ఎండల్లో హాయ్‌హాయ్‌..

ఈ ఎండల్లో కాస్తంత సరదాగా గడిపి.. సేద తీరాలనిపిస్తోందా! అయితే ఇష్టమైన వారితో కాలక్షేపం చేయాల్సిందే! నచ్చిన నేస్తాలనో, ఆత్మీయులనో ఇంటికి పిలిచి.. వహ్వా అనిపించే ఈ వంటలు వడ్డించండి. ఎంచక్కా కబుర్లూ, కులాసాలతో ఆనందాలను ఖాతాలో వేసుకోండి!

Updated : 28 Apr 2024 01:21 IST

ఈ ఎండల్లో కాస్తంత సరదాగా గడిపి.. సేద తీరాలనిపిస్తోందా! అయితే ఇష్టమైన వారితో కాలక్షేపం చేయాల్సిందే! నచ్చిన నేస్తాలనో, ఆత్మీయులనో ఇంటికి పిలిచి.. వహ్వా అనిపించే ఈ వంటలు వడ్డించండి. ఎంచక్కా కబుర్లూ, కులాసాలతో ఆనందాలను ఖాతాలో వేసుకోండి!


కదంబ పచ్చడి

కావలసినవి: టొమాటోలు - 5, వంకాయలు - 4, బీరకాయ - సగం, సొరకాయ - చిన్న ముక్క, ఉల్లిపాయ - 1, పచ్చిమిరపకాయలు - 15, జీలకర్ర - చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర చెంచా, చింతపండు - నిమ్మకాయంత, నువ్వులు - అర కప్పు, నూనె - 4 చెంచాలు, కరివేపాకు - 3 రెబ్బలు, మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర - అన్నీ కలిపి 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఇంగువ - చిటికెడు

తయారీ: నువ్వులు వేయించి పక్కనుంచాలి. చింతపండును కడిగి, నానబెట్టాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయతో సహా కూరగాయలన్నీ ముక్కలు కోసుకోవాలి. వంకాయ ముక్కలు ఉప్పు నీళ్లలో వేయాలి. కడాయిలో 2 స్పూన్ల నూనె, కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి సన్న సెగ మీద మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత దించేయాలి. చల్లారిన ముక్కలకు చింతపండు, నువ్వులు, జీలకర్ర చేర్చి నూరాలి. మిగిలిన నూనెతో తాలింపు వేసి, కొత్తిమీర తరుగు కలిపితే సరి.. నోరూరించే ‘కదంబ పచ్చడి’ సిద్ధం.


జర్దా పులావ్‌

కావలసినవి: బాస్మతి బియ్యం - 2 కప్పులు, నెయ్యి - అర కప్పు, యాలకుల పొడి - చెంచా, పంచదార - కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌, ఎండుకొబ్బరి ముక్కలు - అన్నీ కలిపి కప్పు, లవంగాలు - 10, కుంకుమ పువ్వు - కొద్దిగా

తయారీ: బియ్యం కడిగి, అర గంట నానబెట్టి.. ఆ నీళ్లు వడకట్టేసి పక్కనుంచాలి. కుక్కర్‌లో 4 కప్పుల నీళ్లు, కుంకుమ పువ్వు, కడిగి ఉంచిన బియ్యం, లవంగాలు వేయాలి. మీడియం ఫ్లేమ్‌ మీద ఉడికించి, రెండు విజిల్స్‌ వచ్చాక దించేయాలి.

కడాయిలో నెయ్యి వేడయ్యాక వండిన బాస్మతి అన్నం, పంచదార, యాలకులపొడి వేసి సన్న సెగ మీద ఉంచాలి. పంచదార కరగడం కనిపిస్తుంది. మధ్యమధ్యలో కలియ తిప్పుతూ, తడి ఇంకిపోయాక.. ఎండుకొబ్బరి ముక్కలు, కిస్‌మిస్‌, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసి దించేయాలి. తియ్యతియ్యటి ‘జర్దా పులావ్‌’  తిని ఆనందించడమే తరువాయి. అన్నట్టు దీన్ని ‘మీఠే చావల్‌’ అని కూడా అంటారు.


టొమాటో మొక్కజొన్న సూప్‌

కావలసినవి: స్వీట్‌ కార్న్‌ - కప్పు, టొమాటోలు - అర కిలో, వెన్న - 6 చెంచాలు, ఉల్లి తరుగు - కప్పు, తురిమిన క్యారెట్‌ - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి, పంచదార - చెంచా చొప్పున, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి - చెంచా, ఉల్లి కాడల తరుగు - చారెడు, కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ: టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో వెన్న వేడయ్యాక.. కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి, ఉల్లి తరుగు, క్యారెట్‌ తురుములను వేయించాలి. రెండు నిమిషాలయ్యాక.. టొమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార, ఉల్లి కాడల తరుగు వేసి కలియ తిప్పాలి. సన్న సెగ మీద అరగంట ఉడికించి, దించేయాలి. పప్పుగుత్తితో మెదిపి.. రసంలో కలవకుండా.. పిప్పి మిగిలి ఉంటే తీసేయాలి. తర్వాత స్వీట్‌కార్న్‌ వేసి ఇంకో నాలుగు నిమిషాలు ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర తరుగు వేస్తే సరి.. రుచికరమైన ‘టొమాటో మొక్కజొన్న సూప్‌’ సిద్ధం.


ఇన్‌స్టంట్‌ పాట్‌ బట్టర్‌ చికెన్‌

కావలసినవి: ఎముకల్లేని చికెన్‌ - కిలో, ఉల్లి తరుగు - అర కప్పు, టొమాటో గుజ్జు - కప్పున్నర, హెవీ క్రీమ్‌ - 200 గ్రాములు, నూనె, వెన్న - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, సన్నగా తరిగిన అల్లం, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి - 2 చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర పొడి, కారం - చెంచా చొప్పున, పసుపు - అర చెంచా, గరం మసాలా, పంచదార పొడి, మిరియాల పొడి - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ: చికెన్‌ను రెండున్నర అంగుళాల ముక్కలుగా కోసుకోవాలి. ఇన్‌స్టంట్‌ పాట్‌లో నెయ్యి, నూనె వేడయ్యాక.. అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగులను గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. టొమాటో గుజ్జు జతచేసి.. కలియ తిప్పుతూ మూడు నిమిషాలు వేయించాలి. అందులో చికెన్‌ ముక్కలు, అర కప్పు నీళ్లు, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, పంచదార పొడి, మిరియాల పొడి వేసి మూత పెట్టేయాలి. సెగ తగ్గించి, ఆవిరి మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత.. హెవీ క్రీమ్‌, కొత్తిమీర తరుగు వేసి.. ఒక నిమిషం ఉంచి, దించేస్తే సరిపోతుంది.


లెమన్‌ చీజ్‌ కేక్‌

కావలసినవి: డైజెస్టివ్‌ బిస్కెట్లు - 30, కరిగించిన వెన్న - కప్పు, నిమ్మరసం, నెయ్యి - చెంచా చొప్పున, జెలెటిన్‌ - టేబుల్‌ స్పూన్‌, క్రీమ్‌ చీజ్‌, కండెన్స్‌ మిల్క్‌ - కప్పు చొప్పున, నిమ్మపొట్టు (లైమ్‌ జెస్ట్‌) - అర చెంచా

తయారీ: ముందుగా బిస్కెట్లను మెత్తగా దంచాలి. అందులో కరిగిన వెన్న కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. ఒక బౌల్‌లో కేక్‌ బేస్‌బోర్డ్‌ ఉంచి.. దానిమీద బిస్కెట్‌ మిశ్రమాన్ని సమంగా సర్ది, ఓ అర గంట ఫ్రిజ్‌లో ఉంచాలి. జెలెటిన్‌లో రెండు చెంచాల నీళ్లు పోసి కలిపి, అర నిమిషం అవెన్‌లో వేడి చేయాలి. అవెన్‌ లేదంటే నీళ్లగిన్నెలో ఉంచి వేడి చేయొచ్చు. నిమ్మపొట్టులో క్రీమ్‌ చీజ్‌, కండెన్స్‌ మిల్క్‌ వేసి బీట్‌ చేయాలి. అందులో జెలెటిన్‌, నిమ్మరసం వేసి మరోసారి బీట్‌ చేయాలి. ఫ్రిజ్‌లో ఉంచిన బిస్కెట్‌ మిశ్రమాన్ని బయటకు తీసి.. తయారుచేసుకున్న ఫిల్లింగ్‌ పోసి.. నాలుగైదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. బేక్‌ చేయనవసరం లేని టేస్టీ టేస్టీ లెమన్‌ చీజ్‌ కేక్‌ రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని