సేవా గురువులు!

ఇలా ప్రతిభకు సానబెడుతూ.. కష్టాల్లో ఆదుకుంటూ వందలమంది జీవితాల్లో వెలుగు నింపుతోంది స్వచ్ఛంద సంస్థ ‘కర్పి’. ఆ డెబ్భై మంది బృంద సభ్యుల సారథి తెలుగు యువకుడు ఆకాష్‌ మాది.

Published : 25 Mar 2023 00:10 IST

ఇలా ప్రతిభకు సానబెడుతూ.. కష్టాల్లో ఆదుకుంటూ వందలమంది జీవితాల్లో వెలుగు నింపుతోంది స్వచ్ఛంద సంస్థ ‘కర్పి’. ఆ డెబ్భై మంది బృంద సభ్యుల సారథి తెలుగు యువకుడు ఆకాష్‌ మాది. వారి సేవానిరతిని మెచ్చుకుంటూ పలు అవార్డులూ వరించాయి.

ఓ అనాథ అమ్మాయికి చిత్రలేఖనం అంటే ఇష్టం...

దగ్గరుండి మరీ నేర్పిస్తాడో అన్నయ్య

ఆ గిరిజన పిల్లాడికి నటనంటే ప్రాణం...

ఎలా నటించాలో చేసి చూపిస్తాడో వలంటీర్‌...

ఒక పేద విద్యార్థికి డబ్బుల్లేక చదువు ఆగిపోయే పరిస్థితి...

తలో చేయి వేసి గట్టెక్కించడానికి ఓ బృందమే ముందుకొస్తుంది...

చెన్నైలోని ప్రభుత్వ, కార్పొరేషన్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు ‘కర్పి’ స్వచ్ఛంద సంస్థ సుపరిచితమే. ఈ తమిళ పదానికి అర్థం ‘నేర్పించడం’. పిల్లలు బడికెళ్లేది నేర్చుకోవడానికే కదా.. మరి వీళ్లు కొత్తగా ఏం నేర్పిస్తారనే సందేహం రావొచ్చు. దానికి ఆకాష్‌ చెప్పే సమాధానం.. ‘పేద విద్యార్థులకు కలలు కనడమే తెలుసు. వాటిని సాకారం చేసుకునే స్తోమత ఉండదు. వారిలోని ప్రతిభను వెలికితీసేలా మేం ఉచితంగా శిక్షణనిస్తాం. చిత్రలేఖనం, మూకాభినయం, నటన, సిలంబ కళ.. ఏదైనా సరే.. వాళ్ల కలలు నెరవేర్చే సైన్యం మా దగ్గరుంది’ అంటాడు.

పుట్టుక: ఆకాష్‌ది గుంటూరు. చిన్నప్పుడే కుటుంబం చెన్నైలో స్థిరపడింది. బీబీఏ పూర్తిచేసి ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న తను కాలేజీ రోజుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీల్లో చురుగ్గా ఉండేవాడు. అప్పుడే సేవాగుణం అలవడిందంటాడు. ఓసారి స్నేహితులతో కలిసి కొంతమంది పిల్లలకు డ్రామా, ఆంగ్ల తరగతులు చెబుతున్నాడు. ఆ సమయంలో కొంతమంది పేద విద్యార్థులు తమకు కొన్ని ఆశలు ఉన్నాయనీ.. వాటిని నెరవేర్చుకునే మార్గం లేదని బాధ పడ్డారు. చలించిన ఆకాష్‌ అలాంటివాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఏడుగురు మిత్రులతో కలిసి 2018 జూన్‌లో కర్పి ప్రారంభించాడు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఎవరికి ఎలాంటి ఆసక్తి ఉందో ఆరా తీశాడు. ఆ పిల్లలకు శిక్షణనిచ్చే ప్రతిభ ఉండి, సామాజిక సేవ చేయాలనే ఆశయం ఉన్న కొద్దిమందిని వలంటీర్లుగా చేర్చుకున్నాడు.

శిక్షకులుగా: ప్రస్తుతం సంస్థలో 70 మంది సభ్యులున్నారు. వాళ్లంతా ఐటీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, హెచ్‌ఆర్‌, మీడియా, బ్యాంకింగ్‌, విద్య, సినిమా, ఇతర రంగాల్లో పని చేస్తున్నారు. కొందరు కాలేజీ విద్యార్థులూ సంస్థతో చేతులు కలిపారు. అంతా కలిసి వారాంతాల్లో ఏ పాఠశాలకెళ్లాలి? ఎలాంటి తరగతులు చెప్పాలనే ప్రణాళిక వేసుకుంటారు. ప్రస్తుతం ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, మ్యూజిక్‌, ఫొటోగ్రఫీ, సినిమా యాక్టింగ్‌, సిలంబం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, తమిళ సంస్కృతుల్లో 700 పైగా విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. కెరియర్‌ గైడెన్స్‌ వర్క్‌షాప్‌లూ నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లల వేధింపులపై అవగాహన కల్పిస్తున్నారు. ఏది గుడ్‌ టచ్‌, ఏది బ్యాడ్‌ టచ్‌, ఎలా రక్షణ పొందాలనేది హాస్యభరితంగా నేర్పిస్తున్నారు. స్కూళ్ల గోడలకు రంగులేయడం, వీధి నాటకాలు, మైమ్‌ ద్వారా మహిళా సాధికారత, భద్రత, దివ్యాంగుల హక్కుల రక్షణ.. తదితర అంశాల్లోనూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. జువెనైల్‌హోమ్‌లోని బాల నేరస్థులకు థియేటర్‌ క్లాస్‌లూ చెబుతున్నారు. కొవిడ్‌ సమయంలో పేదలకు ఆహారం అందించారు.

జీతంలో నుంచి: కొవిడ్‌తో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. చెన్నై చుట్టుపక్కల కొన్ని గిరిజన కుటుంబాల్లోని పిల్లల పరిస్థితి దయనీయంగా ఉందని వాళ్ల అధ్యయనంలో తేలింది. ఇరుళర్‌ తెగ పిల్లలైతే చదువులకు దూరమవుతున్నారు. ఈ సామాజికవర్గాల కోసం ఓ ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభించనున్నట్టు ఆకాష్‌ తెలిపాడు. కర్పి చేస్తోంది మంచి పనైనా.. నిర్వహణకు డబ్బులు కావాల్సిందే. దీనికోసం సభ్యులంతా తమ సంపాదనలో నెలనెలా కొంతమొత్తం వేసుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ల కృషి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో నైపుణ్యాలు పెరిగాయంటున్నారు ఉపాధ్యాయులు. బడి మానేసినవారూ తిరిగొస్తున్నారు. వందలమంది ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. కొందరు పిల్లలు పలు వేదికల మీద తమ ప్రతిభని ప్రదర్శించారు. ఇవన్నీ కర్పి శ్రమకు దక్కిన కొన్ని విజయాలు. ఈ సేవలకు గుర్తింపుగా ‘ఇన్‌స్పైర్‌’, టేక్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ నుంచి ‘ప్రైడ్‌ ఆఫ్‌ హ్యుమానిటీ’ అవార్డులు అందుకుంది సంస్థ.

హిదాయతుల్లాహ్‌ బి, చెన్నై


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని