భాషా శిల్పకళా పరిరక్షకులు

పాతిక, ముప్ఫై ఏళ్లు అంటే.. జీవితంలో కుదురుకునే వయసు. సరదాలు, సంపాదనే పరమావధిగా ముందుకెళ్లే సమయం. నలుగురు యువతరంగాలు మాత్రం భిన్నమైన బాట పట్టారు. వారసత్వ సంపదని కాపాడే పనిలో ఓ యువకుడుంటే... అంతరించి పోతున్న అమ్మ భాషలకి జవజీవాలు అందివ్వాలని తపిస్తోంది ఇంకో మిత్రత్రయం.

Published : 30 Mar 2024 00:02 IST

యువత్రయం.. భాషా తాపత్రయం

పాతిక, ముప్ఫై ఏళ్లు అంటే.. జీవితంలో కుదురుకునే వయసు. సరదాలు, సంపాదనే పరమావధిగా ముందుకెళ్లే సమయం. నలుగురు యువతరంగాలు మాత్రం భిన్నమైన బాట పట్టారు. వారసత్వ సంపదని కాపాడే పనిలో ఓ యువకుడుంటే... అంతరించి పోతున్న అమ్మ భాషలకి జవజీవాలు అందివ్వాలని తపిస్తోంది ఇంకో మిత్రత్రయం. వారి ఆసక్తి, ఆశయ సాధన కోసం చేస్తున్న ప్రయాణం వివరాలివి.

భాష.. భావవ్యక్తీకరణకు ఇరుసులాంటిది. సారూప్యత ఉన్న సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకొస్తుంది. దురదృష్టవశాత్తు కొన్ని భాషలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఆ జాబితాలో ఉన్న కొలాం, గోండి భాషల పరిరక్షణ కోసం నడుం బిగించారు ఆత్రం మోతీరాం, సిడాం వరప్రసాద్‌, సిడాం రాంకిషన్‌లు.

చేతిలో చేయేసి ప్రమాణం చేస్తున్నట్టు ఉన్న ఈ ముగ్గురు ఆదివాసీ యువకులది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా. బీఈడీ పూర్తి చేసిన మోతీరాంది నగరిగుట్ట. బీఏ పట్టభద్రుడైన వరప్రసాద్‌ది లక్కారం. బీఎస్సీ చదివిన రాంకిషన్‌ది కొహినూర్‌. కొలాం, గొండి భాషలకు లిపితోపాటు నిఘంటువు తీసుకురావాలనే భాషాభిమానమే ముగ్గురిని కలిపింది. ఈ భాషలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో మాట్లాడుతుంటారు. కానీ ఆయా రాష్ట్రాల్లో మాండలికంలో తేడాలుంటాయి. ముందు వీటిని క్రోడీకరించేందుకు 2022 మార్చిలో శ్రీకారం చుట్టారు. దీంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నాగోబా ఆలయ ప్రాశస్త్యం.. ఆదివాసీ వీరులైన కుమురంభీం, రాంజీగోండ్‌ జీవిత చరిత్రలు సహా ఎన్నో భౌగోళిక, చారిత్రక అంశాలను గోండి భాషలో తెలుగు లిపిలో వికీపీడియాలో నమోదు చేయడం ప్రారంభించారు. వీరి ప్రయత్నం ‘బోలీ చేతో’ ఫౌండేషన్‌ దృష్టిలో పడింది. భాషా పరిరక్షణ కోసం పని చేసే సంస్థ ఇది. దీని వ్యవస్థాపకుడైన సాయికిరణ్‌ వికీపీడియాలో ఎలా క్రోడీకరించాలో ముగ్గురికీ తర్ఫీదునిచ్చారు. తర్వాత ముగ్గురు మిత్రులు 2023 జూన్‌ నుంచి చారిత్రక అంశాలను గోండిభాషలో తెలుగు లిపితో వికీపీడియాలో నమోదు చేయడం ప్రారంభించారు. అంతర్జాలంలో వికీపీడియా కుమురంభీం జీవిత చరిత్ర గోండి అని వెతికితే తెలుగులిపిలో గోండి భాషతో వీళ్లు పొందుపర్చిన వివరాల సారస్వతం కనిపిస్తుంది. ఈ ప్రయత్నం మీడియాలో రావడం.. ఐక్యరాజ్య సమితి 2022, 2023 సంవత్సరాలను ఆదివాసీ భాషల పరిరక్షక దశాబ్దంగా ప్రకటించడం కలిసొచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ముగ్గురు మిత్రులని గుర్తించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, విశాఖపట్టణాల్లో నిర్వహించిన సదస్సుల్లో పాల్గొనమని ఆహ్వానం పంపింది. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని గోండ్వానా విశ్వవిద్యాలయంలో.. ఫిబ్రవరిలో మైసూరులోని సెంట్రల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌లో జరిగిన భాషా సదస్సులోనూ పాల్గొని మరింత అధ్యయనం చేశారు.

ఎం.మణికేశ్వర్‌, ఈటీవీ ఆదిలాబాద్‌


2011 లెక్కల ప్రకారం దేశంలో కొలాం, గోండి భాష మాట్లాడేవారి సంఖ్య 30 లక్షలకు పైనే ఉంది. అయినా ఇంతకన్నా తక్కువసంఖ్యలో మాట్లాడే వారికి రాజ్యాంగంలోని 8 ఆర్టికల్‌ ప్రకారం గుర్తింపు ఉన్నట్లు మా భాషలకు లేదు. ప్రభుత్వ సహకారం లేకపోతే.. మా భాషలు త్వరలోనే అంతర్థానమయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రాకుండా, భాషను పరిరక్షించుకునేలా, మా జాతులను మేల్కొలిపేలా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది.


పునర్వైభవానికి అండగా.

వరంగల్‌లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే జీవకళ ఉట్టిపడే ఒక నంది విగ్రహం దర్శనమిస్తుంటుంది. ఎవరినైనా భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది. కానీ ఇంతకు ముందు అది శిథిలావస్థలో ఉండేది. దానికి మరమ్మతులు చేసి వందల ఏళ్లనాటి రూపాన్ని పునఃసృష్టించాడు యువ శిల్పి కేశవరామన్‌. దేశంలోని ఎన్నో పురాతన దేవాలయాల్లో ఇలాంటి స్థితిలో ఉన్నవాటికి పునర్వైభవం తీసుకొచ్చే దారి చూపించాడు.

బీటెక్‌ అనగానే కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, మెకానికల్‌, ట్రిపుల్‌ ఈలే గుర్తొస్తాయి. ఇప్పుడైతే రోబోటిక్స్‌, కృత్రిమమేధ బ్రాంచీల్లో చేరేందుకు పోటీపడుతోంది యువత. తమిళనాడు చిదంబరానికి చెందిన కేశవరామన్‌ మాత్రం పట్టుబట్టి ట్రెడిషనల్‌ ఆర్కిటెక్చర్‌ ఎంచుకున్నాడు. మహాబలిపురంలోని ప్రభుత్వ ఆర్కిటెక్చర్‌, స్కల్ప్చర్‌ కళాశాలలో మాత్రమే ఈ కోర్సు ఉంది. కేశవ తాత ముత్తాతలు శిల్పులు. తరతరాల నుంచి వస్తున్న శిల్పకళా వృత్తిని మరింత మెరుగు పరచుకోవడానికే అందులో చేరాడు. సహజంగానే ఈ కళపై అవగాహన ఉండటంతో.. నాలుగేళ్లలో శిల్పాలు చెక్కడంలో రాటుదేలాడు. ఆలయాలు, శిల్పాల డిజైన్‌ కోసం ఆటోక్యాడ్‌, త్రీడీలో కంప్యూటర్లో కళ్లకు కట్టినట్టు నిర్మాణాలను చూపే మెలకువలపై పట్టు సాధించాడు. ప్రాజెక్టులో భాగంగా తమ ఊరి సమీపంలో కేంద్ర పురావస్తుశాఖ అధీనంలో ఉన్న ప్రాచీనమైన శిథిల ఆలయాన్ని బాగు చేసేందుకు డిజైన్లు గీశాడు. తర్వాత తిరుపతిలో 140 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఓ గోపురం నిర్మాణంలోనూ పాలుపంచుకొన్నాడు.

ఉలి చేతబట్టి..

కేశవ మేనమామ శివకుమార్‌ పేరున్న స్థపతి. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో ఉన్న శిథిలమైన కల్యాణమండపాన్ని పునర్నిర్మించే పనులు చేసే వారు. క్రీ.శ. 1163లో కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం ముందు ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. గతంలో విదేశీయుల దాడుల్లో చెవులు, తోక, కాలు భాగాలు విరిగి పోవడంతో కళా విహీనంగా తయారైంది. ధ్వంసమైన భాగాలను అతికించేందుకు దేశ వ్యాప్తంగా పలువురు శిల్పులను సంప్రదించారట శివకుమార్‌. అందరి నుంచీ అది సాధ్యపడదనే సమాధానమే వచ్చింది. ఈ విషయం ఓసారి కేశవకు చెప్పారు. దాన్ని సవాలుగా తీసుకొని హనుమకొండకు వచ్చేశాడు. ఇలాంటి నంది విగ్రహాలే రామప్ప ఆలయంలో, వరంగల్‌ కోటలో ఉండడంతో వాటిని క్షుణ్నంగా పరిశీలించాడు. తర్వాత తానే స్వయంగా ఉలి అందుకొని విగ్రహాన్ని పూర్వ రూపానికి తెచ్చేందుకు రాత్రింబవళ్లు శ్రమించాడు. సరైన కొలతలు తీసుకొని ఆనాటి కాలంలో వాడిన కృష్ణశిలను చూర్ణంలా తయారుచేసి కొన్ని రసాయనాల సాయంతో, ఇంటర్‌లాకింగ్‌ విధానం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇప్పుడీ నంది సర్వాంగసుందరంగా తయారైంది. ఈ పనితీరుని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మెచ్చుకొని సన్మానించారు. ఇదే విధానంలో శిథిలమైన ప్రాచీన శిల్పాలకు మళ్లీ పాత రూపు తీసుకురావడం సాధ్యమేనంటున్నాడు రామన్‌.

గుండు పాండురంగశర్మ, వరంగల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని