పేదరికంతో అకండ విజయాలు

పాలమ్మారు.. ఆటో నడిపారు.. ఆఫీస్‌ బాయ్‌గా చేశారు... అయినా అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు.. లాండిగే మణిశ్యామ్‌, భననాసి పవన్‌కుమార్‌లు.

Published : 02 Sep 2023 00:23 IST

పాలమ్మారు.. ఆటో నడిపారు.. ఆఫీస్‌ బాయ్‌గా చేశారు... అయినా అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు.. లాండిగే మణిశ్యామ్‌, భననాసి పవన్‌కుమార్‌లు. పేదరికంపై అలుపెరుగక పోరాడుతూనే.. విజయాల్ని వరుసగా లిఫ్ట్‌ చేస్తున్న ఆ కండల వీరుల స్ఫూర్తి కథనం.


ఆఫీస్‌బాయ్‌.. అంతర్జాతీయ స్థాయిలో

ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి, ఒక సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా చేరాడు పవన్‌. అప్పుడే సిక్స్‌ప్యాక్‌ మీద మోజు కలిగింది. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్లేవాడు. అతడి శ్రద్ధ నచ్చి మంచి శిక్షణనిచ్చేవారు కోచ్‌ కృష్ణచైతన్య. దేహదారుఢ్యం కోసం మంచి ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి పవన్‌ది. అప్పుడూ కృష్ణచైతన్యే ఆదుకునేవారు. తర్వాత పోటీలకు వెళ్లడం ప్రారంభించాడు. 2022లో బెంగళూరులో జరిగిన మిస్టర్‌ ఇండియా పోటీలో మూడో స్థానంలో నిలిచాడు. 2023 జనవరిలో విశాఖ పట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బెంచ్‌ ప్రెస్‌ విభాగంలో బంగారు, వెండి పతకాలు సాధించాడు. 2023 మేలో దిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లోనూ అతడిదే మొదటిస్థానం. ఈ ఆగస్టులో దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పవర్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌ 50 కేజీల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఎవరైనా దాతలు సహకరిస్తే ఇంటర్నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ నిరూపించు కుంటానంటున్నాడు పవన్‌.


పాలమ్ముతూ.. పతకాల పంట

మణికి చదువంటేనే చుక్కలు కనిపించేవి. అయినా ఎలాగోలా డిగ్రీ అయిందనిపించాడు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవాడు. దేహదారుఢ్యం పెంచుకో వాలనుకునేవాడు. అతడి తపనని జిమ్‌ కోచ్‌ కృష్ణచైతన్య గుర్తించారు. బాడీబిల్డర్‌గా రాణించాలనే మణి సంకల్పానికి మార్గదర్శిలా మారారు. బాడీబిల్డింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌లో మేటిగా తీర్చిదిద్దారు. ఆటో మీద పాలు సరఫరా చేస్తూనే, రోజుకి ఐదుగంటలు సాధన చేసేవాడు మణి. ఆ కష్టం ఊరికే పోలేదు. బరిలోకి దిగితే పతకాలు కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో విశాఖపట్నంలో, మేలో దిల్లీలో జరిగిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకాలు కొల్లగొట్టాడు. ఇటీవలే దుబాయ్‌లో నిర్వహించిన 66 కేజీల పవర్‌లిఫ్టింగ్‌లోనూ ఒడుపుగా మొదటి స్థానాన్ని ఎత్తేశాడు. ఇదే ఊపుతో భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలు గెలవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే పేదరికం కారణంగా ఎక్కువ పోటీల్లో పాల్గొనలేకపోతున్నాననీ, స్పాన్సర్లు సహకరిస్తే.. సత్తా నిరూపిస్తానంటున్నాడు. నంద్యాల ప్రాంతంలోని యువతకి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా శిక్షణనిస్తానంటున్నాడు.
 పిల్లనగోయిన రాజు, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని