కమ్మటి కేరళ చికెన్‌ ఫ్రై

మనవైన వంటలు ఎన్ని రకాలున్నా.. అప్పుడప్పుడూ వేరే ప్రాంతాల్లో ఏం తింటున్నారనే ఆసక్తి కలుగుతుంది. ఆయా వంటల రుచి ఎలా ఉంటుందో తెలుసు కోవాలనిపిస్తుంది. అలాంటి సరదా తీరాలంటే..

Published : 09 Jun 2024 00:36 IST

మనవైన వంటలు ఎన్ని రకాలున్నా.. అప్పుడప్పుడూ వేరే ప్రాంతాల్లో ఏం తింటున్నారనే ఆసక్తి కలుగుతుంది. ఆయా వంటల రుచి ఎలా ఉంటుందో తెలుసు కోవాలనిపిస్తుంది. అలాంటి సరదా తీరాలంటే.. ఈసారి ఈ కేరళ ప్రత్యేక వంటలు చేసి చూడండి!

కేరళ స్టైల్‌ చికెన్‌ ఫ్రై

కావలసినవి: చికెన్‌ - ముప్పావు కిలో, కశ్మీరీ మిర్చి - 15, కశ్మీరీ కారం - చెంచా, ధనియాలు - టేబుల్‌ స్పూన్, పసుపు, జీలకర్ర - అర చెంచా చొప్పున, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి తరుగు - 2 చెంచాలు, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మరసం - ముప్పావు చెంచా, కరివేపాకు - 3 రెబ్బలు, నూనె - వేయించేందుకు, ఆనియన్‌ రింగ్స్‌ - చారెడు, అరంగుళం సైజు నిమ్మకాయ ముక్కలు - 10
తయారీ: ముందు రోజు రాత్రి చికెన్‌ను శుభ్రంచేసి.. కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. కశ్మీరీ మిర్చి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి తరుగులను మెత్తగా నూరి, దీన్ని కూడా చికెన్‌కు పట్టించి, ఫ్రిజ్‌లో ఉంచాలి. మర్నాడు ఉదయం.. కడాయిలో నూనె కాగనిచ్చి.. మ్యారినేట్‌ చేసిన చికెన్‌ను వేయించి, చివర్లో కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఆనియన్‌ రింగ్స్, నిమ్మకాయ ముక్కలతో ఆస్వాదించడమే తరువాయి. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి అలరిస్తుందీ కేరళ స్టైల్‌ చికెన్‌ ఫ్రై.

మలబార్‌ పరోటా 

కావలసినవి: మైదాపిండి - అర కిలో, ఉప్పు - రుచికి సరిపడా, పంచదార - చెంచా, నూనె - తగినంత, పాలు - అర కప్పు
తయారీ: మైదాపిండిలో ఉప్పు, పంచదార, టేబుల్‌ స్పూన్‌ నూనె, పాలు, కప్పు నీళ్లు వేసి కలపాలి. అవసరమైతే ఇంకొద్దిగా నీళ్లు పోయొచ్చు. మళ్లీ మళ్లీ కలుపుతూ రొట్టెల రాయి మీద కొడుతూ మెత్తటి పిండి తయారుచేయాలి. దాని మీద మరో టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి మరోసారి కలిపి.. పక్కనుంచాలి. గంట తర్వాత పిండిలో ఇంకో టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి.. సాగదీస్తూ, దగ్గర చేస్తూ మళ్లీ కలపాలి. ఇందులోంచి పెద్ద నిమ్మకాయంత పిండి తీసుకుని పొడి మైదాపిండి జల్లి.. చిన్న రొట్టె చేయాలి. దాని మీద ఒక చెంచా నూనె వేసి.. మొత్తం పరిచి, ఒక చివరి నుంచి మొదలుపెట్టి జిగ్‌జాగ్‌గా మడుస్తూ రెండో చివరకు రావాలి. దాన్ని పొడుగ్గా సాగదీసి.. చుట్ట చుట్టి.. చేత్తో మెదుపుతూ చపాతీలా చేయాలి. పెనం వేడయ్యాక.. ఈ రొట్టెను చెంచా నూనెతో రెండు వైపులా వేయించాలి. పొరలు పొరలుగా ఉండే ఈ మలబార్‌ పరోటా రుచిని మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు.

పుట్టు కడాలా కర్రీ 

కావలసినవి: దేశవాళీ శనగలు - కప్పు, ఉల్లి తరుగు - ముప్పావు కప్పు, టొమాటో ముక్కలు - అర కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి, సోంపు, ఆవాలు, పసుపు - చెంచా చొప్పున, జీలకర్ర పొడి - అర చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, కొబ్బరి తురుము - కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు - 3 రెబ్బలు
పుట్టు కోసం: బియ్యప్పిండి - 2 కప్పులు, ఉప్పు - తగినంత, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఆ నీళ్లు తీసేసి.. 3 కప్పుల నీళ్లు, ఉప్పు, అర చెంచా పసుపు జోడించి కుక్కర్‌లో ఉడికించాలి. 5 విజిల్స్‌ వచ్చాక దించేయాలి. ఆవిరి పోయాక.. అర కప్పు శనగలను మిక్సీ జార్‌లో వేసి.. అర కప్పు నీళ్లు, అర చెంచా పసుపు, సోంపు, జీలకర్ర పొడి, కొబ్బరి తురుము, కారం, ధనియాల పొడి వేసి గ్రెండ్‌ చేయాలి. పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు.. అవి చిటపటలాడాక కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఉల్లి లేత గోధుమ రంగులోకి మారాక.. టొమాటో ముక్కలు; అవి కాస్త మగ్గిన తర్వాత.. మసాలా పేస్టు చేర్చాలి. మంచి వాసన వచ్చేదాకా వేగనిచ్చి.. నీళ్లతో సహా ఉడికించిన శనగలు, ఉప్పు వేసి.. సన్న సెగ మీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే కడాలా కర్రీ తయారైపోతుంది. 
పుట్టు ఇలా చేయాలి: బియ్యప్పిండిలో కొన్ని నీళ్లు, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేసి ఏమాత్రం పల్చగా లేకుండా గట్టిగా కలపాలి. దీన్ని పుట్టు మేకర్‌లో వేసి.. పావు గంటసేపు ఆవిరి మీద ఉడికించాలి. సెగ తీసేసి.. ఒక చేత్తో హ్యాండిల్‌ పట్టుకుని..రెండో చేత్తో పిడిని మెల్లగా ముందుకు తోస్తే.. ఉడికిన పుట్టు పళ్లెంలో పడుతుంది. ఇక కడాలా కర్రీతో ఆరగించడమే ఆలస్యం.

అరటి వడలు

కావలసినవి: పొడవాటి అరటిపండ్లు - నాలుగు, మైదాపిండి - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, బియ్యప్పిండి, పంచదార - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, పసుపు, యాలకుల పొడి - పావు చెంచా చొప్పున, నూనె - వేయించేందుకు సరిపడా 
తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, బియ్యప్పిండి, ఉప్పు, పంచదార, పసుపు, యాలకుల పొడి వేసి.. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా జారుగా ఉండకూడదు. పొడుగ్గా ఉండే నేంద్రన్‌ అరటిపండ్లు తీసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. తొక్క తీసిన పండ్లను సగానికి కోసి, మళ్లీ నిలువుగా సగానికి కోయాలి. ఈ ముక్కలను పిండిలో ముంచి తీసి.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. వేడిగా ఉండగానే కొబ్బరి తురుము చల్లాలి. అంతే.. ప్రత్యేకమైన రుచితో వహ్వా అనిపించే అరటి వడలు రెడీ. 

అప్పమ్‌ ఇష్టు

కావలసినవి: బియ్యం - రెండు కప్పులు, కొబ్బరి తురుము - కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, బేకింగ్‌ సోడా - పావు చెంచా, పంచదార - చెంచా, నూనె - అర కప్పు 
ఇష్టు కోసం: నూనె - 2 చెంచాలు, దాల్చినచెక్క - అరంగుళం ముక్క, లవంగాలు, యాలకులు - 3 చొప్పున, వెల్లుల్లి తరుగు - చెంచా, అల్లం తరుగు - ఒకటిన్నర చెంచా, కచ్చాపచ్చ దంచిన మిరియాలు - చెంచా, కరివేపాకు రెబ్బలు - 2, సగానికి చీల్చిన పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు బంగాళదుంప, బీన్స్‌ ముక్కలు - కప్పు చొప్పున, పచ్చి బఠాణీలు, కారెట్, టొమాటో, కాప్సికం ముక్కలు - ముప్పావు కప్పు చొప్పున, కొబ్బరిపాలు - పావు లీటర్, ఉప్పు తగినంత, పంచదార - చెంచా
తయారీ: బియ్యాన్ని కడిగి, మూడు గంటలు నానబెట్టాలి. ఆ నీళ్లు తీసేసి, జార్‌లో వేయాలి. కొబ్బరి తురుము, అర కప్పు నీళ్లు, ఉప్పు, బేకింగ్‌ సోడా  జతచేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పిండిని జార్‌ లోంచి తీసి, మరో పాత్రలో వేయాలి. బీట్‌ చేయాలి. దీన్ని మూడు గంటలు నానబెట్టాలి. అప్పాలు చేసేందుకు పెనం కాకుండా కడాయిని తీసుకోవాలి. కడాయి వేడయ్యాక గరిటెడు పిండివేసి అది అంతటా పరచుకునేలా కడాయిని అటూ ఇటూ కదిలించి, చుట్టూ కాస్త నూనె వేసి మూతపెట్టాలి. ఒక నిమిషం ఉంచి, తీసేస్తే సరిపోతుంది. అంటే ఒకవైపు వేగితే చాలు. మిగిలిన పిండితోనూ ఇలాగేచేయాలి.
కుక్కర్‌లో నూనె వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, మిరియాలు, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేయాలి. ఉల్లి కాస్త వేగాక.. పచ్చి బఠాణీలు, బంగాళదుంప, బీన్స్, కారెట్, టొమాటో, కాప్సికం ముక్కలు, పావు కప్పు నీళ్లు, కొబ్బరిపాలు,  ఉప్పు, పంచదార జతచేసి.. ఉడికిస్తే సరిపోతుంది. తయారుచేసుకున్న అప్పంను ఈ వెటిటబుల్‌ ఇష్టుతో తింటే సూపర్‌గా ఉంటుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని