పరిసరాలు పచ్చగా.. చల్లదనం చౌకగా..!

వేసవి వచ్చిందంటే అందరిలో ఒకటే కలవరింత..అధిక ఉష్ణాగ్రతల బెడదతో రోజులు గడిచేదెలా..? అని..ఏసీలు, ఇతర ప్రత్యామ్నాయాలున్నా విద్యుత్తు సరఫరాతో కూడుకున్న వ్యవహారం..

Published : 04 May 2024 01:11 IST

ఇంటి లోపల మొక్కలతో ఆహ్లాదం
ఉష్ణోగ్రతల నియంత్రణలో కీలకం

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: వేసవి వచ్చిందంటే అందరిలో ఒకటే కలవరింత..అధిక ఉష్ణాగ్రతల బెడదతో రోజులు గడిచేదెలా..? అని..ఏసీలు, ఇతర ప్రత్యామ్నాయాలున్నా విద్యుత్తు సరఫరాతో కూడుకున్న వ్యవహారం.. ఈ తరుణంలో మనకు ఉపశమనం కలిగించే మొక్కలు ఎన్నో ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించి సహజ సిద్ధమైన గాలులను అందించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇంటి ఆవరణలో హైబ్రిడ్‌ మామిడి మొక్కలు, వేప, రావి, గానుగ, బాదం వంటి మొక్కలు పెంచితే నీడతో పాటు చల్లదనాన్ని ఇస్తాయి. తక్కువ ధరలతో ఇంటి లోపల మొక్కలు ఏర్పాటు చేసుకుని ఇంటిని స్వర్ణసీమగా మార్చుకునే అవకాశం ఉంది.

అలోవిరా..: ఇది సౌందర్య పోషకాలున్న మొక్కగానే చాలా మందికి తెలుసు. అధిక ఉష్ణోగ్రతను తగ్గించగలిగే శక్తి ఈ మొక్కకు ఉంది. దీంతో పాటు ఇంటి పరిసరాల్లో ఉండే ఫార్మాల్డిహైడ్‌ వంటి కలుషితాలను హరిస్తుంది. దీని పత్రాలు రసభరింతగా ఉండడం వల్ల నీటిని నిల్వ చేసుకుంటాయి. అందువల్ల చల్లని గాలులను అందిస్తుంది. ఈ మొక్కకు వారానికోసారి నీరుపోస్తే సరిపోతుంది.

పోధాన్‌..: మనీ ప్లాంట్‌గా పిలిచే ఈ మొక్క హరితానికి మారుపేరుగా నిలుస్తోంది. గుబురుగా ఉండడం దీని లక్షణం.. కిటికీలు, వరండాల్లోనూ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ మొక్క నుంచి వీచేగాలి ఇంటి లోపల చల్లదనాన్ని కలిగిస్తుంది. చుట్టూ ఉన్న విషగాలులు, కలుషితాలను హరించి.. స్వచ్ఛమైన గాలిని అందించడంలో తోడ్పడుతుంది.

చిన్నరబ్బర్‌ మొక్కలు..: గృహాల్లో గాలిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడంలో ఈ మొక్కలు కీలకపాత్ర పోషిస్తాయి. హానికరమైన రసాయనాలుంటే తొలిగించి అధిక మొత్తంలో ఆక్సిజన్‌ విడుదల చేయడంలో ఉపకరిస్తాయి. చూడడానికి అందంగా కూడా ఉంటాయి.

కోలియన్‌ ఆరోమెటికన్‌..: ఈ మొక్క పత్రాలు వాముతో కూడిన సువాసన వెదజల్లుతుంటాయి. ఈ ఆకులను ఉపయోగించి శనగపిండి బజ్జీలు వేస్తుంటారు. ఈ మొక్క.. కుండీ అంతటా ఆక్రమించి దట్టంగా పెరుగుతుంది. ప్రహరీపైన, కిటికీల్లోనూ, ఇంటిలోపల ఏర్పాటు చేసుకోవచ్చు. స్వచ్ఛమైన గాలితో పాటు చల్లదనాన్ని అందిస్తుంది.

పుదీనా..: అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కగా పుదినాకు పేరుంది. ‘మింట్‌’ మొక్కగా పిలిచే ఇది సుగంధభరింతగా ఉంటుంది. అధిక రంధ్రాలు కలిగిన పత్రాలతో నిండుగా ఉంటుంది. కీటకాలను దరిచేరనీయదు. చల్లటి గాలిని అందిస్తుంది.

ఫెరన్‌..: ఈ జాతిలో అనేక మొక్కలు వివిధ ఆకృతుల్లో అందంగా ఉంటాయి. ఇంట్లో పెంచుకోవడానికి అన్ని విధాలా అనువైన మొక్క ఇది. దీని పత్రాల ద్వారా విడుదలయ్యే నీటి తుంపర్లు వేడిగాలులను చల్లబరుస్తాయి. ఇంటి పరిసరాలు, కిటికీల్లో పెట్టుకుంటే అందంతో పాటు చల్లదనం సొంతమవుతుంది.

నిమ్మగడ్డి.. : దీన్నే సిట్రోనిల్లాగ్రాస్‌ అంటారు. గడ్డిజాతి మొక్కలా కనిపించే ఈ మొక్క వేసవిలో చల్లదనం ఇవ్వడంతో పాటు దోమలను నివారిస్తుంది. గడ్డిజాతి మొక్కలా ఉండడం, ఎప్పుడూ కొంతనీటిని కలిగి ఉండడం వల్ల చల్లటి గాలిని అందిస్తుంది.

అరెకాపామ్‌..: అందంగా గుబురుగా పెరిగే ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉండడం ఎంతైనా అవసరం. అలంకరణకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంటి పరిసరాల్లో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌ , టాక్సీన్‌ వంటి రసాయనాలను తొలగించి గాలిని శుభ్రపరుస్తుంది. గాలి స్వచ్ఛతను కాపాడడంలో దీనికి పోటీలేదు. పరిశభ్రమైన చల్లని గాలిని అందిస్తుంది. వీటితోపాటు గృహాల్లో సహజంగా పెంచుకునే తులసి, మల్లె మొక్కలు కూడా చల్లదనం, ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు సుగంధాలను వెదజల్లుతాయి. తక్కువ ధరలో దొరుకుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని