ఎండిన బోరుకు ప్రాణం పోయండిలా

సమస్త ప్రాణకోటికి నీరే జీవాధారం. అలాంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా నగరాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోవడంతో...

Published : 04 May 2024 01:19 IST

ఇంజక్షన్‌ వెల్‌ నిర్మాణంతో బోరు పునరుద్ధరణ
వేసవిలోనూ ఇంకిపోకుండా ఉపయోగం
అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో అత్యవసరం

ఈనాడు, హైదరాబాద్‌: సమస్త ప్రాణకోటికి నీరే జీవాధారం. అలాంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా నగరాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోవడంతో... కురిసిన వర్షం రోడ్ల పాలవుతోంది. ఇందుకు హైదరాబాద్‌ మినహాయింపు కాదు. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) 7200 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఒక అంచనా ప్రకారం ఏటా ఈ పరిధిలో కురిసే వాన 15 టీఎంసీలకు సమానం. అయితే ఇందులో 5శాతం కూడా భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. వాన నీటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే నగరంలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. జలమండలి అంచనా ప్రకారం ఇప్పటికే 35 వేల బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. మరో 30-40 వేల బోర్లలో అరకొర నీటి సరఫరా జరుగుతోంది. మే నెలలో ఇంకాకొన్ని బోర్లపై ఈ ప్రభావం పడనుంది. కొన్ని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో వానలు పడినా సరే... బోర్లు రీఛార్జి కావట్లేదు. అక్కడ వాన నీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు లేకపోవడమే ప్రధాన కారణం. దీంతో ఆ బోర్లుపై ఆధారపడటం మానేసి.. మరోచోట లక్షలు ఖర్చు పెట్టి కొత్తవి వేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల కోసం పెద్దపెద్ద కమ్యూనిటీల్లో వేలకు వేలు వెచ్చిస్తున్నారు. ప్రతి వేసవిలో నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ నీటి సమస్యకు పరిష్కారంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ఆవరణలో ఒక్క ఇంకుడు గుంత నిర్మించినా సరే... ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు 100 చదరపు మీటర్ల పైకప్పు ఉన్న ఆవరణలో.. సాధారణ వర్షపాతం రోజుకు దాదాపు 2 వేల లీటర్ల వాన నీటిని సంరక్షించే అవకాశం ఉంది. ఈ లెక్కన 50-100 ప్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్ల సముదాయంలో భారీ ఎత్తున వాన నీటిని ఆదా చేసే అవకాశం ఉంది. దీనివల్ల వేసవిలో నీటి కష్టాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు కాకుండా.... ఇప్పటికే ఎండిపోయిన బోర్లను ఇంజక్షన్‌ వెల్స్‌ ద్వారా పూర్తిగా పునరుద్ధరించవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద అపార్ట్‌మెంట్ల సముదాయాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఎండిపోయిన బోర్లకు వీటి ద్వారా తిరిగి ప్రాణం పోయవచ్చని పేర్కొంటున్నారు. ఫలితంగా ట్యాంకర్ల కోసం వెచ్చించే ఎంతో ధనాన్ని ఆదా చేయడమే కాకుండా... పుడమి తల్లిని వాన నీటితో అభిషేకించే గొప్ప అవకాశం మీ సొంతమవుతుంది.

ఇంజక్షన్‌ వెల్‌ నిర్మాణం ఎలా....

  • పనిచేస్తున్న లేదా అడుగంటిన బోరు బావికి కొంతదూరంలో దానికి సమాంతరంగా 60 మీటర్ల లోతులో కొత్త ఒక బోరు వేయడం లేదంటే ఇప్పటికే అక్కడ ఎండిన మరో బోరు ఉంటే ఎంపిక చేసుకోవాలి.
  • ఆ బోరు కూలి పోకుండా అందులో 6 నుంచి 10 మీటర్ల లోతు వరకు పీఐసీ పైపును లోపలికి చొప్పించాలి. అనంతరం ఈ బోరుకు చుట్టూ సమాన పరిమాణంలో పొడవు, వెడల్పుతో రెండు మీటర్ల లోతు వరకు గుంతను తవ్వాలి. తర్వాత ఈ పైపునకు చుట్టూ 10 మి.మీ. నుంచి 20 మి.మీ. పరిమాణం గల చిన్నచిన్న రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాల చుట్టూ ఒక స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ జాలీని చుట్టాలి.
  • ఆ గుంతలో సగభాగం వరకు 40 మి.మీ. పరిమాణం ఉన్న కంకరతో... మిగిలిన భాగంలో పావు వంతు వరకు 20 మి.మీ. పరిమాణం ఉన్న కంకరతో నింపాలి. తర్వాత దానిలో సగభాగం వరకు దొడ్డు నింపి మిగిలిన సగభాగాన్ని ఖాళీగా వదిలేయాలి. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు లేదా ఇంటి పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటి గొట్టాన్ని   ఈ ఇంకుడు గుంతలోకి పంపాలి. ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్ల ఆవరణ బట్టి ఆ మేరకు విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. వర్షపు నీరంతా భూమిలోకి  ఇంకి పక్కనే ఉన్న బోర్లు  రీఛార్జి అవుతాయి.
  • ఈ ఇంజక్షన్‌ వెల్‌ లోతైన బీటలు వారిన బోరు బావులను సైతం తిరిగి పనిచేసేలా చేస్తుంది. ఒక శాస్త్రీయ పద్ధతిలో సాధారణం కంటే 5 నుంచి 10 రెట్లు భూమిలోకి వర్షపు నీరు ఇంకేలా ఈ బోరు బావి ఇంకుడు గుంత సహాయ పడుతుంది. ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్లే కాదు... చుట్టుపక్కల భూగర్భ జలాలను పెంచుతుంది. వృథాగా రోడ్లపై పారే వరదను తగ్గిస్తుంది. తద్వారా రహదారులు పాడుకావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని