పచ్చందాల సంక్రాంతినిస్తా!

అరిసెలు.. బొబ్బట్లు.. చకినాలు..పిండివంటలు.. పతంగులు.. కుర్రకారు సందళ్లు...సంక్రాంతి పండగంటే ఇంతేకాదండోయ్‌!

Updated : 14 Jan 2023 02:43 IST

అరిసెలు.. బొబ్బట్లు.. చకినాలు..పిండివంటలు.. పతంగులు.. కుర్రకారు సందళ్లు...సంక్రాంతి పండగంటే ఇంతేకాదండోయ్‌! మనం ఎక్కడున్నా ఒక్కసారి పల్లె మూలాల్లోకి వెళ్లిపోవడం...ప్రకృతితో మమేకం అవడం... మనల్ని మనం గుర్తు చేసుకోవడం...పుడిమికి పచ్చందాల రంగవల్లులు అద్దే ప్రయత్నం చేయడం...అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాడు గన్నవరం యువకుడు ఖాదిర్‌ఖాన్‌. లక్షల సంపాదన వదిలి మట్టిపై మమకారంతో బయో ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వాడాలంటూ ప్రచారం చేస్తున్నాడు.

ఉపాధి, చదువు, వ్యాపారం కోసం ఎక్కడికి వెళ్లినా, ఎక్కడో స్థిరపడ్డా.. యువతలో చాలామంది సంక్రాంతి పండక్కి సొంతూరు చేరుకుంటారు. వాళ్లలాగే డాలర్ల వేట కోసం.. మెరుగైన భవిష్యత్తు కోసం అమెరికా బాట పట్టాడు ఖాదిర్‌ఖాన్‌. కానీ ఓసారి తిరిగి వచ్చినప్పుడు మాత్రం మాతృభూమికి కలకాలం మేలు చేసే పని చేయాలనుకున్నాడు. ఖాదిర్‌ సొంతూరు ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లా గన్నవరం. అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు.. తను చేస్తున్న పనితో పుడమికి హాని కలుగుతోందని భావించాడు. దానికి విరుగుడు కోసం రంగంలోకి దిగాడు. మంచి సంపాదన వదిలి మండుటెండల్లో తిరుగుతూ చెమట్లు చిందిస్తున్నాడు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం బయో ప్లాస్టిక్‌ వాడమంటూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

ఖాదిర్‌ బీటెక్‌ తర్వాత పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎం.ఎస్‌., పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఎం.ఎస్‌.చదువుతున్నప్పుడే యాపిల్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం అయినా చేరలేదు. తనకి సొంత వ్యాపారం చేయాలనుండేది. దాంతో కాలిఫోర్నియాలో రెస్టరెంట్‌ తెరిచాడు. వ్యాపారం బాగానే సాగుతుండేది. అయితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్ల వాడకానికే నెలకి రూ.వేలల్లో ఖర్చయ్యేది. ప్రకృతి ప్రేమికుడైన ఖాదిర్‌కి ఇది నచ్చలేదు. ప్లాస్టిక్‌ భూమిలో కరిగిపోవడానికి వేల, లక్షల సంవత్సరాలు పడుతుంది. మనుషులు, జీవజాలానికి చాలా ప్రమాదకరం. అందుకే వీటికి ప్రత్యామ్నాయం ఏంటని పరిశోధనలు చేశాడు. నిపుణులను కలిశాడు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్లాస్టిక్‌కి బదులు బయో ప్లాస్టిక్‌ బ్యాగులు వాడుతున్నారని తెలిసింది. కొన్నాళ్లపాటు ఈ ఉత్పత్తుల తయారీ ప్రక్రియను తెలుసుకున్నాను. తర్వాత చైనా చెందిన కొన్ని కంపెనీల భాగస్వామ్యంతో ‘ఎకోహబ్‌’ పేరుతో స్టారప్‌ యూనిట్‌ ప్రారంభించాడు. బయో ప్లాస్టిక్‌ సంచులతోపాటు చేతి గ్లౌజులు, మైనింగ్‌లో ఉపయోగించే హెల్మెట్లు, కిచెన్‌లో వాడే యాప్రాన్‌లు తయారు చేయసాగాడు.

కరోనా మార్చింది..

కరోనా రాకతో సాఫీగా సాగుతున్న ఖాదిర్‌ వ్యాపారం మలుపు తిరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆ సమయంలో ఇండియాలోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే అతడికి భారత్‌లోనే ఒక యూనిట్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇక్కడ జనాభాతోపాటు వినియోగం ఎక్కువ. అనుకున్నదే ఆలస్యం లాక్‌డౌన్‌ ఎత్తేయగానే విజయవాడలో పరిశ్రమ తెరిచాడు. ముందు ఆరుగురితో మొదలైన కంపెనీలో ప్రస్తుతం 30 మంది పని చేస్తున్నారు. ఇక్కడ యూనిట్‌ తెరుస్తున్నప్పుడు ‘బంగారం లాంటి ఉద్యోగం వదులుకున్నావు. సవ్యంగా సాగే వ్యాపారం కాదనుకున్నావు. అంత రిస్కు తీసుకోవడం అవసరమా?’ అని సన్నిహితులు హితవు పలికారు. అయినా డబ్బు కన్నా ప్రకృతిని కాపాడడమే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్నాడు. వీళ్ల ఉత్పత్తులు ‘బయో ప్లాస్టిక్‌ పాలివినైల్‌ ఎస్టేట్‌’తో తయారు చేస్తారు. ఇవి ఆరునెలల్లో భూమిలో కలిసి పోతాయి. వీటిని చిన్న తిరుపతి, సింహాచలం, భీమవరం మావులమ్మ గుళ్లలో పంపిణీ చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు వాడమంటూ భారతీయ రైల్వే, దేవాదాయ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాడు. వీటి వాడకం అవసరాన్ని తెలియజెబుతూ హైదరాబాద్‌, చెన్నై, హరియాణా, దుబాయ్‌లలో ప్రదర్శన ఏర్పాటు చేశాడు. మెదట్లో నెలకి 20 టన్నులతో ప్రారంభించి ప్రస్తుతం 300 టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు.
ఎస్‌ శివవరప్రసాద్‌, ఈజేఎస్‌


పర్యావరణాన్ని ప్లాస్టిక్‌ నుంచి కాపాడటం ఏ ఒక్కరితో అయ్యే పని కాదు. అందరూ కలిస్తేనే ఫలితం. నాలాంటి అభిరుచి ఉన్నవారిని ఒక్కచోటికి చేర్చే ఉద్దేశంతో మేం 3 ఎం  (మానుఫ్యాక్చరింగ్‌, మెటీరియల్‌, మెషీన్‌) అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. అంటే ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూనే, ముడిసరుకు అందించి మార్కెటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలాంటి ఉత్పత్తులకు ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని