ఇంకుడు గుంతతోనే నీటి సంరక్షణ

వానాకాలంలోపు గ్రేటర్‌లోని దాదాపు 30 వేల ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టేలా జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే 18 ఎన్‌జీవోలకు బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటి అవసరంపై అపార్ట్‌మెంట్‌ వాసులు, వ్యక్తిగత గృహాల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు.

Published : 18 May 2024 00:47 IST

30 వేల ఇళ్లల్లో వర్షాకాలం లోపు నిర్మించాల్సిందే
కొత్తవి నిర్మాణం.. లేదంటే పునరుద్ధరణ కీలకం
ఈనాడు, హైదరాబాద్‌

వానాకాలంలోపు గ్రేటర్‌లోని దాదాపు 30 వేల ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టేలా జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే 18 ఎన్‌జీవోలకు బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటి అవసరంపై అపార్ట్‌మెంట్‌ వాసులు, వ్యక్తిగత గృహాల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కొన్ని రోజులుగా ట్యాంకర్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీనిపై జలమండలి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించగా...దాదాపు 30 వేల అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో బోర్లు ఎండిపోయినట్లు గుర్తించారు. ముఖ్యంగా మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఇళ్లలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించేలా అవగాహన కల్పిస్తోంది. 

ఇంటి పైకప్పుపై ప్రతి చుక్క మురుగు కాల్వలోకి కాకుండా భూమిలోకి ఇంకిస్తే అసలు బోర్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తదని నిపుణులు పేర్కొంటున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిర్మాణ సమయంలో ఇంకుడు గుంతల కోసం స్థలం కేటాయిస్తున్నారు. నిర్మాణ అనుమతుల కోసం కొందరు వీటిని నిర్మించి తర్వాత నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో భూమిలోకి చుక్క నీరు ఇంకడం లేదు. వేసవి వస్తే చాలు బోర్లు ఎండిపోతున్నాయి. ఈ బాధలు తప్పించుకోవాలంటే ఇదే మంచి తరుణమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉన్న గుంతలకు మరమ్మతులు చేయాలని, లేదంటే కొత్తగా నిర్మిచాలని సూచిస్తున్నారు. 

రోజుకు 2 వేల లీటర్లు ఇంకించవచ్చు 

ఇప్పటికే అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిర్వహణకు నోచుకోని ఇంకుడు గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. మే నెలాఖరు లోపు ఈ పనులు పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. జూన్‌ నుంచి రుతుపవనాల రాకతో వానలు కురిస్తే ఇంటి ఆవరణలో పడ్డ ప్రతి చినుకు పుడిమి తల్లి ఒడిలోకి చేరాల్సిందే. ఇప్పటికే అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ఆవరణలో ఇంకుడు గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలి. గోతిలో ఉన్న ఆకులు, వ్యర్థాలను తొలగించాలి. వాటిపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని పూర్తిగా తీసివేయాలి. దానిపై మళ్లీ కొత్తగా ఇసుకతో నింపి, గుంతలోకి వర్షపు నీళ్లు సక్రమంగా చేరేలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి 10-15 రోజులకు ఒకసారి గుంతలోని వ్యర్థాలను తీస్తూపోతే...బోలెడంత వర్షపు నీటిని భూమిలోకి ఇంకించవచ్చు. సాధారణ వర్షపాతం ఉన్న రోజున 100 చదరపు మీటర్ల పైకప్పు ఉన్న ఆవరణలో కురిసిన వాన నీరు రోజుకు దాదాపు 2 వేల లీటర్లు. అదే పెద్ద అపార్ట్‌మెంట్ల పైకప్పుపై పడే వాన నీటిని భూమిలోకి పంపితే భారీ ఎత్తున ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ ఖర్చుతోనే ఎంతో లాభం...

వంద ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లలో నెలకు రూ.60-70 వేల వరకు ట్యాంకర్లకే ఖర్చు చేస్తున్నారు. దీనికంటే తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంత నిర్మించవచ్చు. దీనివల్ల వర్షపు నీటిని ఇంకించడమే కాకుండా...బోర్లు ఎండిపోవడం అనేది ఉండదు. 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి 6 క్యూబిక్‌ మీటర్ల ఇంకుడు గుంత సరిపోతుంది. కొత్తగా నిర్మించేవారు తొలుత ఇంటి ఆవరణలో సరైన స్థలాన్ని ఎంపిక చేయాలి. వాలు ఉన్న చోట ఏర్పాటు చేసుకోవడం వల్ల వర్షపు నీరంతా ఆ గుంతలోకి చేరి భూమిలోకి ఇంకుతుంది. తొలుత అనువైన పొడవు వెడల్పుతో 2 మీటర్ల లోతున గుంతను తవ్వాలి. దీని అడుగు భాగాన కింది నుంచి సగభాగం వరకు 40 మిల్లీమీటర్ల పరిమాణం గల కంకర, తర్వాత పావు భాగం 20 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కంకరతో నింపాలి. గుంతలో కొంత భాగం ఖాళీగా ఉండేలా చూసుకొని దొడ్డు ఇసుకతో నింపాలి. తర్వాత వర్షపు నీటి పైపును ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. ఇలా చేయడం వల్ల మున్ముందు బోర్లలో నీళ్లు ఇంకే పరిస్థితి తలెత్తదని నిపుణులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని