600 గజాలు దాటితే చలువ పైకప్పు వేయాల్సిందే

నగరాలు, పట్టణాల్లో ఆరు వందల చదరపు గజాలు అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే అన్ని రకాల నిర్మాణాలు అనివార్యంగా చలువ పైకప్పు విధానాన్ని అమలు చేయాలి. అలాంటి నిర్మాణాలకు మాత్రమే నివాస వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌) జారీ చేస్తారు.

Updated : 21 Apr 2024 11:53 IST

ఇళ్లలో అధిక వేడి నుంచి ఉపశమనం
కూల్‌ రూఫ్‌ పాలసీకి ఏడాది

ఈనాడు, హైదరాబాద్‌: నగరాలు, పట్టణాల్లో ఆరు వందల చదరపు గజాలు అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే అన్ని రకాల నిర్మాణాలు అనివార్యంగా చలువ పైకప్పు విధానాన్ని అమలు చేయాలి. అలాంటి నిర్మాణాలకు మాత్రమే నివాస వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌) జారీ చేస్తారు. 600 కన్నా తక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలకు ఈ నిబంధనల అమలు ఐచ్ఛికం. అయినా సరే పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చలువ పైకప్పులకు గృహ యాజమానులు మొగ్గుచూపుతున్నారు.

ఇల్లే కదా స్వర్గసీమ అంటాం.. వేసవి వచ్చిందంటే అవే ఇళ్లలో వేడికి ఉండలేని పరిస్థితి. ఇదివరకు ఇంటి ముందు, వెనకాల ఖాళీ జాగా వదిలి అందులో మొక్కలు పెంచేవారు. ఇంటి చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లతో ఉక్కపోత అంతగా ఉండేది కాదు. ఇప్పుడు అంగుళం జాగా వదలకుండా పూర్తిగా కాంక్రీట్‌తో కప్పేస్తున్నారు. వాతావరణ మార్పులతో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలువ పైకప్పు విధానాలతో రెండు నుంచి నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు అని నిపుణులు అంటున్నారు.

ఈ విధానమేంటంటే..

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భవిష్యత్తు తరాలను కాపాడేందుకే చలువ పైకప్పు విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో తీసుకొచ్చింది. ప్రత్యేకంగా తెలంగాణ కూల్‌ రూఫ్‌ పాలసీ - 2023-28 విధానాన్ని ఆవిష్కరించింది. దేశంలో ఈ విధానాన్ని అమలులోకి తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. 2030 నాటికి మూడు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో చలువ పైకప్పు విధానాన్ని అమలు చేయాలని లక్ష్యం. నూతన నిర్మాణాలతోపాటు ఇప్పటికే ఉన్న నిర్మాణాల్లో ఈ విధానాన్ని అమలు చేయటం ద్వారా ఇళ్లు, వాణిజ్య నిర్మాణాల్లో ఉష్ణోగ్రత తీవ్రత కొంత తగ్గుతుంది. ఇందుకోసం అదనంగా పెట్టిన ఖర్చు విద్యుత్తు పొదుపు ద్వారా ఆదా అవుతుంది. ఇంట్లో వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తుంది.

లక్ష్యాలు ఇలా

తొలి ఏడాదిలో ఏడున్నర చదరపు కిలోమీటర్ల పరిధిలో చలువ పైకప్పు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అయిదు చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో రెండున్నర చదరపు కిలోమీటర్లకు విస్తరించాలనేది లక్ష్యం. ఈ దిశగానే నగరవాసులు అడుగులు వేస్తున్నారు. తమ ఇళ్లపై చలువ పెయింట్‌ వేయించడం, టైల్స్‌ పరచడం, పచ్చదనం పెంచడం, సౌర పలకల ఏర్పాటు ద్వారా ఇంట్లోకి వచ్చే వేడిని తగ్గించుకుంటున్నారు.

  • ఐదేళ్లలో గ్రేటర్‌ పరిధిలో రెండు వందల చదరపు కిలోమీటర్లు, ఇతర ప్రాంతాల్లో వంద చదరపు కిలోమీటర్ల పరిధిలో చలువ పైకప్పు విధానాన్ని అమలు చేయాలని పురపాలక శాఖ లక్ష్యంగా నిర్దేశించింది.
  • గ్రేటర్‌ పరిధి ఉండే 675 చదరపు కిలోమీటర్లు, అవుటర్‌ రింగు రోడ్డు వరకు తీసుకుంటే వెయ్యి చదరపు కిలోమీటర్లు పరిధి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్‌లోని 20 శాతం పరిధిని లక్ష్యంగా నిర్దేశించారు.
  • రాష్ట్రంలో పురపాలక సంఘం వారీగా ఎంత విస్తీర్ణంలో చలువ పైకప్పు విధానాన్ని అమలు చేయాలనేది గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 31 జిల్లాల పరిధిలోని 141 పురపాలక సంఘాల్లోనూ 2.88 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో చలవ పైకప్పు పద్ధతులను అమలు చేయాలని స్పష్టం చేసింది.
  • ఈ విధానాన్ని అమలు చేయటంలో పురపాలక సంఘాలకు సలహాలు, సూచనలు చేసేందుకు డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ)ని నోడల్‌ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఈ విధానంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికారులు ఈ విధానం అమలుపై అంతగా దృష్టిపెట్టలేదు. ప్రచారమూ చేయలేదు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమకు నచ్చిన విధంగా చలువ పైకప్పులతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


తప్పనిసరి : విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, వాణిజ్య భవనాల్లో చలువ పైకప్పులు తప్పనిసరి.

స్వచ్ఛందంగా: సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న భవనాలపై చలువ పైకప్పు ఏర్పాటు ఐచ్ఛికం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని