వయసు 32.. పుస్తకాలు 153

పుస్తకం రాయడమంటే మాటలేం కాదు! కథయినా.. కవితైనా.. ఫిక్షన్‌ అయినా.. నాన్‌ ఫిక్షన్‌ అయినా.. ముందు కాన్సెప్టు ఎంచుకోవాలి. ఆలోచిస్తూ.. అందంగా అమరేలా రాయాలి. ఆ పుస్తకాన్ని అచ్చు వేయించాలి. వేసినదాన్ని అందరికీ చేరేలా మార్కెటింగ్‌ చేయాలి. ఎంత ప్రహసనం? ఒక్కదానికే ఇంత ఉంటే విశాఖపట్నం యువకుడు చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ ఏకంగా 153 పుస్తకాలు రాసేశాడు.

Updated : 04 Feb 2023 02:33 IST

పుస్తకం రాయడమంటే మాటలేం కాదు! కథయినా.. కవితైనా.. ఫిక్షన్‌ అయినా.. నాన్‌ ఫిక్షన్‌ అయినా.. ముందు కాన్సెప్టు ఎంచుకోవాలి. ఆలోచిస్తూ.. అందంగా అమరేలా రాయాలి. ఆ పుస్తకాన్ని అచ్చు వేయించాలి. వేసినదాన్ని అందరికీ చేరేలా మార్కెటింగ్‌ చేయాలి. ఎంత ప్రహసనం? ఒక్కదానికే ఇంత ఉంటే విశాఖపట్నం యువకుడు చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ ఏకంగా 153 పుస్తకాలు రాసేశాడు.

సినిమాలు.. స్నేహితులతో బాతాఖానీలు.. క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం.. వయసులో ఉన్న కుర్రాళ్లకు ఇలాంటి సరదాలు చాలానే ఉంటాయి. కృష్ణవీర్‌కి రాయడమే ఓ సరదా, వ్యాపకం, ఇష్టం, అలవాటు, అన్నీ. తను పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే రాయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అతగాడి కలం ఆగలేదు. ఏమాత్రం ఖాళీ దొరికినా రాస్తూనే ఉంటాడు. కృష్ణవీర్‌ సగటున ఏడాదికి 12కు పైగా రచనలు చేయడం విశేషం. అయితే కొన్ని రచనలు తానొక్కడే చేయగా... ఇంకొన్ని పలువురు ప్రముఖుల భాగస్వామ్యంతో రాశాడు. వివిధ అంశాల్లో అపారమైన అనుభవం ఉండి, రాయడానికి సమయం లేని వారితో మాట్లాడి కొన్ని విషయాలను సేకరించి పుస్తకాలు రాశాడు.

గాంధీపై అభిమానంతో..

గాంధీజీ అహింసా సిద్ధాంతాలను కొందరు సన్నిహితులే విమర్శించడం చూసి తీవ్రంగా బాధ పడ్డాడు. ఆ మహనీయుడి గొప్పతనం తెలుసుకోవడానికి గాంధీజీ స్వయంగా రాసిన, ఆయనపై పలువురు రచయితలు లిఖించిన పుస్తకాలను నిశితంగా అధ్యయనం చేశాడు. నేటి తరం పాఠకులకు అర్థమయ్యేలా అహింసా మార్గం, ఉద్యమ ప్రస్థానం, ఆయన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, పాటించిన విలువలు, ఇచ్చిన సందేశాలు, రాసిన కథనాల సారం, చూపిన ఆధ్యాత్మిక మార్గం తదితర అంశాలతో ఏకంగా 27 పుస్తకాలు రాసి గాంధీజీపై తన మమకారాన్ని చాటుకున్నాడు.

తొమ్మిది పీజీ కోర్సులు

పుస్తకాలు చదవడం, రాయడంలో ఆసక్తి ఉన్న కృష్ణవీర్‌ తొమ్మిది పీజీలు సైతం పూర్తి చేశాడు. లింగ్విస్టిక్స్‌, సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, ఇంగ్లిషు, హిందీ, తెలుగుల్లో ఎంఏ కోర్సులు.. జర్నలిజం కోర్సు, ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాడు. ఇవిగాక ముప్ఫై వరకు డిప్లొమో, పీజీ డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సులు చేశాడు. లింగ్విస్టిక్స్‌లో పీహెచ్‌డీ సైతం చేశాడు. ఫ్రెంచి, జర్మన్‌, అరబిక్‌ భాషల్లోనూ సర్టిఫికెట్‌ కోర్సులు అందుకొని విదేశీ భాషలపైనా అవగాహన పెంచుకున్నాడు. చదవడం, రాయడంతోపాటు తాను నేర్చుకున్న విషయాల్ని ఇతరులకు చెప్పడం అంటే కృష్ణవీర్‌కి ఇష్టం. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏడేళ్లుగా నిర్వహిస్తున్న సాఫ్ట్‌స్కిల్స్‌ కోర్సుకు శిక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ప్రముఖుల ప్రశంసలు

కృష్ణవీర్‌ రాసిన పుస్తకాలు, రాయడం కోసం పడుతున్న శ్రమని పలువురు ప్రశంసించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి ఓ పుస్తకం గురించి వివరించారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ‘ఇంగ్లిష్‌ ఫర్‌ లాయర్స్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణమోహన్‌ భాగస్వామ్యంతో రాసిన ‘లైఫ్‌ స్కిల్స్‌ అండ్‌ హోలిస్టిక్‌ ఎడ్యుకేషన్‌’ అనే పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆవిష్కరించి ప్రశంసించారు.
బీఎస్‌ రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని