Chicken Curry Recipes: అందరికీ నచ్చే అచారీ చికెన్‌

హిందీలో ఊరగాయ పచ్చడిని ‘అచార్‌’ అంటారు. అదే ‘అచారీ’ అయ్యింది. మసాలా దినుసులతో ఘాటుగా ఉండే వంటకాలను కూడా అలా పిలుస్తున్నారు. ఆదివారం నాన్‌వెజ్‌ ప్రియులు చికెన్‌ కర్రీ ఇష్టపడతారు కదా! ఎప్పుడూ వండే విధంగా కాకుండా..

Updated : 04 Feb 2024 04:18 IST

హిందీలో ఊరగాయ పచ్చడిని ‘అచార్‌’ అంటారు. అదే ‘అచారీ’ అయ్యింది. మసాలా దినుసులతో ఘాటుగా ఉండే వంటకాలను కూడా అలా పిలుస్తున్నారు. ఆదివారం నాన్‌వెజ్‌ ప్రియులు చికెన్‌ కర్రీ ఇష్టపడతారు కదా! ఎప్పుడూ వండే విధంగా కాకుండా.. ఈసారి అచారీ, కొల్హాపురి, పంజాబ్‌ లెమన్‌ లాంటి రకాలు ప్రయత్నించండి!


కొల్హాపురి చికెన్‌

కావలసినవి: చికెన్‌ - అర కిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - 2 చెంచాలు, ఉల్లి తరుగు - కప్పు, టొమాటో ముక్కలు - అర కప్పు, ఉప్పు, నూనె- తగినంత, కారం - చెంచా, పసుపు - అర చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు

మసాలా కోసం: ధనియాలు - చెంచా, మిరియాలు - పావు చెంచా, లవంగాలు - 4, యాలకులు - 2, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, జాజికాయ - చిన్న ముక్క, జాపత్రి - కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము - కొద్దిగా, జీలకర్ర - అర చెంచా, ఆవాలు - 2 చెంచాలు, ఎండు  మిర్చి - 4

తయారీ: మసాలా కోసం తీసుకున్న దినుసులను వేయించాలి. కడాయిలో చెంచా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేయించి, మసాలా దినుసులు జతచేసి గ్రైండ్‌ చేయాలి. ఒక పాత్రలో చికెన్‌ తీసుకుని.. అందులో మసాలా పేస్టు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి ఓ అరగంట నాననివ్వాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త మగ్గిన తర్వాత.. మ్యారినేట్‌ చేసిన చికెన్‌ వేసి బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లి దించేస్తే కొల్హాపురి చికెన్‌ కర్రీ తయారైపోతుంది. చాలా సులువు కదూ!


అచారీ చికెన్‌

కావలసినవి: చికెన్‌ - అర కిలో, ఉల్లి తరుగు - కప్పు, టొమాటో ముక్కలు - ముప్పావు కప్పు, ఆవనూనె - రెండు చెంచాలు, ఇంగువ - చిటికెడు, పసుపు - అర చెంచా, కారం - చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, పంచదార - ఒకటిన్నర చెంచా, పెరుగు - అరకప్పు, అల్లం వెల్లులి పేస్టు - చెంచా, కొత్తిమీర తరుగు - పావు కప్పు

మసాల కోసం: ఎండు మిర్చి - నాలుగు, ధనియాలు - 2 చెంచాలు, ఆవాలు - పావు చెంచా, జీలకర్ర - 2 చెంచాలు, మెంతులు - చెంచా, సోంపు - ఒకటిన్నర చెంచా

తయారీ: మసాలా దినుసులన్నింటినీ దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఉల్లితరుగు, అల్లం వెల్లులి పేస్టు, ఇంగువ వేసి వేయించాలి. అవి వేగాక.. టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, మసాలా పొడి, కారం, పంచదార వేసి కలియ తిప్పాలి. కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్‌, బాగా గిలకొట్టిన పెరుగు వేసి సన్నటి సెగ మీద ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర తరుగు వేయాలి. అంతే.. ‘అచారీ చికెన్‌’ తయారై పోతుంది. ఇది అన్నం, రొట్టెలు ఎందులోకైనా బాగుంటుంది.


కేరళ చికెన్‌ కర్రీ

కావలసినవి: చికెన్‌ - అర కిలో, కారం, మిరియాల పొడి - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, పసుపు - అర చెంచా, నిమ్మరసం - పావు చెంచా, ధనియాలు - 2 చెంచాలు, ఎండుమిర్చి - నాలుగు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, ఉల్లి తరుగు - కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - తగినంత, కొబ్బరి పాలు - కప్పు

తయారీ: చికెన్‌లో నిమ్మరసం, కారం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసి కలిపి ఓ అరగంట పక్కనుంచాలి. మసాలా దినుసులను దోరగా వేయించి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. అవి వేగాక చికెన్‌ వేసి కలియ తిప్పి, మూతపెట్టాలి. ఆరేడు నిమిషాల  తర్వాత కొబ్బరి పాలు, మసాలా పేస్టు జతచేసి, పది నిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత దించేయాలి. మరో పాత్రలో ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు వేసి.. దాన్ని తెచ్చి చికెన్‌లో కలపాలి. అంతే  కేరళ స్ట్టైల్‌ చికెన్‌ కర్రీ రెడీ.


టాంగీ కడాయి చికెన్‌

కావలసినవి: పెద్ద ముక్కలుగా కట్‌ చేసిన చికెన్‌ - అర కిలో, కారం, ధనియాలు, సోంపు, మిరియాలు - చెంచా చొప్పున, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, ఉప్పు - తగినంత, నూనె - 3 చెంచాలు, పసుపు - అర చెంచా, చింతపండు గుజ్జు - రెండు చెంచాలు, నిమ్మరసం - అర చెంచా, బెల్లం - టేబుల్‌ స్పూన్‌, ఉల్లి తరుగు - కప్పు, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, ధనియాలను దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్‌లో కారం, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, నిమ్మరసం, బెల్లం వేసి కలిపి.. అరగంట పక్కన పెట్టాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అందులో నానబెట్టిన చికెన్‌ వేయాలి. కొంచెం మగ్గనిచ్చి.. కప్పు నీళ్లు, మసాలా పొడి వేసి ఉడికించాలి. చిక్కబడిన తర్వాత దించేసి.. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే సరి.. నోరూరించే ‘టాంగీ కడాయి చికెన్‌’ సిద్ధం.


పంజాబ్‌ లెమన్‌ చికెన్‌

కావలసినవి: చికెన్‌ - అర కిలో, నూనె - 3 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు, ఉల్లి తరుగు - కప్పున్నర, సన్నగా తరిగిన వెల్లుల్లి - 2 చెంచాలు, అల్లం తరుగు - చెంచా, పసుపు - అర చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, ధనియాల పొడి - చెంచా, నిమ్మరసం - 2 చెంచాలు, బెల్లం పొడి - టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: కడాయిలో నూనె కాగనిచ్చి.. జీలకర్ర, ఉల్లి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేగనిచ్చి.. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కొన్ని క్షణాలు వేయించాలి. అందులో చికెన్‌ వేసి.. ఆ మసాలా అంతా దానికి పట్టేలా కలియ తిప్పాలి. కొంచెం ఉడికిన తర్వాత నిమ్మరసం.. ఈ పులుపుని బ్యాలెన్స్‌ చేయడానికి బెల్లం పొడి వేసి తిప్పాలి. చికెన్‌ ముక్కలు మెత్తబడిన తర్వాత, దించేసి.. కొత్తిమీర చల్లితే సరిపోతుంది. ఘుమఘుమలాడే పంజాబ్‌ లెమన్‌ చికెన్‌ తిని ఆనందించండి.

హరి వినీత, విజయవాడ


తుమ్మ లాంటి చెట్లకు జిగురు వస్తుందని తెలుసు కదా! అది తినదగ్గదే. దానికి కాస్త బెల్లం జోడించి తినడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లనొప్పులు తగ్గుతాయి. చూపు మెరుగుపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని