ఫుడ్డు ప్రియులకు గుడ్డు

ఇంట్లో కూరగాయలు నిండుకుంటే మనకి గబుక్కున గుర్తొస్తుంది గుడ్డు. తొందరగా పని తెమలాలంటే గుడ్డు పొరటో, ఆమ్లెట్టో చేసేస్తాం. దోశ పిండి సిద్ధంగా లేదంటే హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్‌తోనో, బాంబే టోస్ట్‌తోనో ముగించేస్తాం.

Updated : 08 Oct 2023 06:37 IST

ఇంట్లో కూరగాయలు నిండుకుంటే మనకి గబుక్కున గుర్తొస్తుంది గుడ్డు. తొందరగా పని తెమలాలంటే గుడ్డు పొరటో, ఆమ్లెట్టో చేసేస్తాం. దోశ పిండి సిద్ధంగా లేదంటే హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్‌తోనో, బాంబే టోస్ట్‌తోనో ముగించేస్తాం. గుడ్డుతో వంటలూ సులువే, పోషకాలూ ఎక్కువే! అక్టోబరు 13న ఎగ్‌ డే సందర్భంగా ఇలాంటివి ప్రయత్నించండి!


జమ్మీ ఎగ్‌ అవకాడో టోస్ట్‌

కావలసినవి: గోధుమ బ్రెడ్‌ - 8 స్లైసులు, గుడ్లు - 4, అవకాడో, టొమాటోలు - 2 చొప్పున, చిల్లీ ఫ్లేక్స్‌, జీలకర్ర పొడి - అర చెంచా చొప్పున, మిరియాల పొడి - చెంచా, నెయ్యి - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర తరుగు - అర కప్పు

తయారీ: ముందుగా కోడిగుడ్లను ఉడికించి, పెంకు తీసి, పొడుగ్గా కట్‌ చేసి ఉంచుకోవాలి. బ్రెడ్డు   స్లైసులను నేతిలో వేయించాలి. అవకాడో చెక్కు తీసి పొడుగ్గా ముక్కలు కోయాలి. బ్రెడ్డు మీద అవకాడో, టొమాటో, కోడిగుడ్డు ముక్కలను పేర్చి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి, జీలకర్ర పొడి చల్లి, మరో బ్రెడ్డుతో కప్పి.. టోస్ట్‌ చేస్తే సరిపోతుంది. అవకాడో ముక్కలకు బదులు వాటిని గ్రైండ్‌ చేసి పేస్ట్‌ రూపంలో కూడా వేయొచ్చు. పైన గుండ్రంగా కోసిన ఉల్లి, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేస్తే.. మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.


స్టఫ్డ్‌ ఎగ్‌ బాల్స్‌

కావలసినవి: గుడ్లు - 4, శనగపిండి - కప్పు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి - చెంచా చొప్పున, ఉప్పు - కొద్దిగా, కారం - 2 చెంచాలు, పసుపు - పావు చెంచా, మిర్చి - 3, వెల్లుల్లి రెబ్బలు - 4, అల్లం - అంగుళం ముక్క, బంగాళదుంపలు - 2, ఉల్లిపాయ - 1, బ్రెడ్‌ పొడి - అర కప్పు, నూనె - తగినంత

తయారీ: గుడ్లను ఉడికించి పక్కనుంచుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి, మెత్తగా మెదపాలి. ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం, మిర్చి, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, మెదిపిన బంగాళదుంపలు, బ్రెడ్‌ పొడి వేసి బాగా కలపాలి. గుడ్డును సగానికి కోసి, ఈ మిశ్రమంలో ముంచి బాల్‌లా చేసి నూనెలో వేయించాలి. అంతే.. రుచికరమైన ‘స్టఫ్‌డ్‌ ఎగ్‌ బాల్స్‌’ సిద్ధం.


డచ్‌ బేబీ

కావలసినవి: గుడ్లు - 3, పాలు, శనగపిండి, తురిమిన చీజ్‌ - అర కప్పు చొప్పున, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - చెంచా, జాజికాయ, దాల్చినచెక్క పొడి- అర చెంచా, వెన్న - 2 చెంచాలు, పంచదార - చెంచా, బ్లాక్‌ బెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌ - పది చొప్పున, చాక్లెట్‌ సిరప్‌ - చెంచా, ఎండు కొబ్బరి పొడి - చారెడు

తయారీ: ఒక పాత్రలో గుడ్డు సొన, పాలు, శనగపిండి, ఉప్పు, ఉల్లి ముక్కలు, మిరియాల పొడి, చీజ్‌ వేసి బ్లెండర్‌ లేదా ఫుడ్‌ ప్రాసెసర్‌తో బాగా కలపాలి. అడుగు భాగం మందంగా ఉన్న స్కిల్లెట్‌ను అవెన్‌లో ప్రీ హీట్‌ చేసి బయటకు తీయాలి. దాని మీద వెన్న వేసి అది కరగ్గానే.. కలిపిన మిశ్రమాన్ని సమంగా సర్ది పావు గంట బేక్‌ చేయాలి. చక్కగా ఉబ్బి, బంగారు రంగులోకి మారిన డచ్‌ బేబీని బయటకు తీసి.. ఎండు కొబ్బరి పొడి, బ్లాక్‌ బెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌, చాక్లెట్‌ సిరప్‌లతో అలంకరించి.. పంచదార, జాజికాయ, దాల్చినచెక్కల పొడి జల్లితే సరిపోతుంది.


క్లాసిక్‌ ఆమ్లెట్‌ అండ్‌ గ్రీన్స్‌

కావలసినవి: గుడ్లు - 4, బచ్చలికూర తరుగు - కప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి కాడలు - 2, చీజ్‌ - 100 గ్రా, నిమ్మరసం - చెంచా, ఆలివ్‌ నూనె - 3 చెంచాలు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - చెంచా, వెన్న - 2 చెంచాలు

తయారీ: వెల్లుల్లి కాడలను కడిగి సన్నగా తరిగి ఉంచాలి. గుడ్లు పగలకొట్టి.. అందులో ఉప్పు, మిరియాల పొడి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, బచ్చలికూర తరుగు, నిమ్మరసం వేసి బీట్‌ చేయాలి. నాన్‌ స్టిక్‌ ప్యాన్‌లో నూనె వేడయ్యాక.. గుడ్డు మిశ్రమం వేసి సమంగా పరచుకునేట్లు సర్దాలి. మూత పెట్టి నాలుగు నిమిషాలు వదిలేయాలి. మూత తీసి.. చీజ్‌ తురుము, వెన్న, మిరియాల పొడి వేసి సన్న సెగ మీద ఒక నిమిషం ఉంచి దించేస్తే సరిపోతుంది. రొటీన్‌కు భిన్నమైన ‘క్లాసిక్‌ ఆమ్లెట్‌ అండ్‌ గ్రీన్స్‌’ వహ్వా అనిపిస్తుంది.


బెల్‌ పెప్పర్‌ ఎగ్స్‌

కావలసినవి: ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ బెల్‌ పెప్పర్స్‌ - ఒక్కోటీ రెండు చొప్పున, మిరియాల పొడి - టేబుల్‌ స్పూన్‌, చీజ్‌ - 100 గ్రా, ఉప్పు - తగినంత, ఉల్లి కాడల తరుగు - అర కప్పు, గుడ్లు - 6, చిల్లీ ఫ్లేక్స్‌ - చెంచా, సన్న కారప్పూస - రెండు చెంచాలు

తయారీ: బెల్‌ పెప్పర్స్‌ను సగానికి కోసి, తొడిమలు, గింజలు తీసేయాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చిలకరించినట్లు వేసి అవెన్‌లో బేక్‌ చేయాలి. బయటకు తీసి తురిమిన చీజ్‌, ఉల్లి కాడల తరుగు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్‌, కాస్త మిరియాల పొడి, ఉప్పు, గుడ్డు సొన వేసి.. మరోసారి బేక్‌ చేయాలి. తినేటప్పుడు ఇంకాస్త మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్‌, సన్న కారప్పూస వేస్తే అమోఘంగా ఉంటాయి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని