సృజనాత్మక సేవ్యాపారం..

తనయ్‌ది కోల్‌కతా. వాళ్లకి టెక్స్‌టైల్‌ పరిశ్రమలున్నాయి. సహజంగానే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండేవాడు. వీటితో పర్యావరణానికి కలుగుతున్న నష్టం గురించి ఓసారి పత్రికలో చదివాడు.

Updated : 11 Nov 2023 07:24 IST

లక్షలు, కోట్ల రూపాయల పెట్టుబడే అక్కర్లేదు..
లక్షణమైన లక్ష్యం ఉంటే చాలంటున్నారు...
సంప్రదాయానికి భిన్నంగా వ్యాపార బాట పడుతున్నారు...
సమాజ, పర్యావరణహితమనే ఆశయాన్నీ జోడించారు...
తమ పరిధిలో పలువురికి ఉపాధీ కల్పిస్తున్నారు...
సరికొత్తదారిలో సాగుతున్న ఆ ముగ్గురు
ఔత్సాహికుల ప్రస్థానమిదిగో.


హితమే లక్ష్యంగా..

టెక్స్‌టైల్‌ రంగంలో మనదేశంలో ఏడాదికి 9.2 కోట్ల టన్నుల వ్యర్థాలు బయటికొస్తున్నాయి. మొత్తం వాయు కాలుష్యంలో దీని వాటా 10శాతం. ఈ గణాంకాలు తనయ్‌ జైన్‌ని తీవ్ర ఆలోచనల్లో పడేశాయి. ఆ అంతర్మథనంలో నుంచి ఓ అంకురసంస్థ ప్రారంభించాడు. ఓవైపు వ్యాపారం చేస్తూనే ఫ్యాబ్రిక్‌ తుక్కు నుంచి దుస్తులు రూపొందించి వేలమంది పిల్లలకు ఉచితంగా అందజేస్తున్నాడు.

తనయ్‌ది కోల్‌కతా. వాళ్లకి టెక్స్‌టైల్‌ పరిశ్రమలున్నాయి. సహజంగానే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుండేవాడు. వీటితో పర్యావరణానికి కలుగుతున్న నష్టం గురించి ఓసారి పత్రికలో చదివాడు. అది తగ్గించేలా ఏదైనా చేయాలనుకున్నాడు. వస్త్రాల ఫ్యాబ్రిక్‌ సహజంగా నేచురల్‌ యార్న్‌, ఫిలమెంట్స్‌, ప్లాస్టిక్‌, ఇతర మెటీరియల్‌తో తయారవుతుంటుంది. చీరలు, లెహెంగాలు, షూటింగ్‌, షర్టింగ్‌లాంటివి తయారీ క్రమంలో కొన్ని చిన్నచిన్న ముక్కలు మిగులుతాయి. ఈ తుక్కును కాల్చడమో.. గోతులు తీసి పూడ్చడమో చేస్తుంటారు. వీటినే సేకరించి, కుట్టుతో ఈ ముక్కల్ని అతికిస్తున్నాడు. అప్‌సైక్లింగ్‌ ద్వారా వాటితో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు స్కూల్‌ డ్రెస్‌లు, లెహెంగాలు, కుర్తాలు, కుర్తీలు, గౌన్లు తయారు చేయిస్తున్నాడు తనయ్‌. దీనికోసం 2018లో ‘కాత్రాన్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించాడు. తమ సొంత పరిశ్రమలతోపాటు కోల్‌కోతాలో ఇతర ఫ్యాక్టరీల్లోంచి ఈ ఫ్యాబ్రిక్‌ స్క్రాప్‌ సేకరిస్తున్నాడు. ఇప్పటివరకు రూపొందించిన ఈ డ్రెస్‌లను పశ్చిమ్‌బంగా, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లోని దాదాపు ఆరున్నర వేల మంది పిల్లలకు అందించాడు. కరోనా సమయంలో లక్షలకొద్దీ మాస్కులు తయారు చేసి ఉచితంగా పంచాడు. ఈ సాయం చేయడానికి దాదాపు నలభై స్వచ్ఛంద సంస్థలు అతడితో చేతులు కలిపాయి. ‘మా కుటుంబ వ్యాపారంతోపాటు నాకంటూ ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఉంది. ఆ వ్యాపారం కొనసాగిస్తూనే పేద పిల్లలకు సాయపడేలా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాను. ఈ రకంగా సేవ చేయడానికి పెద్దఎత్తున అవకాశం ఉంది. యువత, పరిశ్రమవర్గాలు ముందుకు రావాలని కోరుతున్నా’ అంటున్నాడు తనయ్‌.


ప్రకృతిపై ప్రేమతో అమెరికాకి బై

అమెరికాలో ఏసీ ఆఫీసులో ఉద్యోగం.. డాలర్లు పోగేసుకునే అవకాశం. ఇవన్నీ వదిలేసి సొంతూరు వచ్చేశాడు అనిల్‌కుమార్‌ యాదవ్‌.  ప్లాస్టిక్‌ భూతాన్ని తగ్గించేలా పర్యావరణహిత వ్యాపారం ప్రారంభించాడు. మహిళలకే ఉపాధి అనే లక్ష్యంతో కదులుతున్నాడు.

అనిల్‌ది నంద్యాల. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక ఓ ఫార్మా కంపెనీలో ఆరేళ్లు ఉద్యోగం చేశాడు. పెళ్లి చేసుకోవాలని గతేడాది భారత్‌ తిరిగొచ్చాడు. ఓరోజు ప్లాస్టిక్‌ వాడకం, దానివల్ల కలిగే దుష్ఫలితాలపై ఇంట్లో సీరియస్‌గా చర్చ సాగింది. అప్పటికప్పుడే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చాడు. ఆ నిర్ణయం, ఆలోచనల్లోంచి పుట్టిందే.. అరెకా (వక్క మట్టలు), అరటి చెట్ల ఆకులు, బెరడు, వడ్ల పొట్టు, వెదురు బొంగుల నుంచి ప్లేట్ల తయారీ. దీనికోసం కర్ణాటకలో నాలుగు నెలలు శిక్షణ తీసుకున్నాడు. అప్పటిదాకా కూడబెట్టిన రూ.13లక్షలతో ఇంటిదగ్గరే చిన్న తరహా పరిశ్రమ ప్రారంభించాడు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకే ఉపాధి కల్పించాలనే నియమం పెట్టుకున్నాడు. ప్రస్తుతం కర్ణాటక నుంచి వక్క మట్టలను దిగుమతి చేసుకుంటున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది రిస్కుతో కూడుకున్న వ్యాపారం. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఆకులను ఉదయం బయటకు తీసి, హీట్‌ మిషన్‌తో వేడి చేసి ప్లేట్లుగా మారుస్తారు. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్లేట్‌ ముద్ర సరిగా జరగక తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయినా.. పర్యావరణహితమే ప్రధాన లక్ష్యం కావడంతో.. నామమాత్రపు లాభం తీసుకొని మార్కెటులో ప్రస్తుతం ఉన్నవాటిలో సగం ధరకే ఒక్కో ప్లేటును అమ్ముతున్నానంటున్నాడు అనిల్‌. ఇలాంటి ప్లేట్లకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో.. వీటిని ఎగుమతి చేసే ఆలోచనలో ఉన్నాడు.
కటుకం ప్రేమ్‌కుమార్‌, ఈజేఎస్‌


అరటి వ్యర్థాలే ఆదాయం

అరటి తొక్కల్ని చీప్‌గా చూస్తాం. కోత పూర్తైన అరటి తోటని వ్యర్థంగా ఉంచేేస్తాం. కానీ మధ్యప్రదేశ్‌ కుర్రాడు మేహుల్‌ ష్రాఫ్‌ వీటినే వ్యాపారంగా మలిచాడు. నెలకి రూ.25లక్షల ఆదాయంతో దూసుకెళ్తున్నాడు.

రోడ్డుపై, డస్ట్‌బిన్‌లో... పడేసిన అరటి తొక్కలను అపురూపంగా తీసుకొని సంచిలో వేసుకుంటుంటే.. ఎవరైనా వింతగా చూస్తారు. ఈ తొక్కల్ని ఏం చేసుకుంటారని ఆశ్చర్యపోతారు. కానీ ఆ తొక్కలే మేహుల్‌ వ్యాపారానికి ముడిసరుకు. తను ఎంబీఏ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరకుండా కుటుంబ వ్యాపారంలోకి దిగాడు. ఓసారి బుర్హాన్‌పూర్‌లోని నవసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌నకి హాజరయ్యాడు. అక్కడే అరటి కాండం, ఆకులతో ఫైబర్‌నీ.. దాంతో టెక్స్‌టైల్‌, కాగితంలాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేయొచ్చు అని తెలుసుకున్నాడు. ఈ విషయం అతడిలో ఆసక్తి రేకెత్తించింది. తను ఉండే ప్రాంతంలో ఏటా 40 వేల ఎకరాల్లో అరటి పండుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కోణంలో రెండేళ్లపాటు పరిశోధన చేశాడు. నిపుణులను కలిసి కాండం, ఆకుల నుంచి తయారయ్యే ఉత్పత్తుల సాధ్యాసాధ్యాలు పరిశీలించాడు. ఓ అవగాహనకు వచ్చిన తర్వాత 2018లో ‘ష్రాఫ్‌ ఇండస్ట్రీస్‌’ అంకురసంస్థ ప్రారంభించాడు. రైతుల దగ్గర నుంచి అరటి కాండం, ఆకులు, తొక్కలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీటితో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మిశ్రమంతో బాస్కెట్లు, బుట్టలు, పూలకుండీలు, బ్యాగులు, యోగా మ్యాట్‌లు, చీపుర్లు, చివరికి గోడగడియారాలు సైతం తయారు చేస్తున్నాడు. ఇందులో పని చేయడానికి చుట్టుపక్కల గ్రామాల్లోని నలభైమంది మహిళలకు కొద్దినెలలపాటు శిక్షణనిప్పించి మరీ ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ సంస్థ తయారు చేస్తున్న ఉత్పత్తులన్నీ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయాలే. దీంతో పర్యావరణానికి మేలు చేకూరడమే కాకుండా.. పంట కోత అయ్యాక వ్యర్థాలను తరలించడం.. రైతులకు తలకు మించిన భారం. ఆ ప్రయాస కూడా తప్పుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు