చిరు శ్రీమంతుడు

ఓ ఆరోగ్య సమస్య ఆ ఇంటి పెద్ద దిక్కునే కోల్పోయేలా చేసింది...ఆ దుఃఖంలోంచి బయటపడ్డ కొడుకు.. సమస్యలోనే వ్యాపార అవకాశాన్ని వెతుక్కున్నాడు..

Updated : 28 Oct 2023 03:40 IST


ఓ ఆరోగ్య సమస్య ఆ ఇంటి పెద్ద దిక్కునే కోల్పోయేలా చేసింది...ఆ దుఃఖంలోంచి బయటపడ్డ కొడుకు.. సమస్యలోనే వ్యాపార అవకాశాన్ని వెతుక్కున్నాడు...రూ.లక్షల పెట్టుబడితో సంస్థ మొదలు పెట్టి.. కోట్ల టర్నోవర్‌కి తీసుకొచ్చాడు...వందల మందికి ఉపాధి కల్పిస్తూ.. రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచాడు...దిల్లీలో ముగిసిన అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం అందుకొని దేశం దృష్టినీ ఆకర్షించాడు...అతడే చిరుధాన్యాలతో శ్రీమంతుడిగా మారిన కర్నూలు యువకుడు పోగుల సోమశేఖర్‌.

ఎంబీఏ పూర్తయ్యాక కొన్నాళ్లు మార్కెటింగ్‌ ఉద్యోగం చేశాడు సోమశేఖర్‌. ఆ సమయంలో ఆయన తండ్రి మధుమేహంతో బాధ పడేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరికి మూత్రపిండాలు పాడై ప్రాణాలు కోల్పోయారు. నాన్న మరణం సోమశేఖర్‌ని బాగా కుంగదీసింది. పరిష్కారం గురించి ఆలోచిస్తుంటే.. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడమే ఈ దీర్ఘకాలిక సమస్యను అడ్డుకుంటుందని తెలిసింది. అయితే ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో తీవ్రమైన కొరత ఉండటం గమనించాడు. వాటిని తానే ఎందుకు పండించి అమ్మకూడదు? అనే ఆలోచన మొదలైంది. మిత్రుడు కడింపల్లి మోహన్‌కుమార్‌తో పంచుకుంటే తానూ చేతులు కలుపుతానన్నాడు.  

ఉద్యోగం వదిలేసి..

2015లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు సోమశేఖర్‌. చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీని లాభదాయంగా మార్చడమెలాగో ప్రణాళికలు వేశాడు. రైతుల్ని కలిశాడు. మార్కెటింగ్‌ ప్రణాళికలు వేసుకున్నాడు. ఎనిమిదేళ్ల కిందట ‘అదితి మిల్లెట్స్‌ అండ్‌ ఆర్గానిక్స్‌’ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశాడు. చేస్తోంది వ్యాపారమే అయినా అది నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనుకున్నాడు. చిరుధాన్యాల ఉత్పత్తులు నాణ్యంగా ఉండాలంటే.. ముడిసరుకూ అంతే బాగుండాలి కదా! కొన్ని గ్రామాలకు చెందిన వందలమంది రైతులతో మాట్లాడి వారికి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశాడు. పండిన పంటను కొనుగోలు చేసేలా వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అత్యాధునికమైన యంత్రాలు తెప్పించి.. అధునాతన పద్ధతుల్లో శుద్ధి చేయసాగాడు. రైతులకు నిపుణులతో శిక్షణ, సలహాలు, సూచనలు ఇప్పించాడు. చిరుధాన్యాలను శుద్ధి చేసే ప్రక్రియలో వాటిలో పోషక విలువలున్న పొరలు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దళారులు లేకపోవడంతో.. రైతులకు సేద్యం లాభసాటిగా మారింది. ‘కొర్ర బియ్యం’ ప్యాకెట్ల తయారీతో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం 48 రకాల చిరుధాన్యాలు పండించి అమ్మడం దాకా వెళ్లింది. అదితి మిల్లెట్స్‌కి ఉత్పత్తులు తెలుగు రాష్ట్రాలతోపాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో అమ్ముడవుతున్నాయి. మైసూరులో విస్తృత ఆదరణ లభిస్తుండడంతో అక్కడ ఒక్కచోటే 168 విక్రయ కేంద్రాలు తెరిచారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మీషోలాంటి ఆన్‌లైన్‌ కేంద్రాల్లోనూ ఈ సంస్థ కొర్రలు, రాగులు, అరికెలు, సామలు, ఊదలు, అండు కొర్రలు, వరిగెలు, సజ్జలు, జొన్నలు అందుబాటులో ఉంచింది. ఇది కాకుండా మలేసియాలోని ఓ సంస్థ సైతం వీళ్ల నుంచి మిల్లెట్స్‌ కొనుగోలు చేస్తోంది. రూ. 20లక్షల పెట్టుబడితో మొదలు పెట్టి.. ప్రస్తుతం రూ.6 కోట్ల టర్నోవరున్న సంస్థగా తీర్చిదిద్దాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలమందికి మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

అంతర్జాతీయ సమావేశంలో..

ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అందులో భాగంగా దిల్లీలో ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సమావేశం’ నిర్వహించారు. ఇక్కడ స్టాల్‌ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు అదితి మిల్లెట్స్‌ అండ్‌ ఆర్గానిక్స్‌కు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమాన్ని సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రారంభించారు. చిరుధాన్యాల వాడకం ఆవశ్యకత వివరించారు. 0 తర్వాత ఆయన వీళ్ల స్టాల్‌ని ప్రత్యేకంగా సందర్శించారు.  

బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు, కర్నూలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు