వెయిటర్‌.. అయ్యాడు ఇన్‌స్టా బాస్‌

పాలమ్మాడు.. పూలమ్మాడు.. పెద్ద పోస్టుకి ఎదిగాడు. ఇదొక మంత్రి మాట! అందులో నిజమెంతో తెలియదుగానీ నేను వెయిటర్‌గా, బార్‌టెండర్‌గా పని చేశానంటున్నాడు ఆడమ్‌ మొస్సేరి.

Updated : 25 Nov 2023 01:48 IST

పాలమ్మాడు.. పూలమ్మాడు.. పెద్ద పోస్టుకి ఎదిగాడు. ఇదొక మంత్రి మాట! అందులో నిజమెంతో తెలియదుగానీ నేను వెయిటర్‌గా, బార్‌టెండర్‌గా పని చేశానంటున్నాడు ఆడమ్‌ మొస్సేరి. ఎవరీయన? అంటే చాలామంది యువత దినచర్యలో భాగమైన ఇన్‌స్టాగ్రామ్‌కి అధిపతి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ.. ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల మంది మనసులు గెల్చుకున్న యువ సీఈవో.

గతంలో ఏం చేశామన్నది కాదన్నయ్యా... ఎంతవరకు ఎదిగామన్నదే మనకు ముఖ్యం అంటాడు ఆడమ్‌. దాంతోపాటు ఇతరుల్ని ఇబ్బంది పెట్ట నంతవరకు చేసే ప్రతి పనీ గొప్పదే నంటాడు. అందుకే చిన్నచిన్న పనులు, కొలువులు చేయడం చిన్నతనమేమీ కాదంటాడు. ఈ మాట ఆషామాషీగా.. చెప్పిందేమీ కాదు. నేను వెయిటర్‌గా, బార్‌టెండర్‌గా చేశానని సామాజిక మాధ్యమాల్లో సగర్వంగా చెప్పుకున్నాడు. బయోలో రాసుకొని.. ప్రొఫైల్‌లో పెట్టుకొని ప్రపంచానికి తెలియజేశాడు. దీనికి లైక్‌ల మీద లైక్‌లు పడ్డాయి. కామెంట్ల కుండపోత కురిసింది. ఆడమ్‌ని స్ఫూర్తిగా తీసుకున్న యువత ఇన్‌స్టాలో, లింక్డ్‌ఇన్‌లో.. గతంలో తాము చేసిన ఉద్యోగాల్ని చేర్చడం ఓ ట్రెండ్‌లా మారింది. లింక్డ్‌ఇన్‌లో ఆయన బయో చూసి ‘నువ్వు యువతకి రోల్‌మోడల్‌ బాస్‌’ అని కొందరంటే.. ‘నీ ప్రయాణం మాలాంటి చిరుద్యోగులకు ఓ దారి చూపింది గురూ’ అని మెచ్చుకుంటున్నవాళ్లు ఎంతోమంది. అమెరికాలోని న్యూయార్క్‌లో పుట్టిపెరిగిన మొస్సేరి.. మొదట్లో చిన్నాచితకా పనులు చేస్తూ, ఫేస్‌బుక్‌లో కీలక స్థానానికి ఎదిగాడు. తర్వాత ఇన్‌స్టాకి బదిలీపై వచ్చాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని