విజయాలే.. అతడి వెన్నెముక!

కొడుకు పుట్టాడని కొండంత సంబరపడ్డారు...మూడేళ్లకే కన్నవాళ్ల మురిపెం ముగిసింది! పోలియోతో ఆ కుర్రాడు కాలు కదపలేకపోయాడు... అయినా కంటికి రెప్పలాగే కాపాడుకున్నారు..ఆ రుణం తీర్చుకోవాలనీ.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడాలని తపించాడు.

Published : 04 Nov 2023 00:02 IST

కొడుకు పుట్టాడని కొండంత సంబరపడ్డారు...మూడేళ్లకే కన్నవాళ్ల మురిపెం ముగిసింది! పోలియోతో ఆ కుర్రాడు కాలు కదపలేకపోయాడు... అయినా కంటికి రెప్పలాగే కాపాడుకున్నారు..ఆ రుణం తీర్చుకోవాలనీ.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడాలని తపించాడు. చక్రాల కుర్చీలో ఉంటూనే.. వీల్‌ఛైర్‌ ఫెన్సింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు వట్టివాళ్ల చిన్న వెంకటేశ్వర్లు.

వెంకటేశ్వర్లుది కర్నూలు జిల్లా డోన్‌. కూలికెళ్తేనే పూట గడిచే కుటుంబం. మూడేళ్ల వయస్సులో పోలియో సోకింది. అప్పటిదాకా ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం దక్కలేదు. అయినా ఆ కొడుకుకి ఏ కష్టం రాకుండా పెంచారు అమ్మానాన్నలు. వెంకటేశ్వర్లు కూడా కన్నవాళ్లకి సంతోషం కలిగేలా మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత దివ్యాంగులకు ప్రత్యేకంగా క్రీడలు ఉంటాయని తెలిసి వాటిపై ఆసక్తి పెంచుకున్నాడు. లక్ష్మీనారాయణ అనే గురువు ద్వారా వీల్‌ఛైర్‌ ఫెన్సింగ్‌ (కుర్చీలో కూర్చొని చేసే కత్తి యుద్ధం) గురించి తెలిసింది. మూడునెలలు శిక్షణ తీసుకున్నాడు. చక్రాల కుర్చీలోనే బయటికి వెళ్లిరావడం.. దూరప్రయాణాలు చేయడం ఎంతో కష్టంగా ఉండేది. పైగా కాళ్లు కదపలేనివాడు ఏం సాధిస్తాడని
కొందరి సూటిపోటి మాటలు. ఇవేమీ లెక్క చేయకుండా కసిగా సాధన చేసేవాడు. బరిలోకి దిగాక చిన్నచిన్న పోటీలు నెగ్గుతూ.. 2019లో చెన్నైలో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొని కంచు పతకాన్ని సాధించాడు. అప్పట్నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 2021లో హరియాణా, 2022లో భువనేశ్వర్‌, 2023లో హరియాణాల్లో పోటీల్లో పాల్గొని సత్తా చూపాడు. ఇదిగాక పవర్‌లిప్టింగ్‌, వీల్‌ఛైర్‌ బ్యాడ్మింటన్‌లోనూ వెంకటేశ్వర్లుకి ప్రావీణ్యం ఉంది. 2019లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి 120 కిలోల పవర్‌లిఫ్టింగ్‌ పోటీలో, 2021లో అనంతపురం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌, పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఒకవైపు క్రీడలపై ఆసక్తి చూపిస్తూనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ చదివాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో అప్రెంటిస్‌షిప్‌ చేస్తున్నాడు. పుస్తకాలతో దోస్తీ చేస్తూనే రోజూ ఫెన్సింగ్‌ సాధన చేస్తున్నాడు. ‘నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా కన్నతల్లే కారణం. నాకు అంగవైకల్యమని ఏనాడూ చిన్నచూపు చూడలేదు. నేను పాల్గొనే ప్రతి క్రీడలో నా తమ్ముడు తోడుంటాడు. వాళ్లు గర్వపడేలా.. రాబోయే పారా ఒలింపిక్స్‌లో దేశం తరఫున పాల్గొని పతకం గెలవాలన్నదే నా కల’ అంటున్నాడు వెంకటేశ్వర్లు.

పిల్లనగోయిన రాజు, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు