మాట కదిలించింది..బాధ నడిపించింది!

అమాయకులకు చెడు జరిగితే ‘అయ్యో పాపం’ అనుకుంటాం. అన్యాయంగా ఎవరైనా బలైపోతే చలించిపోతాం. కానీ మనసులు కదిలిన మనుషులు కదిలి.. ఆ చెడు మరోసారి జరగొద్దని చేతల్లోకి దిగేవాళ్లు నూటికో, కోటికో ఒక్కరే ఉంటారు. ఉన్నఫళంగా వాళ్లు సమాజం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు! తమ పరిధిలో అద్భుతాలే చేస్తుంటారు.

Updated : 09 Sep 2023 07:32 IST

అమాయకులకు చెడు జరిగితే ‘అయ్యో పాపం’ అనుకుంటాం. అన్యాయంగా ఎవరైనా బలైపోతే చలించిపోతాం. కానీ మనసులు కదిలిన మనుషులు కదిలి.. ఆ చెడు మరోసారి జరగొద్దని చేతల్లోకి దిగేవాళ్లు నూటికో, కోటికో ఒక్కరే ఉంటారు. ఉన్నఫళంగా వాళ్లు సమాజం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు! తమ పరిధిలో అద్భుతాలే చేస్తుంటారు. ఈ ఇద్దరూ అదే కోవకి చెందుతారు. వారి స్ఫూర్తిదాయక పయనాన్ని ఈతరంతో పంచుకున్నారు.


బాధితురాళ్లకు అండగా..

హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన మొత్తం దేశాన్నే కదిలించింది. కానీ చనిపోయిన ఆ అమ్మాయిపైనా ఇద్దరు ఆకతాయిలు అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాదీ టెకీ శ్రీపద్‌ నందన్‌ వాళ్ల అంతు చూడాలనుకున్నాడు. పదిహేను రోజులు కష్టపడి వాళ్ల చిరునామా కనుక్కొని పోలీసులకు అప్పగించాడు. అది మొదలు.. నాలుగేళ్లుగా ఆపదల్లో ఉన్న అమ్మాయిలకు అండగా నిలిచే చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

శ్రీపద్‌ ఇరవై తొమ్మిదేళ్ల ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇంజినీరింగ్‌ పూర్తవగానే ఆరునెలలు ఒక మీడియా సంస్థలో పని చేశాడు. తర్వాత డిజిటల్‌ మార్కెటింగ్‌ అంకుర సంస్థ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. జీవితం బిందాస్‌గానే గడిచిపోతున్నా.. తనలో సామాజిక స్పృహ ఉండటంతో అప్పుడప్పుడు పలు సమస్యలపై స్పందించేవాడు. 2019లో దిశ సంఘటనతో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాడు. ఇంతకీ తనేం చేస్తాడు? పోకిరీల భరతం పడతాడు. బాధితులు, షి టీమ్స్‌ మధ్య వారధిలా ఉంటాడు. ఆన్‌లైన్‌లో నక్కి అమ్మాయిల్ని వేధించే సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టిస్తాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికి వందకుపైగా కేసుల్ని పరిష్కరించాడు. నేరస్థులు, ఆకతాయిలు కొందర్ని కటకటాల్లోకి పంపించాడు. ఈ క్రమంలో తనకు చాలానే బెదిరింపు కాల్స్‌, ఎసెమ్మెస్‌లు వచ్చాయి. కొందరైతే ఏకంగా చంపేస్తాం అన్నారు. ‘ఇలాంటివి జరుగుతాయి అని ముందే ఊహించి.. బాధితులకు అండగా నిలుస్తున్నా. ఎవరికీ బెదిరే ప్రసక్తే లేద’ంటున్నాడు శ్రీపద్‌. ఒకవైపు ఆన్‌లైన్‌ పోరాటం చేస్తూనే.. తనవంతుగా ప్రత్యక్షంగా పలువురికి సాయం చేస్తున్నాడు. తనకున్న పరిచయాల ద్వారా విరాళాలు సేకరించి కొవిడ్‌లో తల్లిదండ్రులు చనిపోయిన కొందరు పిల్లల చదువు ఆగకుండా ఫీజులు చెల్లిస్తున్నాడు. నలుగురు ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్లకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లోని కొందరు పేద విద్యార్థులకు స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు.. అందిస్తున్నాడు. తొమ్మిది, పదోతరగతి చదువుతున్న అమ్మాయిలకు ఏడాదికి సరిపడా శానిటరీ ప్యాడ్‌లు అందించాడు.

రాజకీయ వ్యూహకర్తగా: ఇప్పుడు దేశమంతా ఎన్నికల, రాజకీయ జ్వరం పట్టుకుంది. నందన్‌ సామాజిక కార్యకర్తనే కాదు.. రాజకీయ వ్యూహకర్త కూడా. ‘అబ్సల్యూటింగ్‌ పొలిటికో’ అనే అంకుర సంస్థ ద్వారా కొందరు రాజకీయ నాయకుల్ని గెలుపు బాట పట్టించాడు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని, మాజీ గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ శిందే కూతురు ప్రణతి, కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి.. వీళ్ల తరఫున ప్రణాళికలు రచించి గెలుపునకు కారణమయ్యాడు. ఈ రాజకీయ పరిచయాల్ని సైతం మంచి పనులు చేయడానికి ఉప యోగిస్తానంటున్నాడు. ‘రాజకీయ నాయకులు తమ మ్యానిఫెస్టోలో రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు. ‘అమ్మాయిలను ఏడిపించే, అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా అణిచి వేస్తాం’ అని అదే మ్యానిఫెస్టోలో పెడితే నేర స్వభావం ఉన్నవాళ్లలో ఒక రకమైన వణుకు పుడుతుంది. అది ఆచరణ రూపం దాల్చడానికి శాయశక్తులా పని చేస్తా’ అంటున్నాడు శ్రీపద్‌.


గిరిపుత్రులకు దారి చూపేలా..

తండ్రితో ఆడుకోవాలని, చంకనెక్కి అల్లరి చేయాలని ప్రతి చిన్నారికీ ఆశగా ఉంటుంది. అదేమాట వారానికోసారి చుట్టపుచూపుగా ఇంటికొచ్చే నాన్నని అడిగాడు చిన్నారి సర్వకోట వికాస్‌. ‘గిరిజనులూ నీలాగే కల్లాకపటం తెలియనివాళ్లు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్లని వదిలేసి రాలేను కదా కన్నా..’ అనేవారు నాన్న. ఆ పసి హృదయంలో ఆ మాట బలంగా నాటుకుపోయింది. పెద్దయ్యాక తనూ అదే బాటలో సాగుతున్నాడు.

ఇరవై మూడేళ్ల సాటి కుర్రాళ్లంతా సినిమాలు, సరదాలు, ప్రేమలంటూ ఎంజాయ్‌ చేస్తుంటే.. వికాస్‌ మాత్రం నిత్యం అడవులు, కొండ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. బాలల అక్రమ రవాణాను అరికడుతున్నాడు. బాల కార్మికులను పనిలోంచి విముక్తులను చేసి, పాఠశాలల్లో చేర్పిస్తున్నాడు. 1992లో వికాస్‌ నాన్న బాలరాజు అరకులో ‘నేచర్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. ఆయన ప్రతి క్షణం ఆదివాసీల కోసమే తపించేవారు. పదిహేనేళ్ల కిందట విజయనగరంలో పిల్లల అక్రమ రవాణా ఆపడానికి ఒక సంస్థ ప్రారంభించారు. ఆ పనిలో పడి వారానికోసారి మాత్రమే విశాఖపట్నంలోని ఇంటికి వచ్చేవారు. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ.. ఇక్కడే ఉండిపొమ్మని అడిగేవాడు వికాస్‌. అది సాధ్యం కాదనీ, తను చేస్తున్న పని ఎంత ముఖ్యమైందో వివరించేవారు ఆయన. కరోనాతో చనిపోయేవరకూ అలుపెరగకుండా శ్రమించారాయన. ఆ సమయంలో 25 వేల మంది గిరిజనులకు కరోనా టీకాలు వేయించారు. ‘ఆపదల్లో, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే మనిషి జన్మకి సార్థకత’ అని నాన్న తరచూ చెప్పే మాట గుర్తు పెట్టుకొని, ఆ ఆశయాన్ని కొనసాగించాలనే నిర్ణయానికొచ్చాడు వికాస్‌. విశాఖపట్నం బస్టాండు, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో బాల కార్మికులు, తప్పిపోయినవారు, భిక్షాటన చేస్తూ జీవించే దాదాపు 2,500 మంది పిల్లలను చేరదీసి కొందరిని తల్లిదండ్రులకి అప్పగించారు. ఎవరూ లేనివారిని వసతిగృహంలో ఉంచి ఆహారం, దుస్తులు అందించి భద్రత కల్పిస్తున్నారు. తర్వాత ప్రభుత్వ చైల్డ్‌లైన్‌ సహకారంతో హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. మనుషుల అక్రమ రవాణా ముఠాలను పట్టుకొని, ఆ పని చేయకుండా వారికి సంస్థ తరఫున కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. పిల్లలు మరోసారి పారిపోకుండా.. వాళ్ల అమ్మానాన్నలతో పిల్లలను పెంచే పద్ధతి, మాట్లాడే తీరు గురించి చెబుతున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు మందులు, పోషకాహారం అందిస్తున్నారు. ఆ వ్యాధి బారిన పడకుండా.. లారీ డ్రైవర్లు, వలసదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. ప్రతి గిరిజనుడు ప్రభుత్వ పథకాలు అందుకునేలా రేషన్‌, ఆధార్‌ కార్డులు ఇప్పిస్తున్నారు. వచ్చిన విరాళాలతో అరకు సమీపంలో అన్నిరకాల సౌకర్యాలతో 15 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ లైబ్రరీ, సైన్స్‌ల్యాబ్‌, బాలల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికాస్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం చాలా కష్టపడి ఇప్పటివరకు 1,700 దాకా బాల్య వివాహాలను ఆపగలిగారు. భవిష్యత్తులో బాల కార్మికులు ఉండకపోవడమే లక్ష్యమంటున్న వికాస్‌ రాష్ట్రప్రభుత్వ బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌గా గుర్తింపు పొందాడు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు


తిగుళ్ల మౌనిక, ఈనాడు పాత్రికేయ పాఠశాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు