ఈ అందగాడు.. అందరివాడు!

అభిమానులకు సూపర్‌హీరో... అమ్మాయిల కలల రాకుమారుడు.. అందంలో మన్మథుడు.. ఆపన్నుల్ని ఆదుకోవడంలోనూ ముందే! అతగాడే హాలీవుడ్‌ స్టార్‌ క్రిస్‌ ఎవాన్స్‌.

Updated : 12 Nov 2022 12:43 IST

అభిమానులకు సూపర్‌హీరో... అమ్మాయిల కలల రాకుమారుడు.. అందంలో మన్మథుడు.. ఆపన్నుల్ని ఆదుకోవడంలోనూ ముందే! అతగాడే హాలీవుడ్‌ స్టార్‌ క్రిస్‌ ఎవాన్స్‌. పీపుల్‌ మ్యాగజైన్‌ తనని జీవించి ఉన్న వ్యక్తుల్లో సెక్సీయెస్ట్‌ పర్సన్‌గా ఎంపిక చేసింది. ఈ సూదంటు చూపుల శృంగార పురుషుడి విశేషాలివి.

* క్రిస్‌ ఎవాన్స్‌ ఇప్పుడైతే అమ్మాయిల కలల రాకుమారుడు గానీ.. కౌమారంలో తనకి నటి శాండ్రా బుల్లక్‌ అంటే వల్లమాలిన ప్రేమ ఉండేది. తన ఫొటోలు పక్కనే పెట్టుకొని నిద్రించేవాడట.
అమెరికాలో పుట్టాడు. పదహారేళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు క్రిస్‌. ‘బయోడైవర్సిటీ: వైల్డ్‌ ఎబౌట్‌ లైఫ్‌’ అనే చిత్రంతో వెలుగులోకి వచ్చాడు.

సంచలన విజయం సాధించిన ‘ది అవెంజర్స్‌’తో స్టార్‌ హోదా అందుకున్నాడు. ‘కెప్టెన్‌ అమెరికా’తో సూపర్‌హీరో అవతారం దాల్చాడు. ‘ది అవెంజర్స్‌’, ‘ఐస్‌మ్యాన్‌’, ‘థోర్‌’, ‘యాంట్‌మ్యాన్‌’, ‘కెప్టెన్‌ మార్వెల్‌’, ‘స్పైడర్‌మ్యాన్‌: హోంకమింగ్‌’, ‘ది గ్రే మ్యాన్‌’, ‘అవెంజర్‌ సిరీస్‌’లతో వీర విజృంభణ చేశాడు.

వ్యాయామం అంటే క్రిస్‌కి ప్రాణం. టీనేజీ నుంచే కసరత్తులు మొదలుపెట్టాడు. ఇన్నేళ్లలో జిమ్‌కి డుమ్మా కొట్టిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్నే. ‘కనీసం ఫిట్‌నెస్‌ని కాపాడుకోకపోతే మనం నటనలో పర్‌ఫెక్షన్‌ ఎలా చూపించగలుగుతాం?’ అంటాడు.

తెరపై సాహసాలు చేయడమే కాదు.. మెగాఫోన్‌ పట్టుకొని ‘యాక్షన్‌’ చెబుతుంటాడు.. వందల కోట్లు పెట్టి సినిమాలూ నిర్మిస్తుంటాడు క్రిస్‌ ఇవాన్స్‌.

ట్యాప్‌ డాన్స్‌లో దిట్ట. ‘ది ఎలెన్‌ డీజనర్స్‌’ రియాలిటీ షో’ తన నైపుణ్యాల్నీ ప్రదర్శించాడు. గురువు వాళ్ల అమ్మే. మొదట్లో డిస్నీ యానిమేటర్‌గా పని చేయాలని కలలు కనేవాడు.

క్రిస్‌కి భారత్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. 2005లో ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కి వచ్చి మూడు వారాలు గడిపాడు. బౌద్ధ మతం స్వీకరించాడు. లాస్‌ఏంజెల్స్‌లో నిర్వహించే బుద్ధిజం తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతుంటాడు.

అసలే అందగాడు.. ఆపై సినిమా స్టార్‌. అమ్మాయిలు వలచకుండా ఉంటారా? కేట్‌ బాస్వర్త్‌, జెస్సికా బీల్‌, క్రిస్టినా రికీ, డయానా అగ్రాన్‌, మింకా కెల్లీ, శాండ్రా బుల్లక్‌, లిల్లీ కొలిన్స్‌, జెన్నీ స్లేట్‌, లిల్లీ జేమ్స్‌, సెలెనా గోమెజ్‌, అల్బా బాప్టిస్టా.. వీళ్లంతా క్రిస్‌ ప్రేమాయణం నడిపించిన భామలని అంతర్జాలం చెబుతోంది.

ఈ ఫైటింగ్‌ల హీరో మనసూ పెద్దదే. క్యాన్సర్‌ బారినపడ్డ చిన్నారుల కోసం ప్రతి ఏడాది విరాళాలు సేకరిస్తుంటాడు. ఫీడింగ్‌ అమెరికా, మీల్స్‌ ఆన్‌ హీల్స్‌, వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌, నో కిడ్‌ హంగ్రీ అనే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని