టెక్నాలజీ అండగా.. వ్యాపారం దండిగా!

స్థిరాస్తి వ్యాపారం, టెక్నాలజీ రంగం.. బొమ్మాబొరుసుల్లాంటివి...ఈ రెండింటినీ ఒక్కచోటికి చేర్చి భారీ విజయం సాధించాడు అజితేష్‌ కొరుపోలు... మొదట్లో వైఫల్యాలు ఎదురైనా.. వెనక్కి తగ్గలేదు... 

Updated : 05 Nov 2022 09:02 IST

స్థిరాస్తి వ్యాపారం, టెక్నాలజీ రంగం.. బొమ్మాబొరుసుల్లాంటివి...ఈ రెండింటినీ ఒక్కచోటికి చేర్చి భారీ విజయం సాధించాడు అజితేష్‌ కొరుపోలు... మొదట్లో వైఫల్యాలు ఎదురైనా.. వెనక్కి తగ్గలేదు...  నిర్మాణ నిర్వాహణ సులభం చేసే యాప్‌ను రూపొందించి వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు... ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకంగా అమెరికా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు విక్రయించాడు... ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించిన చిన్న వయస్కుడిగా ఘనత సాధించిన అజితేష్‌ తన విజయ ప్రస్థానాన్ని ‘ఈతరం’తో పంచుకున్నాడు.

జితేష్‌ అమెరికాలో ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. చదువైపోగానే తండ్రి భాగస్వామిగా ఉన్న సంస్థలో చేరాడు. మూడేళ్లపాటు తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చాడు. మరోవైపు సొంతంగా ‘ఎడ్యుగార్డ్‌’ పేరుతో ఒక అంకుర సంస్థ ఏర్పాటు చేశాడు. దీనికింద నిర్మాణ రంగ నిర్వహణను సులభతరం చేసేలా.. ఇంటలిజెంట్‌ మ్యాపింగ్‌ అప్లికేషన్‌ రూపకల్పనపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో నిర్మాణ రంగంలో వేగంగా వస్తున్న మార్పులను గమనించాడు. దీంట్లో విజయం సాధించాలంటే స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగంలో లోటుపాట్లు తెలియాలనే ఉద్దేశంతో స్నేహితుడు అనిల్‌తో కలిసి స్వయంగా ఏఎస్‌బీఎల్‌ అనే కంపెనీ ఏర్పాటు చేశాడు.

సవాళ్లు ఎదుర్కొని

స్థిరాస్తి రంగంలో పోటీ ఎక్కువ. ఇక్కడ నిలదొక్కుకోవాలనుకుంటే అందరికంటే భిన్నంగా ఉండాల్సిందే. దానికోసం అజితేష్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ ఉపయోగించి టెక్నాలజీని పరుగులు పెట్టించాలనుకున్నాడు. అందులో భాగంగా పలువురు అనుభవజ్ఞులను కొత్తగా నియమించుకొని కీలక బాధ్యతలు అప్పగించాడు. కానీ ఏడాది తిరగకముందే 70 శాతంపైగా ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లారు. అందుకు ప్రధాన కారణం.. సీనియర్‌ ఉద్యోగులు సంప్రదాయ విధానం వదిలి అత్యాధునిక సాంకేతికత వ్యవస్థను అందిపుచ్చుకోలేకపోవడమే. దాంతో అజితేషే స్వయంగా కళాశాలలకు వెళ్లి యువ ఉద్యోగులను ఎంపిక చేసుకున్నాడు. తర్వాత రెండేళ్లు పరిశోధన చేసి.. ఈ రంగంలో పారదర్శకత, వేగం ముఖ్యమని గ్రహించాడు. గుత్తేదార్లు పని పూర్తి చేశాక బిల్లులు అందుకోవడానికి దాదాపు నెలరోజులు పట్టేది. ఇంజినీరింగ్‌, నాణ్యతా విభాగం.. ఇలా మొత్తం ఐదు దశలు దాటితేనే బిల్లు మంజూరయ్యే పరిస్థితి. దీంతో పని ఆలస్యమవుతుండేది. దీనికి విరుగుడుగా ఒక సాంకేతిక అటానమస్‌ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. దీనికోసం యాభైమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో టెక్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. వెబ్‌సైట్‌ అనుభవాలతో కృత్రిమ మేధతో పనిచేసే విశ్వ, ధ్రువ యాప్‌లను అభివృద్ధి చేశాడు. వీటి ద్వారా కంప్యూటరే జాబ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసి బిల్లులు మంజూరు చేసే టెక్నాలజీ రూపొందించాడు. ఇందులో ఏరోజు పనిని ఆరోజే యాప్‌ అప్‌డేట్‌ చేస్తుంది.

కృత్రిమ మేధతో..

స్థిరాస్తి వ్యాపారం ముందుకెళ్లడంలో విక్రయాలే కీలకం. దీనికోసం అమ్మకాల్ని పరుగులు పెట్టించేలా ధ్రువ యాప్‌ రూపొందించారు. ఇదెలా పని చేస్తుందంటే.. వీళ్లు మొదలు పెట్టిన ఒక ఇళ్ల ప్రాజెక్టుకుకి 11 నెలల్లో లక్షా మూడువేల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇందులో నిజంగానే ఇళ్లను కొనుగోలు చేసేవారెవరు? అని తెలుసుకోవడం కష్టం. కానీ ధ్రువ యాప్‌.. ఫోన్‌ చేసినవాళ్లు విచారించిన తీరు, సందర్భం, మాట్లాడిన సమయం, అడిగిన ప్రశ్నలు.. ఇలా అన్నికోణాల్లో విశ్లేషిస్తుంది. వెబ్‌సైట్‌, ఫోన్‌కాల్స్‌, సైట్‌లో ఇంటరాక్ట్‌ అయిన సమాచారం ఆధారంగా ఎవరు సీరియస్‌ వినియోగదారుడో తెలియజేసి వాళ్ల వివరాలను మార్కెటింగ్‌ సిబ్బందికి అందిస్తుంది. ఇదొక అల్గారిథమ్‌లా పని చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా విక్రయాలు సులువుగా చేయగలుగుతున్నామంటాడు అజితేష్‌. దీంతోపాటు ఇంజినీరింగ్‌లో కీలకమైన అడ్వాన్స్‌ వర్క్‌ ప్యాకేజింగ్‌ (ఏడబ్ల్యూపీ)లో అత్యాధునిక సాంకేతికను అభివృద్ధి చేసి అమెరికా కంపెనీకి విక్రయించారు. 

వేయికోట్ల మైలురాయి

ఒకప్పుడు 200 మంది కూలీలనే నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న ఏఎస్‌బీఎల్‌లో ప్రస్తుతం రోజూ 1,300 మంది పని చేస్తున్నారు. ఏటా మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయి. సంస్థ మొదలైన ఐదేళ్లలోనే 40 అంతస్తుల టవర్లను నిర్మిస్తున్నారు. 2021-22 నాటికి రూ.వెయ్యి కోట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించి దేశంలోనే 40 అగ్రశేణి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందడమే కాదు ఈ ఘనత సాధించిన యువ బిల్డర్‌గా అజితేష్‌ ప్రశంసలు అందుకున్నాడు.

- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని