అరుదైన మార్గం.. అందలమే లక్ష్యం!

ఎదగడానికి డబ్బే కొలమానం కాదు.. కానీ జీవితంలో ఎంతగా ఎదిగారని చెప్పడానికి డబ్బుని ఓ కొలమానంగా తీసుకోక తప్పదు! సంపాదనని విజయానికి గీటురాయిగానూ భావించొచ్చు. అదే బాటలో పందొమ్మిదేళ్లకే రూ.వేల కోట్లు పోగేసి యంగెస్ట్‌ బిలియనీర్‌ అయ్యాడు క్లెమెంట్‌.  కోటిన్నర రూపాయల జీతం వదిలి.. వందల కోట్ల కంపెనీగా ఎదగాలనే కసితో ముందుకెళ్తున్నాడు శ్రీకాంత్‌.

Published : 02 Dec 2023 00:08 IST

ఎదగడానికి డబ్బే కొలమానం కాదు.. కానీ జీవితంలో ఎంతగా ఎదిగారని చెప్పడానికి డబ్బుని ఓ కొలమానంగా తీసుకోక తప్పదు! సంపాదనని విజయానికి గీటురాయిగానూ భావించొచ్చు. అదే బాటలో పందొమ్మిదేళ్లకే రూ.వేల కోట్లు పోగేసి యంగెస్ట్‌ బిలియనీర్‌ అయ్యాడు క్లెమెంట్‌.  కోటిన్నర రూపాయల జీతం వదిలి.. వందల కోట్ల కంపెనీగా ఎదగాలనే కసితో ముందుకెళ్తున్నాడు శ్రీకాంత్‌. తను ఇష్టపడే వంటకాన్నే వ్యాపారంగా మలచి, వేల కోట్ల విలువైన సంస్థని సృష్టించాడు సాగర్‌ దర్యానీ.  వాళ్ల నుంచి యువత స్ఫూర్తి పాఠాలు పుణికి పుచ్చుకోవాల్సిందే.

రూ.కోటిన్నర జీతం వదిలి

కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థలో ఉద్యోగ అనుభవం.. ఏడాదికి కోటిన్నర జీతం.. అన్నీ వదిలి అంకుర బాట పట్టాడు శ్రీకాంత్‌ బికుమండ్ల. మూడేళ్లు శ్రమించి ప్రపంచవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ఉపయోపడేలా ఒక ప్లాట్‌ఫాం రూపొందించాడు. ఆ ప్రతిభతో ఎస్‌ఏపీ, మైక్రోసాఫ్ట్‌ సంస్థల్ని మెప్పించాడు.

ఎస్‌ఏపీ.. ఈ సంస్థ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా 24 వేల కంపెనీలు భాగస్వాములు. అందులో టీసీఎస్‌, డెలాయిట్‌, ఇన్ఫోసిస్‌లాంటి దిగ్గజ కంపెనీలూ ఉన్నాయి. ఆయిల్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, మీడియా, రీటైల్‌, ఎడ్యుకేషన్‌.. ఇలా దాదాపు అన్ని విభాగాల్లో పని చేస్తుందిది. అయితే మిగతా రంగాలతో పోలిస్తే విద్యా రంగం భిన్నం. ఒక్కో దేశానికి ఒక్కోరకమైన విద్యా విధానం ఉంటుంది. ప్రైవేటు విద్యాసంస్థల తీరూ భిన్నమే. వీటన్నింటినీ ఎస్‌ఏపీ బీటీపీ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చే సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ని రూపొందించమని శ్రీకాంత్‌ని ప్రేరేపించింది ఆ సంస్థ. దానికి అనుగుణంగా ఖరీదైన సాఫ్ట్‌వేర్‌ని ఉచితంగా ఇచ్చింది. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి ఆ ప్లాట్‌ఫామ్‌ని రూపొందించారు.

ఏంటీ సాఫ్ట్‌వేర్‌?: విద్యారంగానికి సంబంధించి సమస్త సమాచారం నిక్షిప్తం చేసే సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాం ఇది. ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ, పెద్ద స్కూళ్లు, గొలుసుకట్టు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వేదికగా ఇది పని చేస్తుంది. ఒక విద్యార్థి కాలేజీలో దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి.. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో కోర్సుల వివరాలు, ప్రవేశం, ఫీజులు, పరీక్షలు, ఫలితాలు, మార్కులు, విద్యా సంవత్సరం పూర్తి చేయడం, పూర్వ విద్యార్థిగా మారడం.. ఇలా ప్రతి దశలో విద్యార్థి అకడమిక్‌, వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ అందులో నిక్షిప్తమై ఉంటాయి. ఎలాంటి కోడింగ్‌ లేకుండా ప్రతి విద్యాసంస్థ ఉపయోగించుకునేలా రెడీ టూ యూజ్‌లా ఈ సాఫ్ట్‌వేర్‌ని తీర్చిదిద్దారు.  

అదే స్ఫూర్తితో: శ్రీకాంత్‌ సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి. చదువుతోనే అద్భుతాలు చేయొచ్చని ముందునుంచీ నమ్మేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక ముంబయి వెళ్లి రిలయన్స్‌ రీటైల్‌ స్టోర్‌ సాఫ్ట్‌వేర్‌లో పని చేశాడు. తర్వాత బెంగళూరులో ఎస్‌ఏపీ సంస్థలో చేరాడు. కొన్నేళ్లు ఉద్యోగం చేశాక ప్రఖ్యాత కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే సంస్థలో కొలువులో కుదురుకున్నాడు. అదే సమయంలో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలోనే పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లమా ఇన్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌ కోర్సు చేశాడు. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ ఉపయోగించుకునేలా ఒక సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాం కొరత ఉందని గ్రహించాడు. దాన్ని అందిపుచ్చుకునేలా స్టార్టప్‌ ప్రారంభించాలనుకున్నాడు. ఆ సమయంలో అతడి జీతం ఏడాదికి రూ.కోటిన్నర. పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఇంతమంచి జీవితాన్ని వదిలి భారత్‌కి రావడం రిస్కు తీసుకోవడమేనని సన్నిహితులన్నారు. అయినా ధైర్యంగా ముందుకే అడుగేశాడు శ్రీకాంత్‌.

సాహసంతో: 2020 డిసెంబరులో రమేశ్‌కుమార్‌తో కలిసి ‘ఎస్‌ఐ6’ పేరుతో బెంగళూరులో స్టార్టప్‌ ప్రారంభించారు. ఎస్‌ఏపీ సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, మేం చెప్పిన విధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించమంటూ రెండు ఐటీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరునెలల సమయం ఇచ్చినా అనుకున్న ఔట్‌పుట్‌ రాలేదు. వాళ్లు చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారని 15మంది ఉద్యోగులను తీసుకొని, వాళ్లకి శిక్షణనిచ్చి అనుకున్నవిధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలనుకున్నాడు. మూడునెలలు గడిచినా అదీ వర్కవుట్‌ కాలేదు. అయితే శ్రీకాంత్‌ది కంప్యూటర్‌సైన్స్‌ డిగ్రీ కావడం, ఐటీతో అనుబంధంగా ఉండే రంగంలోనే పని చేసిన అనుభవం, మేనేజ్‌మెంట్‌పై పట్టు ఉండటంతో తనే సొంతంగా రంగంలోకి దిగాడు. జర్మనీలోని ఎస్‌ఏపీ ఉన్నతోద్యోగులు, నిపుణులతో మాట్లాడుతూనే సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయసాగాడు. ఈ క్రమంలో ఎదురవుతున్న లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూనే రెండేళ్లలో ఎస్‌ఏపీ సంస్థ మెచ్చే విధంగా సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాం రూపొందించగలిగాడు. మరోవైపు తెలంగాణ, ప్రభుత్వం.. టీహబ్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఒమన్‌, ముంబయిలోని ఎస్వీకేఎం యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీలకు ఈ ప్లాట్‌ఫాంతో పనితీరుని ప్రయోగాత్మకంగా వివరించి చూపించగలిగాడు. ఇది మైక్రోసాఫ్ట్‌ కమర్షియల్‌ మార్కెట్‌ప్లేస్‌లో లిస్ట్‌ అయినప్పుడు  దాదాపు రూ.18లక్షల ప్రోత్సాహక పారితోషికం గెల్చుకున్నాడు.

భవిష్యత్తుపై ధీమా: పెద్దపెద్ద సంస్థలు మాత్రమే ఎంతో ఖరీదైన ఈ ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేస్తాయి. అంత ప్రాధాన్యం ఉంది గనకే ఆ సంస్థ నిపుణులు మా ఉత్పత్తిని ఎన్నో రకాలుగా పరీక్షించి ‘ఎస్‌ఏపీ ఇండస్ట్రీ క్లౌడ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌’ అని గుర్తించడమే కాకుండా ఎస్‌ఏపీ రోడ్‌మ్యాప్‌ పొందుపరచడం.. ఘనవిజయమే అంటాడు శ్రీకాంత్‌.


ఇష్టమే.. వ్యాపారంగా

కొందరికి సమోసా.. ఇంకొందరికి వడాపావ్‌ ఇష్టం. కోల్‌కతా కుర్రాడు సాగర్‌ దర్యానీకి మోమోస్‌ (కుడుముల్లాంటివి) అంటే ప్రాణం. ఎక్కడ కనిపించినా ఎగబడి తినేవాడు. కాలేజీకొచ్చేసరికి వీటిలోనే వెరైటీలు తయారు చేసి ఎందుకు వ్యాపారంగా మలచకూడదు? అనుకున్నాడు. మిత్రుడు వినోద్‌ హోమగాయ్‌ చేతులు కలిపాడు. రూ. 30వేలతో 2008లో ఒక ఔట్‌లెట్‌ తెరిచాడు. ఇప్పుడది దేశవ్యాప్తంగా 500 రెస్టరంట్‌ కేంద్రాలతో రూ.రెండున్నరవేల కోట్ల సంస్థగా ఎదిగింది. ప్రతి వ్యాపారం ఎదగడానికి ఓ రహస్యం ఉంటుంది. సాగర్‌ సీఈవోగా ఉన్న ‘వావ్‌ మోమో’ విజయరహస్యం వినియోగదారులు మెచ్చేలా ప్రయోగాలు చేయడం. ఒక్క మోమోస్‌తోనే వందల రకాలు వెరైటీలు కస్టమర్లకు అందిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త రుచుల ప్రయోగాలు చేస్తుంటారు. ఉదాహరణకు బర్గర్‌, మోమోలతో కలపి మోబర్గ్‌ చేస్తారు. రుచి, నాణ్యత, సృజనాత్మకతను ఎప్పుడూ వదల్లేదు. దీంతో వ్యాపారం క్రమంగా విస్తరించింది. ఇది నచ్చి ఇప్పటికి దాదాపు రూ.450 కోట్లు పెట్టారు ఇన్వెస్టర్లు.

లక్ష్యం: పిజ్జాలు అమ్మి డోమినోస్‌ రూ.వేల కోట్లకు ఎదిగింది. చికెన్‌ అమ్ముతూ కేఎఫ్‌సీ దిగ్గజ సంస్థగా అవతరించింది. ఒక భారతీయ కంపెనీ మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు అమ్ముతూ ఆ స్థాయికి ఎదగడమే మా లక్ష్యం అంటాడు సాగర్‌.


టీనేజీ బిలియనీర్‌

బడికెళ్లే వయసులోనే వ్యాపారంపై ఆసక్తి పెంచుకున్నాడు. కాలేజీలో అడుగు పెడుతూ వ్యాపార పాఠాలు ఒంట పట్టించుకున్నాడు. పద్దెనిమిదేళ్లకే వేల కోట్ల వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఫోర్బ్స్‌ అతిపిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచాడు క్లెమెంట్‌ డెల్‌ వెచియో.
క్లెమెంటో తండ్రి లియానార్డో డెల్‌ వెచియో. ఇటలీకి చెందిన బిలియనీర్‌. ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లద్దాల తయారీ కంపెనీ ‘ఎసిలార్‌ లక్సోటికా’కి అధిపతి. నా కుమారుడు ముందు బుద్ధిగా చదువుకొని డిగ్రీ పట్టా అందుకోవాలనుకునేవారు ఆయన. కానీ క్లెమెంట్‌ కౌమారం నుంచే కుటుంబ వ్యాపారాలను తెగ పట్టించుకునేవాడు. అన్నింట్లో తలదూర్చేవాడు. అతడి చొరవ, అమితాసక్తిని గమనించి కొడుకుని వ్యాపార కార్యకలాపాల్లో భాగం చేసేవారు లియోనార్డో. దీంతో సంస్థ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. అతిపెద్ద కంపెనీలైన రేబాన్‌, సన్‌గ్లాస్‌ హట్‌లాంటి కంపెనీలను టేకోవర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన సొంత తెలివితేటలతో సంపాదించిన డబ్బుతో ఇటలీలోని మిలన్‌, వెనిస్‌లాంటి నగరాల్లో రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాడు. మిలన్‌లోని లేక్‌ కామో అనే అత్యంత విలాసవంతమైన విల్లాని చేజిక్కించుకున్నాడు. గతేడాది తండ్రి మరణించడంతో ఆయన ఆస్తిలో 12.5శాతం వారసత్వంగా వచ్చింది. దీంతో పందొమ్మిదేళ్ల వయసులోనే రూ.35వేల కోట్లకు అధిపతి కాగలిగాడు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంటే అమితంగా ఇష్టపడే క్లెమెంట్‌, అవే సబ్జెక్టులతో డిగ్రీ చదవడానికి సిద్ధమవుతున్నాడు.

విజయానికో మాట: ఎదగాలంటే ముందు ఏదైనా ఒక రంగంలో ఆసక్తి పెంచుకోవాలి. విషయాల్ని క్షుణ్నంగా తెలుసుకోవాలి. అవకాశాలు వెతకాలి. ఆపై మనసు పెట్టి పని చేయాలి. విజయం అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని