భళా.. ఖగోళ పరిశోధకా!

విశ్వం పుట్టుక.. గ్రహాల గమనం.. ఇలాంటివన్నీ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. వీటిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి

Published : 28 Oct 2023 00:19 IST

విశ్వం పుట్టుక.. గ్రహాల గమనం.. ఇలాంటివన్నీ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. వీటిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. అందులో ‘ఇండియన్‌ పల్సర్‌ టైమింగ్‌ అరే ఎక్స్‌పెరిమెంట్‌’ అనే పరిశోధక సంస్థ చెప్పుకోదగ్గ ఆవిష్కరణ చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక పరిశోధనల్లో మహబూబ్‌నగర్‌ యువకుడు అవినాశ్‌కుమార్‌ పాలాది కీలక పాత్ర పోషించాడు.
అవినాశ్‌ ఓ సాధారణ మెకానిక్‌ కుమారుడు. చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఓ ఫ్రెండ్‌ సరదాగా ‘నువ్వెవరు?’ అన్నాడు. దానికి ‘నేను అవినాశ్‌ని’ అని సమాధానం చెప్పినా.. తర్వాత అసలు నేనెవరు? అనే సందేహం మొదలైంది. తొలి మానవుడు ఎలా పుట్టాడు? ఈ విశ్వం ఎలా ఉద్భవించింది? గ్రహాలన్నీ వేటిని ఆధారం చేసుకొని ఉన్నాయి.. ఇలాంటి సందేహాలు వేధించేవి. ఉపాధ్యాయులు, పుస్తకాలు, అంతర్జాలం ద్వారా నిరంతరం సమాధానాలు అన్వేషించేవాడు. అలా భౌతికశాస్త్రంపై ఒక అవగాహన ఏర్పడింది. అదే జిజ్ఞాసతో చదివి.. ఝార్ఖండ్‌లోని ఐఐటీ ధన్‌బాద్‌లో బీటెక్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ అయ్యాడు. తదుపరి లక్ష్యం అంతరిక్ష రహస్యాలను ఛేదించడం. దానికి అనుగుణంగానే తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఎం.ఎస్‌.చేశాడు. ప్రస్తుతం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- బెంగళూరులో పీహెచ్‌డీ కొనసాగిస్తున్నాడు.

కొత్త టెక్నిక్‌ రూపకల్పన

విశ్వం పుట్టుక అనంతర పరిణామాల గుట్టు విప్పగల సరికొత్త గురుత్వాకర్షణ తరంగాల జాడను గుర్తించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు ‘ఇండియన్‌ పల్సర్‌ టైమింగ్‌ అరే ఎక్స్‌పెరిమెంట్‌’గా ఏర్పడి పరిశోధనలు చేస్తున్నారు. వీళ్లు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఐరోపా దేశాలకు చెందిన పరిశోధకుల ‘ఇంటర్నేషనల్‌ పల్సర్‌ టైమింగ్‌ అరే ఎక్స్‌పెరిమెంట్‌’లో భాగమయ్యారు. నూతన గురుత్వాకర్షణ
తరంగాలను నిర్ధారించేందుకు ఈ బృందం ఏడేళ్లుగా పని చేస్తుంది. పుణెలో జెయింట్‌ మీటర్‌వేవ్‌ రేడియో టెలిస్కోప్‌ ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తూ.. అంతకుముందు పదేళ్లపాటు సేకరించిన డేటాతో పోల్చి చూస్తూ.. కొత్త గురుత్వాకర్షణ తరంగాల జాడను దాదాపు గుర్తించగలిగారు. ప్రొఫెసర్‌ గోపకుమార్‌ సాయంతో.. పీహెచ్‌డీ ప్రాజెక్ట్‌వర్క్‌లో భాగంగా ఈ మిషన్‌లో భాగం కాగలిగాడు అవినాశ్‌. ఖగోళ శాస్త్రంలో పరిశోధక విద్యార్థిగా ఉండటం.. సంస్థ పెట్టిన పలు పరీక్షల్లో నెగ్గడం.. గతంలో చేసిన పరిశోధనల ఆధారంగా ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. నలభై మంది శాస్త్రవేత్తల బృందంతో కలిసి దాదాపు రెండున్నరేళ్లు పరిశోధనలు చేశాడు. ఇందులో భాగంగా ‘వైట్‌ బ్యాండ్‌ టైమింగ్‌ టెక్నిక్‌’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఈ పరిజ్ఞానం సాయంతో టెలిస్కోప్‌ ద్వారా ఒకే సమయంలో రెండు బ్యాండ్‌లలో ఒక నక్షత్రాన్ని చూడొచ్చు. విశ్వంలోని గ్రహాలు ఎంత వేగంతో తిరుగుతున్నాయి.. భూమి బ్యారిసెంటర్‌ పాయింట్‌ ఎక్కడ ఉంది.. నక్షత్రాల మధ్య ఇంటర్‌స్టెల్లార్‌ మీడియం అనే పదార్థాల ఉనికి.. గెలాక్సీలు ఢీకొట్టినప్పుడు వెలువడే శక్తి.. బ్లాక్‌ హోల్స్‌.. ఇలాంటి వివరాలు కచ్చితత్వంతో తెలుసుకునే అవకాశం ఉందంటున్నాడు. ఈ పరిశోధన వివరాలు ఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కె.రమణ, మహబూబ్‌నగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని