ఇంట్లోనే హాయిగా.. ఇలా

సొంతింటి కల.. ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో.. దాన్ని ఫర్నిచర్‌తో అందంగా తీర్చిదిద్దుకోవడానికీ నగరవాసులు అంతే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇల్లు కొనుగోలు చేయగానే.. మొదట ఇంట్లో ఎలాంటి సోఫాలు వేసుకోవాలి.. ఏ ఫర్నిచర్‌ షాపులో బాగుంటాయన్న ఆలోచనలు చేస్తారు.

Published : 20 Apr 2024 03:11 IST

రెక్లెయినర్‌ సోఫాలకు మంచి గిరాకీ

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: సొంతింటి కల.. ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో.. దాన్ని ఫర్నిచర్‌తో అందంగా తీర్చిదిద్దుకోవడానికీ నగరవాసులు అంతే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇల్లు కొనుగోలు చేయగానే.. మొదట ఇంట్లో ఎలాంటి సోఫాలు వేసుకోవాలి.. ఏ ఫర్నిచర్‌ షాపులో బాగుంటాయన్న ఆలోచనలు చేస్తారు. ఎక్కడ కొనుగోలు చేసుకోవాలి.. ఇల్లు లేదా ఫ్లాటులోని హాలు.. అతిథుల సిట్టింగ్‌ గది.. బెడ్‌రూంలో కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ప్రతి ఒక్కరూ తమ అభిరుచికి అనుగుణంగా ఆలోచనల్లో విహరిస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే నగరంలో ప్రస్తుతం లెక్కకు మించి ఫర్నిచర్‌ షోరూంలు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్‌లో ఇలా పరిశోధిస్తే.. అలా షోరూంల వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతే కాదండోయ్‌.. మనకు కావాల్సిన అభిరుచికి తగిన ఫర్నిచర్‌ను అందించేందుకు సిద్ధంగా షోరూం నిర్వాహకులు వినియోగదారులకు ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతున్నారు. రకరకాల సోఫాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఒకప్పుడు మామూలుగా కూర్చునేందుకు సోఫాలుంటే చాలన్నట్లు అనుకునేవారు. తర్వాత చూసేందుకు అందంగా.. కూర్చుంటే హాయిగా.. నాణ్యతలో మెరుగ్గా ఉండే సోఫాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. గత కొన్నేళ్లుగా మారుతున్న పరిస్థితులు.. అత్యాధునిక అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో వస్తున్న మార్పులను గమనిస్తూ.. సరికొత్త సోఫాల వైపు నగరవాసులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుంటే కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితులను అధిగమిస్తూ.. రిలాక్స్‌గా కూర్చునేందుకు.. అవసరమైనప్పుడు పడుకునేందుకు రెక్లెయినర్‌ సోఫాలు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవంగా ఇవి మార్కెట్‌లోకి వచ్చి పది, పదిహేనేళ్లయినప్పటికీ ముందుగా సింగిల్‌ కుర్చీలు ఉండేవి. తర్వాత నాలుగైదు కుర్చీలతో సోఫాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముందు మాన్యువల్‌గా అంటే చేతులతో కావాల్సిన విధంగా మార్చుకునేలా మాన్యువల్‌ రెక్లెయినర్‌ సోఫాలు రాగా.. తర్వాత పవర్‌ రెక్లెయినర్లు కూడా వచ్చేశాయి. రెక్లెయినర్‌  సోఫాలకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో.. ఇందులోనే రకరకాల మోడళ్లు.. సోఫాలోనే వైఫై, ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకునే సదుపాయాలతో పాటు టీ, జ్యూస్‌ గ్లాసులు పెట్టుకోవడానికి ఏర్పాట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

మూడురకాల సదుపాయాలు అందుబాటులోకి..

రెక్లెయినర్‌ సోఫాల్లో ప్రస్తుతం మూడు రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాకింగ్‌, రోటేటింగ్‌, రెక్లెయినర్‌ ఇలా మూడురకాల సదుపాయాలు ఉన్నాయి. రాకింగ్‌ అంటే మనం ఒకప్పుడు చెక్క కుర్చీలో కూర్చొని ముందుకు.. వెనక్కి ఊగేవాళ్లం గుర్తుందా..? అదే సదుపాయం ఇప్పుడు రెక్లెయినర్‌ సోఫాలోనూ వచ్చేసింది. ఇక రెండోది రోటేటింగ్‌.. సోఫాలో కూర్చుని ఎంచక్కా ఎటు కావాలంటే అటు.. తిరగొచ్చు. మూడోది.. రెక్లెయినర్‌.. దీని గురించి అందరికీ తెలుసు.. కూర్చునే పొజిషన్‌ నుంచి వెనక్కి వాలడం.. పడుకోవడానికి వీలుగా మాన్యువల్‌లో,  ఆటోమేటిగ్గా.. బటన్‌తో మార్చుకునేందుకు పవర్‌ రెక్లెయినర్‌ సోఫాల్లో వెసులుబాటు ఉంది. వృద్ధులకు మాన్యువల్‌ కంటే.. పవర్‌ రెక్లెయినర్లు మంచిందని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ రెక్లెయినర్‌తోపాటు మిగతా సోఫాల్లోనూ ధరకు తగినట్లు నాణ్యతతో కూడినవి మార్కెట్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్‌, మైక్రో ఫ్యాబ్రిక్‌తోపాటు లెదర్‌ సోఫాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. లెదర్‌లో ఆర్టిఫిషియల్‌, ఒరిజినల్‌ రెండు రకాలున్నాయి. సహజంగా శుభ్రం చేసుకునేందుకు లెదర్‌ సోఫాలు బాగుంటాయి. కానీ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన సోఫాలు కంఫర్ట్‌గా ఉంటాయి. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లెదర్‌ కంటే ఫ్యాబ్రిక్‌ సోఫాలు వినియోగించడం మేలంటున్నారు. చాలా షోరూంలలో ఇండియన్‌, మలేషియన్‌, అమెరికన్‌, ఇటాలియన్‌ సోఫాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆయా దేశాల్లో వాడుకలో ఉన్న సోఫాలు ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ సోఫాలు రూ.10 వేల నుంచి రూ.లక్ష ఆ పైన ధరల్లో.. రెక్లెయినర్‌లో రూ.25,000 నుంచి రూ.2 లక్షల వరకు వివిధ రకాల ధరల్లో నాణ్యత, డిజైన్‌కు అనుగుణంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొన్ని షోరూంల నిర్వాహకులు  కష్టమైజ్డ్‌(మనకు కావాల్సిన డిజైన్‌, రంగు) సోఫాలు కూడా అందిస్తున్నారు. అయితే ఇలా కావాలంటే.. ఆర్డర్‌ ఇస్తే.. వాటిని తయారుచేసి డెలివరీ ఇస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని