ఇల్లు పదిలం.. అగ్ని ప్రమాదాల నుంచి భద్రం

గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఎంతో ఇష్టపడి, కష్టపడి ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేయడమో, లేదా స్థలం కొని ఇంటిని కట్టుకోవడమో చేస్తుంటాం.

Published : 13 Apr 2024 01:43 IST

అందుబాటులో మంటలనార్పే సాధనాలు

గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఎంతో ఇష్టపడి, కష్టపడి ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేయడమో, లేదా స్థలం కొని ఇంటిని కట్టుకోవడమో చేస్తుంటాం. ఇంటి కోసం రూ.లక్షలు ఖర్చు పెడుతున్నప్పటికీ అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తే విలువైన సామగ్రి బూడిదగా మిగులుతుంది. వేసవిలో అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చిన్నచిన్న ముందు జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి రక్షణ ఉండటంతో పాటు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించగలుగుతాం.

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, ఇళ్లు, భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే గంట మోగిస్తూ ఫైరింజన్‌లు వచ్చి మంటలనార్పుతుండటం చూస్తుంటాం. దూర ప్రాంతాలు, ఇరుకు ప్రదేశాలకు అగ్నిమాపక యంత్రాలను తీసుకురావడం కొంత కష్టంతో కూడుకున్న పని. ఇంట్లో జరిగే ప్రమాదాలను ఎవరికి వారు సరైన అవగాహనతో నివారించేందుకు మార్కెట్‌లో పలు  సాధనాలు అందుబాటులో ఉంటున్నాయి. చేతులతో పట్టుకుని వినియోగించేలా ఉండే వీటిని ఇళ్లలో అమర్చుకోవడం తేలిక.  ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లుగా పేర్కొనే ఈ అగ్నిమాపక సాధనాలను కొనుగోలు చేసినప్పుడే వినియోగంపై నిపుణులు అవగాహన కలిగిస్తారు. భారీ ఖర్చుతో కలల సౌధాన్ని నిర్మించుకునేవారు మరి కొద్దిపాటి ఖర్చుతో వీటిని అమర్చుకోవడం చాలా ముఖ్యం.

వివిధ రకాల ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్ల ఉపయోగమిలా..

మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు విభిన్న రకాలుగా ఉంటాయి. ప్రధానంగా నీటితో చల్లార్చేవి, వెట్‌ కెమికల్‌తో, పౌడర్‌తో, కార్బన్‌ డైయాక్సైడ్‌తో, నురుగుతో ఆర్పే  సాధనాలను ఇళ్లలో అందుబాటులో ఉంచుకోవచ్చు. వీటిని సులువుగా వినియోగించే వీలుంది.

1. స్టాండర్డ్‌ వాటర్‌:  కాగితం, కార్డ్‌బోర్డ్‌, ప్లాస్టిక్‌, కలప, ఫ్యాబ్రిక్‌, ఇతర ఘన పదార్థాల నుంచి వచ్చే మంటలను ఆర్పొచ్చు.
2. డ్రైవాటర్‌ మిస్ట్‌: దీని ద్వారా నీటి రేణువులు పొడి సూక్ష్మకణాలుగా మారి అగ్నిని అదుపు చేస్తాయి.
3. వెట్‌ కెమికల్‌: మంటలపై సబ్బు ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే వాటిని అదుపులోకి తేవచ్చు.
4. పౌడర్‌: ఏబీసీ, ఎల్‌-2, ఎం-28 రకాలుగా ఈ సాధనాన్ని విభజించారు. ఏబీసీ ఎక్స్‌టింగ్విషర్‌ ద్వారా కలప, కాగితం, వస్త్రం వంటి కార్బన్‌ ఆధారిత మంటలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాసోలిన్‌, టర్పంటైన్‌ వంటి వాటి నుంచి వచ్చే మంటలు, మీథేన్‌, ప్రొపేన్‌, బ్యూటేన్‌ వంటి వాయువుల వల్ల ఏర్పడేవి ఆర్పేందుకు ఉపయోగిస్తారు. ఎల్‌-2 రకం ద్వారా లిథియం, సోడియం, మెగ్నీషియం వంటి రసాయనాలతో ఏర్పడే వాటిని ఆర్పొచ్చు. ఎం-28 పౌడర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ ద్వారా విద్యుత్తు ఉపకరణాల నుంచి వచ్చే మంటలను ఆర్పొచ్చు.
5. కార్బన్‌ డైయాక్సైడ్‌: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు అదుపు చేయొచ్చు.
6. ఫోమ్‌ ఎక్స్‌టింగ్విషర్‌: కలప, కాగితం, వస్త్రం వంటి ఘన పదార్థాల నుంచి., పెట్రో ఉత్పత్తుల వల్ల ఏర్పడే మంటలను ఆర్పవచ్చు.
7. వాటర్‌ మిస్ట్‌ టైప్‌ ఫైర్‌: ఈ పరికరాన్ని బాల్కానీ, వరండాలు, వంట గది ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేలా డిజైన్లలో లభ్యమవుతుంది. మంటలపై నీటిని వర్షంలా చిమ్ముతుంది.
8. ఫైర్‌ బాల్‌: పుట్‌బాల్‌ పరిమాణంలో ఉండే ఫైర్‌ ఎక్స్‌టింగ్విష్‌ బాల్‌ను మంటల్లో విసిరి వేయగానే అది పేలుతుంది. అందులో నుంచి వచ్చే రసాయనాలు అగ్నిని ఒక్కసారిగా అదుపు చేస్తాయి.  

వినియోగించడంలో అవగాహన కల్పిస్తారు

ప్రదీప్‌కుమార్‌, అగ్నిమాపక అధికారి, సనత్‌నగర్‌

ఇళ్లలో చిన్నచిన్న ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌లను అందుబాటులో ఉంచుకోవడం వల్ల ప్రమాదాలను నిలువరించడం సాధ్యమవుతుంది. ఆయా రకాల మంటలు, వాటిని ఆర్పేందుకు వినియోగించే ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లను కొనుగోలు చేసిన సమయంలోనే వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తారు. యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ సమాచారం ఉంటుంది. తేలికపాటి,  సాధనాల వల్ల ఇంటికి అగ్ని ప్రమాదాల నుంచి భద్రత కల్పించడం సాధ్యమవుతుంది.

మంటలను బట్టి  

ఇళ్లలో మంటలు చెలరేగినప్పుడు అది ఏరకమైన మంటనో తెలుసుకుంటే దాన్ని ఆర్పేందుకు తగిన ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ను వినియోగించే వీలుంది. మంటలను విభిన్న రకాలుగా విభజించారిలా..

  • క్లాస్‌-ఎ: కలప, కాగితం, వస్త్రం వంటి కార్బన్‌ ఆధారిత ఘన పదార్థాల నుంచి వచ్చేవి.
  • క్లాస్‌-బి: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాసోలీన్‌, టర్పంటైన్‌ల వల్ల వచ్చేవి.
  • క్లాస్‌-సి: మీథేన్‌, ప్రొఫేన్‌, బ్యూటేన్‌ వంటి వాయువుల వల్ల ఏర్పడేవి
  • క్లాస్‌-డి: లిథియం, మెగ్నీషియం, ఆల్యూమినియం వంటి లోహాలు కాలడం ద్వారా వచ్చే మంటలు
  • ఎలక్ట్రికల్‌ ఫైర్‌: ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు కాలిపోవడం వల్ల ఏర్పడేవి.
  • క్లాస్‌-ఎఫ్‌: కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించేవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని