అయ్యారె రొయ్యలిల్ల..

మాంసం, చికెన్‌ల కంటే.. చేపలు, రొయ్యలు, పీతలు లాంటి సీ ఫుడ్‌ ఆరోగ్యానికి మంచిదంటారు. ఇవి రుచిలోనూ భేషే. బాగుచేయడం కొంచెం కష్టమైనా.. వండేశాక వహ్వా అనిపిస్తాయి.

Updated : 29 Oct 2023 05:35 IST

మాంసం, చికెన్‌ల కంటే.. చేపలు, రొయ్యలు, పీతలు లాంటి సీ ఫుడ్‌ ఆరోగ్యానికి మంచిదంటారు. ఇవి రుచిలోనూ భేషే. బాగుచేయడం కొంచెం కష్టమైనా.. వండేశాక వహ్వా అనిపిస్తాయి. ఇప్పటిదాకా రొయ్యలతో బిర్యానీ, చింత చిగురు, గోంగూర లాంటి కాంబినేషన్లు ప్రయత్నించి ఉంటారు కదా! ఇప్పుడీ వెరైటీలు చేసి కితాబులందుకోండి..


తమిళనాడు రొయ్యలన్నం

కావలసినవి: బాగుచేసిన మీడియం సైజు రొయ్యలు - కప్పు, అన్నం - 2 కప్పులు, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, మెంతులు, కారం - ఒక టీస్పూన్‌ చొప్పున, పసుపు, ఇంగువ - అర చెంచా చొప్పున, లవంగాలు - 4, దాల్చినచెక్క - అరంగుళం ముక్క, యాలకులు - 2, బిర్యానీ ఆకు - 1, కరివేపాకు - 4 రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లి, టొమాటో ముక్కలు - కప్పు చొప్పున, తరిగిన వెల్లుల్లి, సోంపు పొడి, మిరియాల పొడి - 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున, గుడ్డు - 1, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత

తయారీ: కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, మెంతులు, పసుపు, ఇంగువ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, కరివేపాకులు వేయాలి. ఆవాలు చిటపటలాడాక.. ఉల్లి తరుగును దోరగా వేయించాలి. తర్వాత టొమాటో, వెల్లుల్లి వేసి కలియ తిప్పాలి. హై ఫ్లేమ్‌ మీద నీరు ఆవిరయ్యే వరకూ వేయించి, కారం, ఉప్పు, రొయ్యలు జోడించాలి. నిమిషం తర్వాత.. గుడ్డు సొన, ఇంకో నిమిషం తర్వాత అన్నం, సోంపు పొడి, మిరియాల పొడి వేసి, మూతపెట్టి.. రెండు నిమిషాలు ఉడికించాలి. చివర్లో కొంత కొత్తిమీర వేసి మరోసారి కలిపి దించేయాలి. మిగిలిన కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.


మాల్వానీ రొయ్యల కూర

కావలసినవి: బాగుచేసిన మీడియం సైజు రొయ్యలు - 1 కప్పు, ఉప్పు - తగినంత, పసుపు - 1 టీస్పూన్‌, కొబ్బరి నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, మాల్వానీ మసాలా, బియ్యం, ధనియాలు - చెంచా చొప్పున, ఎండు మిరపకాయలు - 3, చిన్న ఉల్లిపాయ - 1, తురిమిన తాజా కొబ్బరి - అర కప్పు, వెల్లుల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూన్‌, కొబ్బరి పాలు - కప్పు, కోకుమ్‌ రేకులు - 4

తయారీ: రొయ్యలకు పసుపు, ఉప్పు పట్టించి, పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. ధనియాలు, తుంచిన ఎండు మిరపకాయలను మంచి సువాసన వచ్చేవరకూ వేయించాలి. అందులో సగం ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగులోకి మారేదాకా వేయించి, కొబ్బరి తురుము వేసి కలియ తిప్పి.. అర నిమిషం వేయించాలి. స్టవ్వు కట్టేసి.. బియ్యం జోడించాలి. వేయించిన మసాలా, కొబ్బరి మిశ్రమాన్ని కొన్ని నీళ్లతో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. కడాయిలో మిగిలిన నూనె వేసి.. వెల్లుల్లి, ఉల్లిపాయ వేగాక.. సిద్ధం చేసుకున్న మిశ్రమం, మ్యారినేట్‌ చేసిన రొయ్యలు, మాల్వానీ మసాలా వేసి, ఓ కప్పు నీళ్లు పోసి సెగ తగ్గించాలి. చిక్కబడ్డాక.. కొబ్బరి పాలు, కోకుమ్‌ రేకులు వేసి, రెండు నిమిషాలుంచి దించేయాలి.


ప్రాన్స్‌ ఖడ్‌ఖడే

కావలసినవి: తల, తోక చెదరకుండా బాగుచేసిన పెద్ద రొయ్యలు - 12, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - 1 టీస్పూన్‌, కారం, మసాలా పొడి - చెంచా చొప్పున, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి - రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ: రొయ్యలను ఉప్పు, పసుపు, కారం, మసాలాలు వేసి పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేడయ్యాక వెల్లుల్లిని గోధుమరంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో మ్యారినేట్‌ చేసిన రొయ్యలు వేసి, అరకప్పు నీళ్లు పోసి కలియ తిప్పాలి. మూత పెట్టి తక్కువ సెగ మీద ఉడికించాలి. మూడు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది. చాలా సులువు కదూ!


గార్లిక్‌ మస్టర్డ్‌ ప్రాన్స్‌

కావలసినవి: పెద్ద రొయ్యలు - 12, ఆవాలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - 1 టీస్పూన్‌, వెన్న - 3 టేబుల్‌ స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 3, టొమాటో కెచప్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, తరిగిన ఉల్లికాడలు - 3 టేబుల్‌ స్పూన్లు, తాజా క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - చారెడు, నూనె - కొద్దిగా

తయారీ : రొయ్యలకు ఆవాలు, ఉప్పు, మిరియాల పొడి దట్టించి, 5 నిమిషాలు పక్కన పెట్టండి. కడాయిలో వెన్న, నూనె, వెల్లుల్లి, ఉల్లికాడల తరుగు వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించి.. రొయ్యలు వేసి ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత టొమాటో కెచప్‌ వేసి మూత పెట్టి ఉడికించాలి. నిమిషం తర్వాత క్రీమ్‌ వేసి, కలియ తిప్పాలి. రెండు నిమిషాలుంచి, కొత్తిమీర తరుగు వేసి  దించేయండి. అంతే.. గార్లిక్‌ మస్టర్డ్‌ ప్రాన్స్‌ రెడీ!


ఆలూ రొయ్యల సూఖా

కావలసినవి: మీడియం సైజు రొయ్యలు - 2 కప్పులు, బంగాళదుంప - 1, ఉప్పు - తగినంత, కొబ్బరినూనె - కాస్త, వంటనూనె - 1 టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు - 2, కారం, సాంబార్‌ పొడి - 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున, పసుపు - టీస్పూన్‌, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, కోకుమ్‌ రేకులు - 6

తయారీ: రొయ్యలను కారం, ఉప్పు, పసుపు దట్టించి పక్కన పెట్టాలి. కడాయిలో ఉల్లితరుగు వేగాక.. ఉడికించి, పొట్టు తీసిన బంగాళదుంప ముక్కలు వేసి, కొన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత రొయ్యలు వేసి కలియ తిప్పాలి. ఇంకొన్ని నీళ్లు పోసి మూత పెట్టి, చిక్కగా అయ్యాక.. కోకుమ్‌ రేకులు, కొంత కొత్తిమీర తరుగు, కాస్త కొబ్బరి తురుము జోడించి, ఐదు నిమిషాలుంచి దించేయండి. పైన కొబ్బరి నూనె చిలకరించి, మిగిలిన కొబ్బరి, కొత్తిమీరలతో అలంకరించండి. ఘుమఘుమలాడే ఆలూ రొయ్యల సూఖాను ఆస్వాదించండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని