పచ్చదనం ఇంటికి అందం.. మనసుకు ఆనందం

మొక్కలు పెంచుకుంటే ఇంటి ఆవరణ చూడముచ్చటగా ఉంటుంది. పచ్చదనం మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

Published : 18 May 2024 00:39 IST

మొక్కల పెంపకంపై పెరుగుతున్న ఆసక్తి

తూంకుంట దేవరయాంజాల కాలనీలోని ఓ ఇంటిలో..

మొక్కలు పెంచుకుంటే ఇంటి ఆవరణ చూడముచ్చటగా ఉంటుంది. పచ్చదనం మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇంటికి ఆకుపచ్చని అలంకరణలా మారుతుంది. ఇళ్లలో పెంచుకునే అలంకరణ మొక్కల్లో చాలావరకు మేడ్చల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నర్సరీల్లో లభిస్తున్నాయి. శామీర్‌పేట, తూంకుంట, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, బొడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో 68 ప్రైవేట్‌ నర్సరీలు ఉన్నాయి. ముఖ్యంగా రాజీవ్‌ రహదారి, వరంగల్, మేడ్చల్‌ జాతీయ రహదారులపై ఉన్న నర్సరీల్లో అలంకరణ నుంచి ఔషధ మొక్కల వరకు అందుబాటులో ఉంటున్నాయి. 

శామీర్‌పేట, న్యూస్‌టుడే

శామీర్‌పేటలోని నర్సరీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మేడ్చల్‌ నియోజకవర్గం దాదాపు కలిసిపోతున్న క్రమంలో .. ఘట్‌కేసర్, బొడుప్పల్, శామీర్‌పేట, కీసర, నాగారం, దమ్మాయిగూడ, మేడ్చల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాలను ఎంపిక చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిత్యం నగర జీవనంలో ఒత్తిడితో సతమతమయ్యే వారు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు ఉత్సాహం చూపుతుండటంతో, ఈ ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. స్థిరాస్తి వ్యాపారులు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతోపాటుగా, అదనపు ఆకర్షణగా వారు కోరిన మొక్కలను నాటి ఇంటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు.

  • పచ్చదనంతో నిండిన ఆవరణలో ఉన్న వ్యక్తి మెదడు ఆహ్లాదానికి గురై ఆనందాన్ని ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.
  • మొక్కల కోసం ఇంటి ఆవరణలో స్థలం లేనివారు సైతం.. కుండీల్లో పెంపకానికి ఉత్సాహం చూపుతున్నారు. 
  • పిల్లలను పెంచి పెద్ద చేసే మాదిరి ఎంతో జాగ్రత్తగా  పెంచుతున్నారు. 
  • ఇంటి పరిసరాల్లో, ఇంట్లో రకరకాల మొక్కలను నాటేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

అలంకరణ మొక్కలకు ప్రాధాన్యం

ఇళ్లలో అందమైన మొక్కలను నాటేందుకు మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. మనీ ప్లాంట్, ఆక్సిజన్‌ ప్లాంట్, ఎడారి మొక్కలు, స్టేరా, కాస్టస్, ట్రెసీనా, సీసీ ప్లాంట్, ఎఫెన్‌డేకియా అగ్లొనిమియా, లిల్లీ, సంపెంగ, మందార, గులాబీ, ఫ్లోటెండ్రా, రబ్బర్‌ ప్లాంట్, సమాంబఫ్‌ ఇండియా, కలెడియన్స్, స్నేక్‌ ప్లాంట్, గోల్డెన్‌ ప్లాంట్, క్రోటాన్, ఆస్టేన్స్, క్లోరోఫైటమ్, ఫర్పోరియా, హరికపామ్స్‌ లాంటి అలంకరణ మొక్కలు పెంచేందుకు ఇష్టపడుతున్నారు. 

  • కొన్ని మొక్కలు ఇంటి లోపల ఉంటే వాస్తు సమస్యను అధిగమించవచ్చని, శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతున్న వారూ లేకపోలేదు. 
  • బోన్సాయ్‌ మొక్కలు చూడటానికి చాలా చిన్నగా అందంగా ఉంటాయి. వీటిని ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా, మధ్యలో ఉంచేందుకు పలువురు మొగ్గు చూపుతున్నారు.  
  • చిన్న చిన్న వెదురు మొక్కలను లక్కీ బ్యాంబూగా భావిస్తూ ఇంట్లో, కార్యాలయాల్లో డెస్క్‌లపై, దుకాణాల కౌంటర్ల వద్ద పెంచుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు