనం. నీళ్లు ఉన్నచోట నాగరికతలు వెలశాయి. నగరాల్లో సైతం నీళ్లు ఉన్న చోట నిర్మాణాలకు ఆస్కారం ఉంటుంది. నీళ్లు లేని ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఎవరూ ఇష్టపడరు. గ్రేటర్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ వేసవిలో చాలాప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో అద్దెకు ఉన్నవారు సైతం ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ఇదంతా మానవ తప్పిదమే. గ్రేటర్‌ వ్యాప్తంగా సరాసరి వర్షపాతం 830-850 మిల్లీమీటర్ల వరకు కురుస్తోంది. అయితే వాననీటిలో సింహాభాగం మురుగు కాల్వల్లో కలిసిపోతోంది. వాననీటి సంరక్షణకు చాలా ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు పాటించడం లేదని తాజాగా జలమండలి సర్వేలో వెలుగులోకి వచ్చింది. ఈ వేసవిలో ప్రధానంగా సనత్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ, మణికొండ.. ఇలా అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి. ఫిబ్రవరి నుంచే ఈ సమస్య మొదలై మే నాటికి తీవ్ర రూపం దాల్చింది. దీంతో జలమండలి ఆయా ప్రాంతాలకు భారీ ఎత్తున నీటి ట్యాంకర్లను సరఫరా చేసింది. నగర వ్యాప్తంగా మూడు నెలల్లో 7 లక్షల నీటి ట్యాంకర్లను అందించింది. ఇందులో 38 వేల ఇళ్లు తరచూ నీటి ట్యాంకర్లను తెప్పించుకుంటున్నట్లు జలమండలి గుర్తించింది. ఈ నేపథ్యంలో 18 ఎన్‌జీవోలను ఎంపిక చేసి ఏప్రిల్‌ నుంచి ఆయా ఇళ్లల్లో అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఇంకుడు గుంతలతోపాటు బోరు వెల్స్‌ పరిస్థితిపై ఎన్‌జీవోలు ఆరా తీయగా... ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకుడు గుంతలు లేని కారణంగా చాలా ఇళ్లల్లో బోర్‌వెల్స్‌ ఎండిపోయినట్లు గుర్తించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకిస్తున్న ఇళ్లల్లో బోర్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరికొన్ని ఇళ్లు, కాలనీల్లో ఇంకుడు గుంతలు ఉన్నప్పటికీ.. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రభావం బోర్లపై పడింది.

ఇంకుడు గుంతలు ఉన్నా నిర్లక్ష్యమే..: బోర్లు ఎండిపోయిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లుకు సంబంధించి 3,284 పరిసరాలను పరిశీలించగా...773 ఇంకుడు గుంతల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు జలమండలి గుర్తించింది. ఆయా ఇళ్లల్లో దాదాపు 90 శాతం వరకు బోర్లు పనిచేయడం లేదు. పనిచేస్తున్న కొద్దిపాటి బోర్లు గంట, అరగంటకు మించి నీళ్లు అందించట్లేదు. ముఖ్యంగా ఇంకుడు గుంతలను వానాకాలానికి ముందు మరమ్మతులు చేయాలి. గుంతలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి, ఇసుక, గులక రాళ్లను పూర్తిగా తొలగించి మళ్లీ కొత్త వాటితో నింపాలి. రెండు మూడేళ్ల క్రితం జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, పార్కులు ఇతర ప్రభుత్వ స్థలాల్లో పెద్ద సంఖ్యలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ ప్రాంతంలో కురిసిన నీళ్లు అంతా ఈ గుంతల్లోకి చేరి భూగర్భ జలాలు రీఛార్జి అయ్యేవి. రెండు, మూడేళ్లుగా ఈ గుంతల నిర్వహణ పట్టించుకోలేదు. ఇందులో చెత్త చేరి గుంతలు కనుమరుగయ్యాయి. కొన్ని రోజులుగా జలమండలి ఎన్‌జీవోల ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో సర్వే సందర్భంగా కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్ల వాసులతో మమేకం అవుతున్నారు. ఇంకుడు గుంతల ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు. పదివేల ఇళ్లల్లో సర్వే పూర్తి చేశారు. ఇంకుడుగుంతలు లేని ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో కొత్తవి నిర్మించేందుకు చొరవ చూపుతున్నారు. లేదంటే వచ్చే వేసవి నాటికి ఇలాంటి ఇళ్లకు మళ్లీ నీటి కొరత తప్పదని.. వానాకాలం ప్రారంభం కాకముందే ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి సత్యనారాయణ తెలిపారు. 

భారీగా ఆదా..: వర్షపు నీటిని రెండు పద్ధతుల్లో సంరక్షించవచ్చునని వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. డాబాపై పడిన వాన నీటిని ఫిల్టర్‌ సాయంతో వడబోసి ట్యాంకులోకి మళ్లించి తాగడానికి ఉపయోగించుకోవచ్చు. లేదంటే వాననీటిని ఇదే పద్ధతిలో ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంచవచ్చన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని