నడుస్తూ.. ఆశయాన్ని నడిపిస్తున్నాడు

కొందరు ఆరోగ్యం కోసం నడుస్తారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పాదయాత్రలు చేస్తారు. కిరణ్‌వర్మ మాత్రం ఓ ఉదాత్తమైన ఆశయం కోసం నడుస్తున్నాడు.

Published : 12 Nov 2022 00:20 IST

కొందరు ఆరోగ్యం కోసం నడుస్తారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పాదయాత్రలు చేస్తారు. కిరణ్‌వర్మ మాత్రం ఓ ఉదాత్తమైన ఆశయం కోసం నడుస్తున్నాడు. పదకొండు నెలలుగా, ఎనిమిది వేల కిలోమీటర్లు దాటేసినా.. అలుపెరుగక ఇంకా నడుస్తూనే ఉన్నాడు. ఈ నడక కారణంగా ఇప్పటికి 16వేల మంది రక్తదానం చేశారు. ఈ సంకల్పంతో పరోక్షంగా కొన్ని ప్రాణాలు నిలబడ్డాయి.

కిరణ్‌ది దిల్లీ. చదివింది పదే. అయినా సమాజాన్ని పట్టించుకునే రకం. క్రమం తప్పకుండా రక్తదానం చేసేవాడు. 2016 డిసెంబరులో తనకో ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘ఒక నిరుపేద వ్యక్తి క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.. అత్యవసరంగా రక్తం కావాల’నేది సారాంశం. హుటాహుటిన వెళ్లి ఇచ్చాడు కిరణ్‌. బాధితుడిని ఓసారి పలకరిద్దామని రెండ్రోజులయ్యాక ఆసుపత్రికి వెళ్లాడు. తను మంచి మనసుతో రక్తమిస్తే.. ఆసుపత్రి యాజమాన్యం దానికీ డబ్బులు వసూలు చేసిందనే నిజం తెలిసి నివ్వెరపోయాడు. అంతకన్నా దారుణం.. రోగి భార్య తన భర్తను బతికించుకోవడానికి ఉన్న ఆస్తినంతా అమ్మేసింది. ఆ డబ్బులు సరిపోక చివరికి ఒళ్లు అమ్ముకుంటూ సెక్స్‌వర్కర్‌గా మారింది. ఆ సంగతి తెలియగానే కిరణ్‌కి కన్నీళ్లాగలేదు. వెంటనే ‘ఛేంజ్‌ విత్‌ వన్‌ ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాడు. ఇది వర్చువల్‌ రక్తదాన ప్లాట్ఫామ్‌ ఇందులో బృందంగా ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా వెళ్లి, ఉచితంగా రక్తదానం చేయొచ్చు. తర్వాత దేశమంతా తిరిగి పాదయాత్ర చేయాలనుకున్నాడు. ఉద్యోగ విధులు, కుటుంబ బాధ్యతలతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. కొద్దిరోజులు కష్టపడి ‘సింప్లీ బ్లడ్‌’ అనే యాప్‌ తయారు చేసి కార్యక్రమాలు కొనసాగించసాగాడు. అదలా ఉండగానే.. మరో సంఘటన జరిగింది. దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్లు దొరక్క పదహారేళ్ల పిల్లాడు చనిపోయాడు. అది తెలిసి చలించిపోయాడు. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు అనుకున్నాడు. భార్య జయతి ‘కుటుంబాన్ని నేను చూసుకుంటా. ఉద్యోగం వదిలేసి అయినా నీ ప్రయత్నం చెయ్‌’ అని ప్రోత్సహించింది. వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాడు. రక్తదాన ఆవశ్యకత తెలియజెప్పేలా డిసెంబరు 28న కేరళలోని తిరువనంతపురంలో పాదయాత్ర ప్రారంభించాడు. పదకొండు నెలల్లో ఎనిమిది రాష్ట్రాల్లో 10 లక్షల మందిని కలిశాడు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల మద్దతు కోరాడు. అప్పటికప్పుడే ఒప్పించి 73 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించాడు. అతడి ఆశయం నచ్చి వారణాసిలో రక్తదానాన్ని ప్రోత్సహించేలా కొందరు ఒక మారథాన్‌ కూడా నిర్వహించారు. ప్రస్తుతం పాదయాత్రలో ఎనిమిదివేల కిలోమీటర్లు పూర్తైంది. అతడి చొరవతో 16వేల మంది రక్తదానం చేశారు. 2025నాటికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనేది అతడి ఆశయం.

- చొక్కాల రమేష్‌, జి.పాండురంగశర్మ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని