సీతాఫల స్వీట్లు.. తింటే వదలరు

సీతాఫలం.. చూపులకు ఎంత సూపరో.. రుచికి అంతకంటే అదుర్స్‌. చలికాలం మాత్రమే దొరికే నజరానా ఇది. ఈ తియ్యటి పండుతో- ఖీర్‌, కస్టర్డ్‌, మిల్క్‌షేక్‌, స్మూథీ, సలాడ్‌, పుడ్డింగ్‌ లాంటివెన్నో చేస్తారు. వాటిల్లో ఇంకొంచెం ప్రత్యేకమైనవి మీకోసం.. ఎంచక్కా చేసేయండి!

Updated : 05 Nov 2023 09:56 IST

సీతాఫలం.. చూపులకు ఎంత సూపరో.. రుచికి అంతకంటే అదుర్స్‌. చలికాలం మాత్రమే దొరికే నజరానా ఇది. ఈ తియ్యటి పండుతో- ఖీర్‌, కస్టర్డ్‌, మిల్క్‌షేక్‌, స్మూథీ, సలాడ్‌, పుడ్డింగ్‌ లాంటివెన్నో చేస్తారు. వాటిల్లో ఇంకొంచెం ప్రత్యేకమైనవి మీకోసం.. ఎంచక్కా చేసేయండి!


సీతాఫల్‌ ఫిర్నీ

కావలసినవి: సీతాఫలం గుజ్జు, పంచదార, బియ్యం - ఒక్కో కప్పు చొప్పున, పాలు - లీటర్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టేబుల్‌స్పూన్‌, బాదం, పిస్తా పలుకులు - చారెడు చొప్పున, యాలకుల పొడి - అర చెంచా

తయారీ: బియ్యాన్ని ఐదారు గంటలు నానబెట్టి, కొన్ని నీళ్లతో గ్రైండ్‌ చేయాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పాలు పోసి.. మధ్యలో కలియ తిప్పుతూ సగమయ్యే దాకా మరిగించాలి. అందులో బియ్యప్పిండి వేసి, ఉండ కట్టకుండా కలియ తిప్పి, పంచదార వేయాలి. మూడు నిమిషాల తర్వాత, సీతాఫలం గుజ్జు వేసి.. ఇంకో ఐదు నిమిషాలు ఉడికించాలి. అందులో యాలకుల పొడి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, బాదం పలుకులు వేసి చిక్కగా అయ్యాక దించాలి. చల్లారాక చిన్న బౌల్స్‌లోకి తీసి.. పైన పిస్తా పలుకులు చల్లి, నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. వహ్వా అనిపించే సీతాఫల్‌ ఫిర్నీ రెడీ.


మిఠాయి

కావలసినవి: చిక్కటి పాలు - లీటర్‌, సీతాఫలం గుజ్జు - 2 కప్పులు, బెల్లం - అర కప్పు, యాలకుల పొడి - పావు చెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - పావు కప్పు, కుంకుమ పువ్వు - కొద్దిగా

తయారీ: సీతాఫలాల్లో గింజలు లేకుండా గుజ్జు తీసి.. ఫ్రిజ్‌లో ఉంచాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పాలు పోసి మరిగించాలి. మీగడ కట్టకుండా మధ్యలో కలియ తిప్పుతుండాలి. పాలు చిక్కబడ్డాక.. బెల్లం, యాలకుల పొడి, కాస్త కుంకుమ పువ్వు వేసి ఇంకో ఐదు నిమిషాలు తక్కువ సెగలో ఉంచి దించేయాలి. చల్లారాక.. సీతాఫలం గుజ్జు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి కలపాలి. ఇంకాస్త కుంకుమ పువ్వు పైన చల్లి.. రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే తియ్యటి రుచికరమైన సీతాఫల్‌ మిఠాయి రెడీ!


హల్వా

కావలసినవి: సీతాఫలం గుజ్జు, ఉప్మా రవ్వ, నెయ్యి, పాలు - ఒక్కో కప్పు చొప్పున, పంచదార - అర కప్పు, కుంకుమ పువ్వు - కొద్దిగా, బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పిస్తాలు - అన్నీ కలిపి కప్పు, యాలకుల పొడి - ఒక చెంచా

తయారీ: ముందుగా సీతాఫలాల నుంచి గుజ్జు తీసి.. పక్కనుంచుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ వేయించుకోవాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నెయ్యి, రవ్వ వేసి తక్కువ సెగలో వేయించాలి. అందులో పంచదార వేసి కలియ తిప్పాలి. నిమిషం తర్వాత పాలు పోసి.. ఉడికించాలి. చిక్కబడింది అనుకున్నాక.. సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి, బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పిస్తాలు వేసి.. సన్న సెగ మీద ఒక నిమిషం ఉంచి, దించేయాలి. అంతే సీతాఫల్‌ హల్వా సిద్ధం. దీన్ని చిన్న బౌల్స్‌లోకి తీసుకుని అలాగే తినొచ్చు. లేదా ఒక ప్లేటులో నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని సమంగా సర్ది.. గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్‌చేసి తినొచ్చు.


సీతాఫల్‌ రబ్డీ

కావలసినవి: ఫుల్‌ ఫ్యాట్‌ పాలు - లీటర్‌, పంచదార పొడి - కప్పు, సీతాఫలాలు - 2, యాలకుల పొడి - అర చెంచా, బాదం, పిస్తా పలుకులు - చారెడు చొప్పున

తయారీ: ముందుగా పాలను మరిగించాలి. సగమయ్యాక దించి చల్లార్చాలి. సీతాఫలాల గుజ్జు తీసి అందులో కలపాలి. యాలకుల పొడి వేసి.. బ్లెండ్‌ చేయాలి. అందులో బాదం, పిస్తా పలుకులు కలిపితే సరి.. సీతాఫల్‌ రబ్డీ తయారైపోతుంది. ఎంతో సులువైన ఈ స్వీటు మహా టేస్టీగా ఉంటుంది.


ఐస్‌క్రీం

కావలసినవి: హెవీ క్రీమ్‌ - 2 కప్పులు, పాలు, పంచదార, సీతాఫలం గుజ్జు - కప్పు చొప్పున, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - తగినంత

తయారీ: అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పాలు, క్రీమ్‌, పంచదార వేసి కలిపి సన్న సెగ మీద వేడిచేయాలి. పంచదార కరగగానే.. దించేసి చల్లారనివ్వాలి. అందులో వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, సీతాఫలం గుజ్జు కలిపి, రెండు గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచితే సరి.. సీతాఫల్‌ ఐస్‌ క్రీమ్‌ తయారైపోతుంది. తిని ఆనందించడమే తరువాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని