chandeliers: షాండ్లియర్లతో రాజసం

ఇంట్లో అలంకరణ వస్తువులు మొదలుకొని ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలన్నది చాలామంది కోరుకుంటుంటారు. ఇందులో షాండ్లియర్‌ది ప్రత్యేక స్థానం.

Updated : 01 Jun 2024 05:04 IST

ఇంటి అలంకరణలో వీటి ప్రత్యేకతే వేరు
అబిడ్స్, న్యూస్‌టుడే

రాయల్‌ షాండ్లియర్‌

ఇంట్లో అలంకరణ వస్తువులు మొదలుకొని ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలన్నది చాలామంది కోరుకుంటుంటారు. ఇందులో షాండ్లియర్‌ది ప్రత్యేక స్థానం. ఇవి కలల గృహానికి సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి. పైకప్పునకు వేలాడుతూ.. వెలుగులు పంచుతూ.. సంగీతాన్ని అందిస్తూ ఇంటికొచ్చిన అతిథులను మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న షాండ్లియర్స్‌ కోసం గృహ యజమానులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. భిన్న ఆకృతుల్లో వీటిని తమ స్థోమతకు తగ్గట్టుగా కొని ఇంటికి అలంకరిస్తున్నారు. కొందరైతే ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

చారిత్రక హైదరాబాద్‌ నగరంలో నిజాం నవాబుల బంగళాలు, ప్యాలెస్‌లలో షాండ్లియర్స్‌ రాజదర్పం ఒలకబోస్తూ దర్శనమిచ్చేవి. క్రమంగా ఇవి సామాన్యుల ఇళ్లల్లోకి చేరాయి. ఆంగ్లంలో షాండ్లియర్‌ అని పిలిచే వీటిని పక్కా హైదరాబాదీ భాషలో చెప్పాలంటే ‘జూమర్‌’ అంటారు. క్రిస్టల్‌తో తయారయ్యే జూమర్స్‌ ఇంట్లోని హాలు మధ్య భాగంలో వేలాడదీసి ఇంటిని అలంకరిస్తుంటారు. కేవలం హాల్స్‌లోనే కాకుండా మాస్టర్‌ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్‌ బెడ్‌ రూమ్, డైనింగ్, లీవింగ్‌ హాలు తదితర విభాగాల్లో సైజును బట్టి రంగురంగుల జూమర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పదేళ్ల కాలంలో జూమర్ల వాడకం ఎక్కువైందని, చిన్న ఇల్లు అయినా, పెద్ద బంగళా కట్టుకున్నా.. జూమర్‌ లేకుండా ఇంటీరియర్‌ లేదనే.. ఇంటీరియర్‌ డిజైనర్లు చెబుతున్నారు. 

భిన్న మోడల్స్‌లో లభ్యం..

వేల రకాల మోడల్స్‌లో లభించే ఈ జూమర్స్‌ ఒక అడుగు నుంచి 5 అడుగుల ఎత్తు వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అంతకుమించి కావాలంటే ప్రత్యేకించి తయారు చేయించుకుంటున్నారు. ఇటాలియన్‌ డిజైన్, బెల్జియం, మోరాకిన్, ఇండియన్, యాంటిక్, రస్టిక్‌ (నిజాం స్టైల్‌) తదితర డిజైన్లలో ఎక్కువ శాతం ఇవి లభిస్తుంటాయి. 

ఈ జూమర్లు సైజులను బట్టి హాల్స్‌లో, రూమ్‌లతో పాటు లైట్ల రూపంలో హ్యాంగింగ్, వాల్, సీలింగ్, ప్రొఫైల్, ఔట్‌ డోర్‌.. ఇలా బహుళ విధాలుగా వినియోగించుకునే వీలుంటుంది.

ఇటాలియన్‌ ..

అర కోటి దాకా... 

ఈజిప్టు నుంచి దిగుమతి అవుతున్న రా మెటీరియల్‌ (క్రిస్టల్‌)తో ముంబయిలోని సుమారు ఇరవైకి పైగా ఉన్న భారీ పరిశ్రమల్లో జూమర్ల తయారీ జరుగుతోంది. జూమర్ల తయారీలో ప్రత్యేకించి క్రిస్టల్‌ మెటీరియల్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారు. జూమర్‌ విద్యుత్‌ బల్బుల కాంతిలో డైమండ్‌లా మెరుస్తుండటం విశేషమని హైదరాబాద్‌ న్యూ ఉస్మాన్‌గంజ్‌లోని హోల్‌సేల్‌ వ్యాపారి యాష్‌ అగర్వాల్‌ తెలిపారు. 

  • రూ.5 వేలు మొదలుకొని రూ.50 లక్షల విలువ చేసే జూమర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ప్రజలు తమ స్థోమతను బట్టి కొనుగోలు చేయడం, అవసరం అయితే వారికి నచ్చిన డిజైన్లను ఆర్డరు ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. 
  • ఇంటీరియర్‌లో అత్యంత విలువైనదిగా భావించే జూమర్‌ పట్ల ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొందని, నిజాం కాలం నుంచి ఇది వాడుకలో ఉన్నప్పటికీ అప్పట్లో శ్రీమంతుల ఇళ్లలోనే దర్శనమిచ్చేవని, ఇటీవల ప్రతి ఒక్కరూ జూమర్‌ ప్రత్యేకతను గుర్తించి గృహాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని యాష్‌ అగర్వాల్‌ తెలిపారు. 

వీటికి చిరునామాగా న్యూ ఉస్మాన్‌గంజ్‌..

జూమర్ల విక్రయాలకు నగరంలోని న్యూ ఉస్మాన్‌గంజ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌గా పేరొందింది. మోజంజాహీ మార్కెట్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వెళ్లే దారిలో ఎడమ వైపున న్యూ ఉస్మాన్‌గంజ్‌లో సుమారు వందకుపైగా జూమర్లు విక్రయించే వందకు పైగా హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. నగరంలో నాలుగు వందల నుంచి అయిదు వందల రిటైల్‌ దుకాణాలు ఉన్నాయి. విభిన్న సైజుల్లో వేల డిజైన్లలో లభించే జూమర్లను కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తయారు చేయించి అందజేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. జూమర్లతో పాటు థాయిలాండ్‌ నుంచి వచ్చే ఎల్‌ఈడీ లైట్లకు ప్రజల్లో విపరీతమైన డిమాండు ఉందంటున్నారు. 

వారంటీ కూడా ఇస్తున్నారు.. 

ఇంటికి ఎంతో అందం తెచ్చిపెడుతున్న జూమర్స్‌ కొనుగోలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఇంటీరియర్‌ డిజైనర్లు సలహా ఇస్తున్నారు. అతి సున్నితమైనదిగా భావించే జూమర్లు నాణ్యమైనవా? కావా? పరిశీలించి కొనుగోలు చేస్తే మంచిదని చెబుతున్నారు. వారంటీ ఇచ్చి జీవితకాలం సర్వీసు ఇచ్చే దుకాణాల్లోనే కొనుగోలు చేస్తే వస్తువుకు గ్యారంటీ ఉంటుంది. 

దుకాణాల్లో తిరగలేం అనేవారికి ఆన్‌లైన్‌లోనూ షాండ్లియర్లు భిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆధునిక డిజైన్లు దర్శనమిస్తున్నాయి.

బెల్జియమ్‌ ఇటాలియన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని