ప్లైవుడ్‌ను ఎంపిక చేసుకుందామిలా..

ఇళ్లు, ఫ్లాటు, డూప్లెక్స్‌ విల్లా, ఫామ్‌ హౌస్‌లో అతిథి గృహం.. ఇలా చిన్నదైనా, పెద్దదైనా ఏది కొత్తగా నిర్మించినా ఇంట్లో ఇంటీరియర్‌ అనేది తప్పనిసరిగా మారిన రోజులివి. దీంతో ప్లైవుడ్‌ మార్కెట్‌కు ఏర్పడిన డిమాండ్‌ అంతా ఇంతా కాదు.

Published : 27 Apr 2024 00:33 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే

ళ్లు, ఫ్లాటు, డూప్లెక్స్‌ విల్లా, ఫామ్‌ హౌస్‌లో అతిథి గృహం.. ఇలా చిన్నదైనా, పెద్దదైనా ఏది కొత్తగా నిర్మించినా ఇంట్లో ఇంటీరియర్‌ అనేది తప్పనిసరిగా మారిన రోజులివి. దీంతో ప్లైవుడ్‌ మార్కెట్‌కు ఏర్పడిన డిమాండ్‌ అంతా ఇంతా కాదు. తెలంగాణలో ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లైవుడ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు గోషామహల్‌ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా గతంలో పదుల సంఖ్యలో ఉండే హోల్‌సేల్‌ దుకాణాలు ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. నగరం నడిబొడ్డున నాంపల్లి రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న గోషామహల్‌లో ప్రధాన రోడ్డు నుంచి మొదలు నిజాంషాహీ రోడ్డు, దారుస్సలాం, పాన్‌మండీ, ఆగాపుర, సీతారాంపేట, సీతారాంబాగ్‌, మల్లేపల్లి, బోయిగూడకమాన్‌, చార్‌కందిల్‌, బజార్‌ఘాట్‌, గోడేఖీఖబర్‌, మంగళ్‌హాట్‌ వరకు ఈ దుకాణాలు విస్తరించాయి. బ్రాండెడ్‌ ప్లైవుడ్‌తో పాటు లోకల్‌ బ్రాండెడ్‌ ప్లైవుడ్‌ షీట్లు కొన్ని వందల రకాలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

శివారులో 50 ఫ్యాక్టరీలు

హైదరాబాద్‌ నలువైపులా ఉన్న శివారు ప్రాంతాల్లో సుమారు 50కి పైగా ప్లైవుడ్‌ తయారీ ఫ్యాక్టరీలు నెలకొని ఉండగా.. ఏపీ, కేరళ, యూపీ, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నగరానికి దిగుమతి అవుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న ఈ ప్లైవుడ్‌ను పరిశీలిస్తే.. 18 ఎంఎం ప్లైవుడ్‌ షీట్లకు ఎక్కువగా డిమాండు ఉంది. ఒక్కో షీటు 8/4 సైజులో 32 అడుగులు కల్గి ఉంటుంది. 18 ఎంఎం, 19 ఎంఎం, 16 ఎంఎం, 12 ఎంఎం, 9 ఎంఎం, 8 ఎంఎం, 6 ఎంఎం, 4 ఎంఎం మందంతో షీట్లు ఇక్కడి హోల్‌సేల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.


మందాన్ని బట్టి ధర..

ప్లైవుడ్‌ షీటు మందాన్ని బట్టి అడుగుకు రూ.28 నుంచి రూ.150 వరకు మార్కెట్‌లో ధర పలుకుతోంది. బ్రాండెడ్‌ ప్లైవుడ్‌ విషయంలో కాస్త ధర ఎక్కువగా ఉంటోందని, లోకల్‌ ప్లైవుడ్‌లు తక్కువ ధరకు లభిస్తున్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. దాని తయారీలో ఉపయోగించే సామగ్రి, రసాయనాల ఆధారంగానే వాటి నాణ్యత ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


ఎంపికలో జాగ్రత్త

ప్లైవుడ్‌ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెదలు పట్టకుండా, వాటర్‌ ప్రూఫింగ్‌ కల్గిన ప్లైవుడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటివి ధర కాస్త ఎక్కువగా ఉన్నా నాణ్యత, ప్రమాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

  • లోకల్‌ బ్రాండెడ్‌ ప్లైవుడ్‌ విక్రేతలు గ్యారెంటీ, వారెంటీ అని చెబుతూ కొనుగోలుదారుల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ః వడ్రంగి చెప్పిందే వేదం అన్నట్లు నమ్మి వారు చెప్పిన బ్రాండు ప్లైవుడ్‌లు తీసుకోవడం, వారు చెప్పిన దుకాణంలోనే తీసుకోవడం అనేది ఎక్కువ శాతం మంది పాటిస్తున్నారు. ఎక్కడ కొన్నా నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకోండి.
  • గ్యారెంటీ ఇస్తామని ముందుగా చెబుతున్నా.. వాస్తవానికి కొన్ని నెలల తర్వాత ఒకవేళ అందులో ఏదైనా లోపం వస్తే సదరు వ్యాపారులు తమదేమీ తప్పులేదంటూ తప్పించుకోవడం తరచుగా వినిపిస్తున్న ఆరోపణలు. కాబట్టి కొనుగోలు సమయంలోనే వీటి గురించి కచ్చితంగా అడిగి ధ్రువీకరించుకోవాలి.
  • కొనేటప్పుడు తెలిసిన వారిని సంప్రదించి నాణ్యమైన ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఏళ్ల తరబడి పాడుకాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
  • బాయిలింగ్‌ వాటర్‌ ప్రూఫ్‌ ప్లైవుడ్‌ (బీడబ్ల్యుపీ) తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం మన్నికతో నిలకడగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • పెరిగిన డిమాండ్‌తో వందల సంఖ్యలో కొత్తగా పుట్టుకొచ్చిన ఇక్కడి దుకాణాల్లో ఏ బ్రాండ్‌ ప్లైవుడ్‌ లభిస్తుందో తెలుసుకోవాలి. లోకల్‌ తయారీపై బ్రాండెడ్‌ ముద్రలు వేసి విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు సైతం లేకపోలేరు. దీంతో అసలైన బ్రాండ్‌ కల్గిన ప్లైవుడ్‌ను తెలిసిన వారి వద్దనే కొనుగోలు చేయడం మేలు అని వారు సూచిస్తున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు